ఒక ఏడాది ముగుస్తోంది..., మన జీవితంలో కొత్త క్యాలెండర్ రాబోతుంది. ప్రతి సంవత్సరం లాగే టాలీవుడ్ కు ఈ ఏడాది కూడా తీపి చేదులను పంచింది. కొన్ని సినిమాలు చాలా బాగా ఆడాయి. మరికొన్ని సినిమాలు అంతగా ప్రభావం చూపలేదు. అనుకోని హిట్లు కొన్నయితే.., ఆశలు అడియాశలు చేసిన సినిమాలు మరొకొన్ని ఉన్నాయి. అలా హిట్ ఫ్లాపులను కలుపుకున్న ఈ ఏడాది సినిమా క్యాలెడర్ విశేషాలను మీకోసం అందిస్తున్నాము. నెలల వారిగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాలు ఇప్పుడు చూద్దాం.
జనవరి
ఈ ఏడాది తొలి రోజున అంటే జనవరి 1న రెండు చిన్ని సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి కేవీఎం కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘సెలబ్రిటి’ కాగా.. రెండవది ఉదయ్ చందు డైరెక్షన్ లో వచ్చిన ‘క్షత్రియ’. ీ రెండు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. తెలుగువారి పెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతి కానుకగా జనవరి 10న మహేష్ బాబు సినిమా ‘1 నేనొక్కడినే’, రామ్ చరణ్ మూవీ ‘ఎవడు’ విడుదల అయ్యాయి. సుకుమార్ డైరెక్ట్ చేసిన మహేష్ మూవీ ఫ్లాపుగా మిగిలింది. ఫ్యాన్స్ భారీ అంచనాలు అందుకోలేక కథతో వారిని తికమకపెట్టి మొత్తానికి గందరగోళంలో పడింది. ఇక వంశీ పైడిపల్లి తెరకెక్కించిన రామ్ చరణ్ సినిమా మహేష్ తో పోలిస్తే బెటర్ అనుకోవాలి.
పండగ కానుకగా జనవరి 12న వచ్చిన ‘లవ్ యు బంగారం’ మూవీ పండగ ఫ్లాపుగా నిలిచింది. గోవి డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడి రొమాంటిక్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నెల మొదట్లో వచ్చినట్లే నెలాఖరులో కూడా రెండు సినిమాలు వచ్చాయి. నితిన్ నటించిన ‘హార్ట్ ఎటాక్’ లవర్ బాయ్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోకు హైప్ తెచ్చేందుకు పూరీ డైరెక్షన్ బాగా ఉపయోగపడింది. ఈ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన అదాశర్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక 31న విడుదల అయిన ‘పొండవులు పాండవులు తుమ్మెద’ ఓ మోస్తారుగా ఆడింది. మంచు లక్ష్మి మినహా మోహన్ బాబు నట ఫ్యామిలీ అంతా ఇందులో కన్పించింది. కామెడి, రొమాన్స్ కాన్సెప్టకు పర్వాలేదు అనే మార్కులు పడ్డాయి.
ఫిబ్రవరి
రోజులు తక్కువగా ఉండే పిబ్రవరిలో సినిమాలు తక్కవ తీసిపోకుండా విడుదల అయ్యాయి. అయితేనేం ఆకట్టుకోలేక ఇబ్బందులు పడ్డాయి. తొలి వారంలో ఫిబ్రవరి 7న వచ్చిన ‘పైసా’ మూవీ అంచనాలన్నిటినీ తొక్కేసింది. కృష్ణవంశీ మళ్ళీ సినిమా తీస్తున్నాడంటే పరిగెత్తి థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు టికెట్టు పైసలు వృధా అయ్యాయి అని బాధపడ్డారు. అదేరోజన వచ్చిన ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో‘, ‘దిల్ దివానా’ సినిమాలు కూడా ఆడలేదు. లవర్స్ డే స్పెషల్ గా క్యాష్ కలెక్షన్ కాన్సెప్టుతో మూడు సినిమాలు వచ్చాయి. రామ్ భీమన డైరెక్ట్ చేసిన ‘హమ్ తుమ్’ ఓ రొమాంటిక్ యావరేజ్ మూవీ. రాజా వన్నెం రెడ్డి ‘లవ్ డాట్ కామ్’ మూవీ అడ్రస్ కన్పించలేదు.
ఇక 21న వచ్చిన గోకుల్ తెరకెక్కించిన ‘ఆహా కళ్యాణం’ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. నాని, వాణి కపూర్ ఈ మూవీ కోసం బాగా కష్టపడ్డా ఫలితం తక్కువగా దక్కింది. నవీన్ చంద్ర హీరోగా వచ్చిన ‘నా రాకుమారుడు’ ఫ్లాపు లిస్ట్ లో రాసుకోవాల్సిన సినిమాగా మిగిలింది. అలీ హీరోగా వచ్చిన ‘అలీ బాబా ఒక్కడే దొంగ’ సినిమా క్రేజ్ సంపాదించుకోలేదు. ఈ మూవీకి డైరెక్టర్ ఫణి ప్రకాష్ లోపం ఉంది. ఫిబ్రవరి చివరన వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ ఈ ఏడాదిలో సునీల్ కు చివరి సినిమా అయింది. కొందరయితే హీరోగా కూడా ఇదే చివరి సినిమా అన్నారు. మొత్తానికి కమెడియన్ కు ఉన్న క్రేజ్ వల్ల యావరేజ్ గా నడిచిందని చెప్పాలి. చిన్న నెల అయినా.., సినిమాలు బాగానే వచ్చాయి కానీ ఏం లాభం అన్నీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి.
మార్చి
వరుసగా రెండు నెలల పాటు తెలుగు సినిమాలతో ఇబ్బంది పడ్డ తెలుగు ప్రేక్షకులకు మార్చి కాస్త ఊరటనిచ్చింది. ఈ నెలలో వచ్చిన సినిమాలేమిటో చూద్దాం. 7న నవదీప్ హీరోగా ‘ బంగారు కోడిపెట్ట’ కలెక్షన్ల గుడ్లు పెట్టలేదు. రాజ్ పిప్పల్ల మూవీ ఎంత లేటుగా వచ్చిందో అంత త్వరగా వెళ్లిపోయింది. ‘నువ్వే నా బంగారం’ మూవీ కూడా హీరోగా చేశానని చెప్పుకునేందుకు సాయి కృష్ణకు పనికి వస్తుందంతే. అడల్ట్ కామెడి కాన్సెప్టుతో వచ్చిన ‘టు లెట్ ఫర్ బ్యాచిలర్స్’ మూవీ అనుకున్న వారినీ ఆదరించలేకపోయింది.
భారతీ గణేష్ తెరకెక్కించిన ‘యుద్దం’ సినిమా మార్చి 14న విడుదల అయింది. తరుణ్, యామి గౌతమ్ సినిమాకు మార్కులు పడలేదు. అదేరోజున వచ్చిన ‘కమలతో నా ప్రయాణం’ యావరేజ్ మూవీ. 15న ‘హృదయం ఎక్కడుంది’ వచ్చింది ఇందులో సరైన కథ ఎక్కడుందో గుర్తించలేక ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. 21న ‘వేట’, ‘ఎదురులేని అలెగ్జాండర్’ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. 28న బాలయ్య నటించిన ‘లెజెండ్’ విడుదల అయి సంవత్సరపు సంచలనంగా నిలిచింది. ఎన్నో వివాదాల మద్య విడుదల అయి అంతే స్థాయిలో విజయం సాధించింది. అప్పటి రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై బాలయ్య డైలాగుులు, బోయపాటి డైరెక్షన్ సూపర్ హిట్ అయ్యా యి. 275 రోజులు పూర్తి చేసుకుని ప్రొద్దుటూరులో ఇప్పటికీ ఈ సినిమా ఆడుతుంది. ఈదే రోజున వచ్చిన ‘సేవియర్’ ‘బాయ్ మీట్స్ గర్ల్ తొలి ప్రేమకథ’, ‘స్పెషల్ క్లాస్’ సినిమాలు ఆడలేదు.
ఎప్రిల్
ఎండాకాలం మొదలయ్యే ఈ నెలలో వచ్చిన రామ్ గోపాల్ సినిమా ప్రేక్షకులకు చికాకు తెప్పించింది. 4వ తేదీన‘రౌడి’ పేరుతో మోహన్ బాబు రచ్చరచ్చ చేశాడు.., కానీ కలెక్షన్ కింగ్ పేరు నిలబెట్టుకోలేదు. అదే రోజున వచ్చిన ‘హృదయ కాలేయం’ ‘రౌడి’కంటే చాలా బెటర్ అనుకోవాలి. ప్రమోషన్స్ చూసి.., అసలెవడు.., సినిమాలో ఏముంది అని ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లారు. 11న వచ్చిన అల్లు అర్జున్ మూవీ ‘రేసుగుర్రం’ సూపర్ హిట్. మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్ తో పాటు కమెడియన్స్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ కు నవ్వులతోపాటు కలెక్షన్లు కూడా విరబూశాయి.
రవిబాబు తెరకెక్కించిన ‘లడ్డుబాబు’ 18న విడుదల అయింది. అల్లరి నరేష్ ఫ్లాపు సినిమాగా ఇది మిగిలింది. సెన్సేనల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ‘అవతారం’ సినిమాను విడుదల చేయగా అదృశ్యమైంది. ఎన్నికల నేపథ్యంలో తమ్మారెడ్ది విడుదల చేసిన ‘ప్రతిఘటన’ మూవీ పర్వాలేదు అన్పించుకుంది. ‘ప్రభంజనం’ కూడా భాస్కర్ రరావు మెసేజ్ మూవీగా నిలిచింది. ‘చందమామ కథలు’ యావరేజ్. ఎన్నికల హీట్ ఉండటంతో 25న మరో మూవీ వచ్చింది. ‘ప్రతినిధి’ పేరుతో వచ్చిన నారా రోహిత్ మూవీ ఫ్లాపు అయింది.
మే
మే 1న శేఖర్ కమ్ముల సినిమా ‘అనామిక’ ఆయన పేరును నిలబెట్టలేదు. అదే రోజున వచ్చిన అల్లు శిరీష్ సినిమా ‘కొత్తజంట’ ఫ్లాపు కాదు.., అలాగని హిట్ కూడా కాదు. 10న వచ్చిన ‘ఎప్రిల్ ఫూల్’‘ఫ్యార్ మే పడిపోయా’ కూడా ఫ్లాపు. అక్కినేని ఫ్యామిలీ సినిమా ‘మనం’ ఈ ఏడాదిలో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కుటుంబ బంధాలు, అనుబంధాలను వివరించింది. అక్కినేని నాగేశ్వర రావు చివరి సినిమాగా అభిమానులను అలరించింది. 28న ‘డీకేబోస్’, 31న ‘ప్రేమ గీమ జాన్ తా నై’ అట్టర్ ఫ్లాపులు.
జూన్
రెండు నెలలు మూతబడ్డ పాఠశాలలు తెరచుకున్నాయి. ఇదే నెలలో రాష్ట్రం కూడా విడిపోయి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి సమయంలో జూన్ 5న వచ్చిన ‘ఉలవచారు బిర్యాని’, ‘వీడు చాలా వరస్ట్’ సినిమాలు నిజంగా వరస్టే. 13న ‘జంప్ జిలాని’ ‘జాబిలి కోసం ఆకాశమల్లే’ టైటిల్ కు తగ్గట్టే డిఫరెంటుగా ఉన్నాయి..., అంటే హిట్ అని అర్దం కాదు. 20న వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా అనుకోని హిట్. నటుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్టర్ గా మారి తీసిన తొలి సినిమా ఆయనకు, నాగ శౌర్యతో పాటు రాశి ఖన్నాకు సంతోషం ఇచ్చింది.
20నే వచ్చిన ‘మైనే ప్యార్ కియా’ ను ప్రేక్షకులు ప్రేమించలేదు. ‘ఆటో నగర్ సూర్య’ అంటూ నాగ చైతన్య 27న వచ్చాడు. దేవ కట్ట మంచి పొలిటికల్ థ్రిల్లర్ ను ప్లే చేసినా.., సరిగా హ్యాండిల్ చేయలేదు. ‘ఇంకా ఏమి అనుకోలేదు’ గురించి ఏమి చెప్పదలుచుకోలేదు.
జులై
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘రా రా కృష్ణయ్య’ 4న విడుదలై నవ్వుల పాలైంది. అదేవిధంగా ‘ఆ ఐదుగురు’ అనే సినిమా ‘ఆ నలుగురు’ అంత పేరు తెచ్చుకోలేదు. మూవీ ఆఫ్ ది మంత్ గా ‘దృశ్యంను చెప్పుకోవాలి’ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ రీమేక్ సినిమా విడుదల అయ్యేవరకు ఎవరికి తెలియలేదు. కాని థియేటర్లకు వచ్చాక మాత్రం ప్రేక్షకులే ప్రమోటర్లుగా మారి అందర్నీ సినిమాకు తీసుకువచ్చారు.
వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ఎవడు కొంటారు చెప్పండి. అందుకే రామ్ గోపాల్ వర్మ పైత్యంతో విడుదల చేసిన ఫ్లో కెమెరా సినిమా ‘ఐస్ క్రీమ్’ అట్టర్ ఫ్లాపు. ఇదే నెలలో నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు కోసం బాగా ఖర్చుపెట్టి ‘అల్లుడు శ్రీను’ సినిమాను తీసుకొచ్చాడు. వి.వి.వినాయక్ డైరెక్షన్ భారీగా ఉంది కానీ బాగా ఆడలేక బెల్లంకొండను ఇప్పటివరకు కుదురుకోకుండా దెబ్బకొట్టింది.
ఆగస్టు
1న వచ్చిన ‘రన్ రాజా రన్’ అనుకోని హిట్. శర్వానంద్ నటించిన ఈ సినిమా యాక్షన్ మూవీగా ప్రశంసలు పొందింది. యు.వి క్రియేషన్స్ బ్యానర్ కు ఇదో హిట్ మూవీగా రికార్డును ఇచ్చింది. 1న విడుదల అయిన ‘అడవి కాచిన వెన్నెల’, నీలకంఠ సినిమా ‘మాయ’, వెంకట్ సురేష్ ‘గాల్లో తేలినట్టుందే’ ‘ఛాటింగ్’ మూవీలు ఫ్లాపులు. 8న విడుదల అయిన ‘గాలిపటం’, ‘నువ్విలా నేనిలా’, ‘జన్మస్థానం’ సినిమా విడుదల అయి ఫ్లాపులుగా మిగిలాయి.
ఆగస్టు 9న వచ్చిన ‘గీతాంజలి’ హర్రర్ కామెడి మూవీ హిట్ గా నిలిచింది. అంజలికి ఈ ఏడాదికి చెప్పుకోవడానికి ఈ సినిమా చాలు. 15న ‘లవర్స్’, 22న ‘నీ జతగా నేనుండాలి‘, 22న ‘కిరాక్’ ఫ్లాపులే. ఈనెల 29న వచ్చిన ‘రభస’ సినిమా ఫ్లాపు అయింది. ఎన్టీఆర్ కు ఇయర్ బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. ఈ మూవీతో బెల్లంకొండ సురేష్ కష్టాలు మరింత పెరిగాయి. ఈ మూవీ దెబ్బతోనే ఎన్టీఆర్ సినిమాలపై జాగ్రత్తలు మొదలు పెట్టాడు.
సెప్టెంబర్
సెప్టెంబర్ 5న వచ్చిన ‘బూచమ్మ బూచాడు’ పర్వాలేదు. ‘గణపతి బప్పా మోరియా’,‘వీకెండ్ లవ్’ ఫెయిల్యూర్ సినిమాలు. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో వచ్చిన ‘పవర్’ మూవీ రవితేజకు ఇయర్ సూపర్ హిట్ ఇచ్చింది. కె.ఎస్ రవింద్ర డైరెక్ట్ తెరకెక్కించిన ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మించాడు. ఇదే రోజున ‘బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి ఉందా’ సినిమా ప్రేక్షకులు లేని థియేటర్ ను తలపించింది. 13న ‘అనుక్షణం’ సినిమా ఫ్లాపుగా నిలిచింది.
ఈ ఏడాదిలో మహేష్ కు మరో ఫ్లాపు కూడా ఉందండోయ్. ‘1నేనొక్కడినే’ తర్వాత వచ్చిన ‘ఆగడు’పై కూడా భారీ అంచనాలు ఉండేవి. కాని తొలి షో చూసిన తర్వాత మాత్రం కలెక్షన్లు ఆగిపోయాయి. తనకు తెలిసిన కామెడిని మహేష్ పై ప్రయోగించి శ్రీనువైట్ల చాలా తప్పు చేశాడు. ఆఖరుకు రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా ఈ సినిమాపై కామెంట్లు చేశారంటే మహేష్ఎంత చులకన అయ్యాడో తెలుసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత 26న వచ్చిన ‘లౌక్యం’ మంచి హిట్ కొట్టింది. గోపి చంద్ కు బ్లాక్ బస్టర్ గా నిలిస్తే..,, రకుల్ ప్రీత్ ను ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ చేసి లైఫ్ ఇచ్చింది.
అక్టోబర్
ఈ నెలలో చాలా వింతలు జరిగాయి. దసరా పండగ కొందరు హీరోలకు విజయం ఇస్తే మరికొందరకు ఫ్లాపు ఫలితం చూపించింది. అక్టోబర్ 1న వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా బాగానే ఉంది. కలెక్షన్లు మాత్రం బాగా రాబట్టుకోలేకపోయింది. కృష్ణ వంశీ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఫ్యామిలీ హీరోగా ఆకట్టుకున్నాడు. 10న‘రోమియో’ సినిమా వచ్చింది. అన్నయ్య పూరీ తమ్మడు సాయి కోసం ఏదో కధ రాశాడట. ఈ సినిమా చూస్తే పూరి ఇంత చెత్తగా కథ రాస్తాడా అన్పిస్తుంది.
అక్టోబర్ 10కి ఈ ఏడాదిలో ప్రత్యేకత ఉంది. రాజమౌళి అసిస్టెంట్ గా పనిచేసిన త్రికోటి డైరెక్టర్ గా మారి ‘దిక్కులు చూడకు రామయ్య’ అనే సినిమా తీశాడు. చిన్న హీరోగా ఉన్న నాగ శౌర్యకు ఇది పెద్ద హిట్. ఈ ప్రాజెక్టుతో అటు త్రికోటికి ఇటు శౌర్యకు ఆఫర్లు పెరిగాయి. అదేవిధంగా 10న విడుదల అయిన ‘పాఠశాల’ సినిమా కూడా మంచి ప్రయత్నం సినిమా తీసిన మహి రాఘను మెచ్చుకోవాలి.
‘ఆటోనగర్ సూర్య’ అంటూ వంటికి అలవాటు లేని రాజకీయంతో సినిమా తీసి ఫ్లాపు దెబ్బతిన్న నాగ చైతన్య చాలా జాగ్రత్తగా ఓ సినిమా చేశాడు. అదే ‘ఒక లైలా కోసం’ విడుదల వరసగా వాయిదా పడుతుంటే.., సినిమా బాలేదేమో అనుకున్నారంతా. కాని విడుదల అయ్యాక తెలిసింది. లైలా ఎంత కిక్ ఇస్తుందో... లవర్ బాయ్ యాక్షన్ ఎలా ఉందో. ఇక 24న వచ్చిన ‘కార్తికేయ’ సినిమా నిఖిల్ కు కెరీర్ బెస్ట్ మూవీ. తక్కువ బడ్జెట్ తో నిర్మించినా.., భారీ కలెక్షన్లు వసూలు చేసింది. 31న వచ్చిన ‘కరెంటు తీగ’కు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. సన్నీ సినిమా గా ప్రచారం చేసుకున్న మంచు మనోజ్ రిజల్ట్ చూసి చాలా బాధపడ్డాడు.
నవంబర్
నవంబర్ 7న ‘జై హింద్2’ వచ్చింది. అర్జున్ డైరెక్టర్గా హీరోగా పనిచేసినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. అదేవిధంగా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ పర్వాలేదు అన్పించింది. అక్కగా కార్తికకు అవకాశం ఇచ్చి అల్లరి నరేష్ దెబ్బయిపోయాడు. సందీప్ కిషన్ కు ఈ ఏడాదిలో మరో ఫ్లాపు ఉంది. అది ‘జోరు’ రూపంలో వచ్చింది. కుమార్ నాగేంద్ర డైరెక్షన్ లో అవసరానికి మించి సందీప్ ముగ్గురు హీరోయిన్లతో డాన్స్ చేశాడు. అయినా ఏం లాభం..., రిజల్ట్ చూస్తే హీరోకు ఉన్న జోరు తగ్గింది. 7నే‘పరంపర’ వచ్చిందట మీకు తెలుసా.?. అదేవిధంగా 9న ‘పొగ’ కూడా విడుదల అయిందట.
అక్టోబర్ లో తమ్ముడికి దిమ్మ తిరిగితే.., నవంబర్ లో అన్నయ్యకు అట్టర్ ఫ్లాపు పడింది. 14న విడుదల అయిన ‘ఎర్రబస్సు’ దాసరి సినిమా అంతేగానీ.,.., మంచు విష్ణు గురించి చెప్పుకోవటానికి ఏమి లేదు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా విడుదల కాకున్నా బెదరకుండా రెండవ ప్రయత్నం చేసి హిట్ కొట్టాడు. రవికుమార్ తెరకెక్కించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సూపర్ హిట్ అయింది.
‘పోయిన చోటనే తిరిగి రాబట్టుకోవాలి’ అనే ఫార్ములాతో సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ మరోసారి పరువు పోగొట్టుకున్నాడు. 21న విడుదల అయిన ‘ఐస్ క్రీమ్2’ హాట్ మూవీ తప్ప హిట్ మూవీ కాలేదు. నవీన అనవసరంగా అందాలు ఆరబోసింది. నారా రోహిత్ నటించిన ‘రౌడి ఫెల్లో’ డిఫరెంటు కాన్సెప్టుతో విడుదలై పర్వాలేదు అన్పించుకుంది. జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘నా బంగారుతల్లి’ సినిమా కూడా ఇదే నెలలో వచ్చింది. ఎంతగా ప్రమోట్ చేసినా బంగారు తల్లిని ప్రేక్షకులు ఆదరించలేదు. కానీ మంచి సినిమా అని చెప్పాలి. ఎస్వీ కృష్ణారెడ్డి మరోసారి డైరెక్టర్ గా మారి అప్పటి హిట్ మూవీ ‘యమలీల’కు సీక్వెల్ గా ‘యమలీల2’ తీశాడు. సతీష్ సొంతంగా నిర్మించి హీరోగా నటించాడు. మోహన్ బాబు యముడిగా నటించినా కథలో కొత్తదనం లేక చతికిలబడింది. ఇక 28న విడుదల అయిన ‘రఫ్’ ఆదికి ఫ్లాపు ఇచ్చింది. పెళ్లికి ముందు వచ్చిన ఈ మూవీ ఆయన పెళ్లిపై మాత్రం ప్రభావం చూపలేదు. అదేవిధ:గా అనీష్ కృష్ణ తెరకెక్కించిన ‘అలా ఎలా’ కూడా ఫ్లాపు కొట్టింది.
డిసెంబర్
డిసెంబర్ 5న విడుదల అయిన ‘చక్కిలిగింత’ సినిమా ఫ్లాపుగా నిలిచింది. వేమారెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అంచనాలు, ఆదరణ తక్కువగానే ఉన్నాయి. మొదట్లో హిట్లు కొట్టిన నాగ శౌర్య ఏడాది చివర్లో ఇబ్బంది పడ్డాడు. ఆయన నటించిన ‘లక్ష్మి రావే మా ఇంటికి’ అంతగా ఆకట్టుకోలేదు. ఇక రాహుల్ డైరెక్ట్ చేసిన ‘ది ఎండ్’ యువ చంద్రకు బ్యాడ్ ఎండింగ్ అని చెప్పాలి. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ కూడా మంచి కాలం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. డిసెంబర్ 13న వచ్చిన ‘ఈ వర్షం సాక్షిగా’, ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ పర్వాలేదు. వరుణ్ తేజ్ రొమాన్స్ తో బాగా ఎంజాయ్ చేస్తే.., దిలీప్ ఓ సినిమా చేశానని సంతోషపడుతున్నాడు.
డిసెంబర్ 19న ‘ఓ మనిషి కథ’ వచ్చింది . జగపతిబాబు హీరోగా ఆదరణ కోల్పోయాడని దీని రిజల్ట్ చూసి తెలుసుకోవచ్చు. మెగా ఫ్యామిలి నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిస్మస్ కానుకగా విడుదల అయిన ‘ముకుంద’కు మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాకు హీరో ప్లస్ అని కొందరు..., ఆయనే మైనస్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ సినిమా ఫ్లాపు అని చెప్పలేము. ఇక జనవరిలో సూపర్ హిట్ సినిమా ఇచ్చిన నితిన్ డిసెంబర్ లో సూపర్ ఫ్లాపు తీసుకున్నాడు. క్రిస్మస్ కానుకగా వచ్చిన ‘చిన్నదాన నీకోసం’ సినిమా ఆడటం లేదు.
ఇలా ఈ 2014 సంవత్సరం ప్రతి నెలలో హిట్ సినిమాలతో పాటు ఫ్లాపులు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఏడాదిలో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు భారీగా దెబ్బతిన్నాయి. సింపుల్ గా.., సైలెంట్ గా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా ప్రేక్షకులు యాక్షన్ ఎంత కోరుకున్నారో.., థ్రిల్, కామెుడి అంతే కోరుకున్నారు. ఏదో ఒక కథ పెట్టి.., ఎక్స్ పోజింగ్ తో లాగేద్దాము అనుకుంటే సినిమాలనే థియేటర్ నుంచి బయటకు లాగేస్తున్నారు. ప్రేక్షకులు బాగా తెలివి నేర్చకున్నారు. ఈ విషయం గుర్తుంచుకుని సినిమా తీస్తే బాగుంటుంది. అలా చేస్తారని ఆశిస్తూ.., అందరికి ‘తెలుగు విశేష్’ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more