Pawan kalyan and modi face criticizms equally

pawan kalyan and modi face criticisms equally, Pawan Kalyan Janasena party,

pawan kalyan and modi face criticisms equally

పవన్ కళ్యాణ్ కి మోదీకి వ్యతిరేకాలే

Posted: 03/14/2014 08:22 AM IST
Pawan kalyan and modi face criticizms equally

పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెడతానని చెప్పినదగ్గర్నుంచి అన్నిచోట్ల నుంచీ వ్యతిరేకతలు బయటపడ్డాయి. 

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనౌతుందన్నట్లుగా రాజీకీయంగా ఎవరైనా ఎదుగుతున్నారంటే ఓట్లు చీలిపోతాయనే భయం పట్టుకుంటుంది ఇతర రాజకీయ పార్టీలకు.  చిన్నా చితకా స్వతంత్ర అభ్యర్థిని ఎవరూ పట్టించుకోరు కానీ ఇప్పటికే జనాకర్షణ ఉన్న వ్యక్తి లేదా జనాకర్షణ పెరుగుతున్న వ్యక్తి రాజకీయాలలోకి వస్తున్నాడంటే ఇతర పార్టీలకు గుబులు సర్వసాధారణమే. 

ఆ ఒక్క వ్యక్తీ ఒక వైపు ఇతర పార్టీలన్నీ మరోవైపు ఉంటాయి.  వాళ్ళది దాదాపూ ఒంటరి పోరాటమే అవుతుంది.  ఈ విషయంలో పవన్ కళ్యాణ్ దీ మోదీది ఒకే రకమైన పోరాటం సాగుతోంది. 

జనాకర్షణ పెరుగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి అన్ని వైపుల నుంచీ విమర్శలే.  ఏమీ దొరక్కపోతే 2002 గుజరాత్ అల్లర్లు తెరమీదకు వస్తాయి.  ఆయన మాటల్లో ఎక్కడ ఏ తప్పు దొర్లుతుందాని వళ్ళంతా చెవులు చేసుకుని వినే కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకే వాళ్ళు సావధానంగా అప్రమత్తులై ఉంటారు.  వాళ్ళకది ఫుల్ టైం జాబ్.  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కాదు, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా ఆయన మీద అభియోగాలను మోపారు.  ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ప్రసంగాలలో తప్పు దొరకక, వాటిలో నిజానిజాల నిగ్గు తేలుస్తానంటూ గుజరాత్ లో పర్యటించారు.  గుజరాత్ మచ్చ కోర్టు తీర్పుల వలన పోవటం, అమెరికా లాంటి అగ్ర దేశం కూడా మోదీ వీసాను పునరుద్ధరిస్తానని ముందుకు రావటం లాంటి మార్పులు వాళ్ళకి జీర్ణమవటం లేదు.

ప్రధాన మంత్రి అభ్యర్థిగా భాజపా ప్రకటించినా, ఎక్కడి నుండి పోటీ చెయ్యాలన్నది కూడా సమస్య అవటానికి కారణం సొంత పార్టీ నుంచే పోటీలు.  సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీకి వారణాసి కావాలి, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కి లక్నో కావాల!

అదేవిధంగా, పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తారన్న వార్త వచ్చిన దగ్గర్నుంచీ రకరకాల పుకార్ల పవనాలు షికార్లు చేసాయి.  అయితే అదేమీ లేదని, తాము తమ సినీజీవితంలో వ్యస్తులమై ఉన్నామని, రాజకీయాల మీద ఆసక్తి లేదని అప్పట్లో ప్రజలకు చెప్పటమే కాకుండా పవన్ అన్నయ్య నాగబాబు పవన్ కళ్యాణ్ కి కూడా పరోక్షంగా సూచనలిచ్చారు.  రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా శిల్పారామంలో జరిగిన బాలల వేడుకల్లో, ఆరడుగుల బుల్లెట్లా ఉండటం సరే కానీ రాజకీయాలలోకి రాకుండా ఉంటేనే బావుంటుందన్న విషయాన్ని సూచన ప్రాయంగా తెలియజేసారు.  సినిమా ప్రముఖులు చాలామంది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టటాన్ని వివిధ రూపాలలో విమర్శించారు.  తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని, ఆయన సినిమాలు తానేమీ చూడలేదని, చిరంజీవి తమ్ముడని మాత్రం తెలుసని, అన్న దుకణం మూసేస్తె ఇక తమ్ముడు తెరుస్తడా అంటూ వ్యాఖ్యానాలు చేసారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఇటువంటి వ్యతిరేకతలే అన్ని వైపుల నుంచీ వచ్చాయి.  భాజపా భయం నిజమైంది కూడా.  ఢిల్లీలో ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని నెలకొల్పే మెజారిటీ లేకపోయింది.

ఇదంతా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టక ముందు.  ఇక పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవటానికి పెద్దగా ఊహా శక్తి అవసరం లేదు.  పవన్ కళ్యాణ్ సొంత వర్గం కాపునాడు నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది.  సొంత మనుషుల దగ్గర్నుంచి కూడా వ్యతిరేకత రావొచ్చు!  కానీ ఆటలో అరటిపండు అన్నట్లు అంతా ఆ ఆటలో భాగమ!

తమకి అడ్డు అనుకున్నప్పుడే ఎదురు దాడులు జరుగుతాయి.  అందువలన ఎంత ఉధృతంగా నిరసనలు వస్తున్నాయంటే అంత బలంగా ఎదుగుతున్న భయం ప్రత్యర్థులలో కలుగుతున్నట్లు అర్థం.  తప్పదు మరి రోట్లో తలపెట్టిన తర్వాత రోకలి పోటుకి భయపడితే ఎలా?

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles