ఫ్యాన్స్ వార్ కల్చర్ ముగింపు పలకేది ఎప్పుడు | fans war culture need to end in tollywood

Fans war culture need to end in tollywood

Fans war culture in tollywood, Fans culture in tollywood, tollywood heroes fan culturs, tollywood heroes fans clash, vinod royal death, Pawan NTR fans clash, Tollywood fans war special story

Fans war culture need to end in tollywood.

హీరోలు కాదు మీరే గొప్ప

Posted: 08/26/2016 04:34 PM IST
Fans war culture need to end in tollywood

అభిమానం ఒకప్పుడే సినిమాలకే పరిమితమైన ఈ పదం ఇప్పుడు వ్యక్తిగత విషయంగా మారి జీవితాలు బలయ్యే స్థాయికి చేరింది. పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయ్ హత్య ఉదంతమే దీనికి నిదర్శనం. తమ హీరో గొప్ప అంటే గొప్ప అని వాదులాడుకోవటంతో మొదలైన వివాదం అతని ప్రాణం తీసింది. సినిమా అంటే జీవితంలో ఓ వినోద సాధనం, నటుడు అందులోని ఓ పాత్ర.. కానీ, అతడే జీవితం అనుకునే ఫీలింగ్ ను పెంచుకుని, తమ కుటుంబాలకు కన్నీళ్లను మిగల్చడం భావ్యమా?

ఒకప్పుడు సినిమాల వరకు మాత్రమే పరిమితమైన పదమే ఈ అభిమానం . ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు,  అభిమానులు, అభిమాన సంఘాలు ఉండేవి. హీరోల మధ్య ప్రొఫెషనల్ పోటీతత్వం ఉండేది. పర్సనల్ గా వారి మధ్య మంచి సన్నిహిత్యం ఉండేది. ప్రకృతి విపత్తుల సమయంలో, సమాజం కోసం నిర్వహించిన సేవా కార్యక్రమాలు అవసరమైనప్పుడు అంతా కలిసికట్టుగా జోలి పట్టి చందాలు సేకరించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ సమయంలో అభిమానులకు వారంటే ప్రత్యేక అభిమానం, గౌరవం ఉండేవి. వారికి తగ్గట్లే హీరోలు హుందాగా వ్యవహారించేవారు.  


తర్వాతి తరంలో చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లాంటి హీరోలు వచ్చేశారు. అప్పటికీ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. హీరోలకు కట్ ఔట్ లు ఏర్పాటు చేసి, పాలాభిషేకాలు చేసే రేంజ్ కి ఎదిగారు. కానీ, ఈ నలుగురిలో ముగ్గురు నట వారసత్వం నుంచి ఎదగడం, అభిమానులను ఎలా హ్యాండిల్ చేయాలో వారి సీనియర్ల నుంచి నేర్చుకుని ఉండటంతో అది అంతదాకే పరిమితమైంది. ఇక వీరు కూడా సమస్యలు వచ్చాయంటే కలిసికట్టుగానే ఉండేవారు. ఒకరి సినిమా ప్రారంభ వేడుకలకు మరోకరు వెళ్లటం, సినిమాలను ఎంకరేజ్ చేయటం లాంటివి చేయటంతోపాటు, అభిమానులను లిమిట్ లో ఉంచడంతో పోస్టర్లకు దండలు వేయటం వరకే అభిమానం పరిమితమైంది.  


పై రెండు తరాలలో గమనిస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. అభిమానులకు సినిమానే లోకం. అదే సమయంలో మేమంతా కలిసి మెలిసి ఉంటున్నామని హీరోలు చెప్పకనే చెప్పేవారు. కానీ, ఇప్పుడా వాతావరణం లేదు. అదనంగా  కుల, రాజకీయ ప్రస్థావనలు కూడా వచ్చేస్తున్నాయి. వెరసి కొట్టుకుని, చంపుకునే స్థాయికి అది చేరుస్తున్నాయి. వేడుకల దగ్గరి నుంచి సినిమాల దాకా తమ ఫ్యామిలీ, వ్యక్తిగత గొప్పలతో డైలాగులు పేల్చడం, విజిల్స్ వేసి ఆనందించే అభిమానులను చూసి మజా పొందే హీరోలు ఉన్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది.

స్టార్లు చల్లగా ఉంటారు.. అభిమానులు మాత్రం రొడ్డుకెక్కుతారు. స్టార్లు సఖ్యంగానే ఉంటారు... వీళ్లు మాత్రం కుమ్ములాటలకు దిగుతారు. పిచ్చి ఇంకా ముదిరితే పొడుచుకు చంపుకుంటారు. ఇది అభిమానంకాదు ముమ్మాటికీ దురభిమానమే. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు.. ఎవరు గొప్ప.. ? వీరిలో ఎవరెవరికి శత్రువులు, ఎవరెవరికి మిత్రులు.. మీ హీరోలకు స్పష్టత ఉంది.. మరి అభిమానులుగా చించుకుంటున్న వారికుందా? అంటే సమాధానం లేదు. పోనీ తమ తమ ఫ్యాన్స్ ని ఆయా స్టార్లు ఆ దిశగా నడిపిస్తున్నారా? అంటే వినోద్ రాయల్ చనిపోయి ఉండేవాడా?

గతంలో ఫ్లెక్సీ చింపారని ఓ ఇద్దరు హీరోల మధ్య వాదులాట కోట్లాట దాకా దారితీసింది. ఇళ్లపై రాళ్లు వేసుకుని గొడవలకు దిగారు. పోలీసులు అప్రమత్తం కావటంతో హింసకు తావులేకుండా పోయింది. కుమ్ములాటలకు దిగారు.. దాడులు చేసుకున్నారు. ధియేటర్లు ధ్వంసం చేశారు.. మీటింగులు రసాభాస చేసారు.. అన్నిటి వెనుకా ఉన్నది అదే ఫ్యానిజం. కానీ, ఇప్పుడు ఆ పిచ్చి పీక్స్ కు చేరింది. మిగతా వుడ్ లలో లేని కల్చర్ అసలు ఒక్క టాలీవుడ్ లోనే ఎందుకు జరుగుతోంది.  

బాలీవుడ్ లో పాత తరం హీరోల్లో అసలు ఈ పోటీతత్వం అనేది మచ్చుకైనా కనిపించదు. ఇప్పుడున్న ఖాన్ త్రయం లో అంతగా పబ్లిక్ లోకి రాని అమీర్ ను పక్కనబెడితే సల్మాన్, షారూఖ్ ల స్నేహం ఎలా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ ఉన్న వారు పోటీ లేకుండా ఉండటం లేదా? ఇంటి కార్యక్రమాల్లో సైతం పాల్గొనేంత చనువు ఉండటం చూడటం లేదా? హిందీలో మిగతా హీరోలు ఒకరి సినిమాలను మరోకరు ఎలా ప్రమోట్ చేస్తారు, ఎంత ఫ్రెండ్లీగా మెలుగుతారు? ఇవేం మీ కంటపడటం లేదా?


కోలీవుడ్ లో రజనీ, కమల్ ఇప్పటికీ ఎలా ఉంటారు. ఒకరినోకరు ఎలా పొగుడుకుంటారు. అన్ని పంక్షన్లో పెద్దలా ఎలా ముందుండి నడిపిస్తుంటారు. ఇగో లేకుండా ముందుకు వెళ్లటం చూస్తున్నారు కదా. ఇక మరో హీరోద్వయం అజిత్-విజయ్ అభిమానులది మరో టైపు ఫైట్. ఫ్యాన్స్ వార్ చూసి బెంబేలెత్తిపోయిన తలా అజిత్ ఏకంగా తన అభిమాన సంఘాన్నే రద్దు చేసి పడేశాడు. విజయ్ మాత్రం వారిని సేవా కార్యక్రమాలవైపు మళ్లించి కొంత మేర వేడిని తగ్గించడంలో సక్సెస్ అయ్యాడు. హీరో అభిమానంలో గడిపే సమయం కొంత మేర కుటుంబ సభ్యులతో గడపండి అంటూ సూర్య లాంటి నటుడు చెప్పటం చూశాం. కానీ, మనోళ్లకు ఇవేం పట్టవు.  


తెలుగు ఇండస్ట్రీలో ఆ సంస్కృతి హీరోల దగ్గరే లేదు. ఇంక అభిమానుల్లో ఏం నెలకొంటుంది. ఇప్పుడు అగ్రహీరోలుగా చెలామణి అవుతున్న వారు ఏనాడైనా ఒకే కార్యక్రమంలో పాల్గొంటున్నారా? కలిసి ఉండమంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపేలా చూస్తున్నారా? ఎక్కడా లేదు. పైగా ఎమోషనల్ డైలాగులు పెంచి రెచ్చగొట్టడం లాంటివి చేయడం బాగా అలవాటు చేసుకున్నారు. అలాంటప్పుడు ఏ హీరో గొప్ప? ఎవరు నంబర్ వన్? ఎవరు బాగా నటిస్తారు? ఎవరు బాగా ఫైట్లు డాన్సులు ఇరగదీస్తారు? అని ప్రశ్నలు అభిమానులకు ఆటోమేటిక్ గా మైండ్ లో చేరి, బట్టలు చించుకునే స్థాయికి చేరిపోతారు. బ్లైండ్ గా మా హీరో అంటే మా హీరొనే అంటే మా హీరోనే అనే పద్ధతి కొనసాగుతోంది.  సోషల్ మీడియాల్లో ఒకర్నొకరు హేళన చేసుకుంటూ, హీనంగా కామెంట్లు చేసుకుంటూ తమ హీరోలపై వెర్రితనాన్ని పెంచేసుకుంటున్నారు. దీనికి కులతత్వం అదనపు క్వాలిఫికేషన్ గా మారింది. మరి ఈ సంస్కృతికి ఎలా అడ్డుకట్ట వేయాలి? దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? హీరోలా? అభిమాన సంఘాల నేతలా? ఇండస్ట్రీ పెద్దలా? ఎవరు? 


అయ్యా హీరోల్లారా ఇప్పటికైనా కదలండి. తామంతా ఒకటే అని మాట వరుసకు చెప్పటం కాదు. ఆచరణాపూర్వకంగా చేసి చూపండి. తద్వారా అభిమానుల్లో వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేయండి. మీపై అభిమానంతో ఇంకా ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకురాకండి. మీరు చల్లగా ఉంటారు. ఇతర హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.. ఎటొచ్చీ పిచ్చి ముదురేది అభిమానులకే. అభిమానం దురభిమానంగా మార్చుకుని కులానికి, ప్రాంతానికి అన్వయించుకుని హింసకు పాల్పడుతున్నారు. ఫ్యాన్స్ అసోషియేషన్లు సంఘాలు సేవా కార్యక్రమాలకు, సమాజానికి పనికొచ్చే పనులకు మాత్రమే పరిమితం అయ్యేలా చేయండి. మేమంతా ఒక్కటే, మా లైన్ మానవత్వం అని చెప్పిన రోజున ఇలాంటి ఘటనలకు చోటే ఉండదు.  

అభిమానుల్లారా ఇది మీకోసం. ఇండస్ట్రీలో మీ ఒక్క హీరోనే లేడు. మిగతా వారు ఉన్నారు. మీరు ప్రత్యర్థులుగా భావిస్తున్న వారి ఖాతాలో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. మీరు గ్రేట్ గా ఫీలవుతున్న హీరో ఖాతాలో డిజాస్టర్లు ఉన్నాయి. ఆలోచించడండి... అభిమానం గుండెల్లో ఉంచుకోండి కాదనట్లేదు. కానీ, విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడితే మీరు బాధితులు కావటమే కాదు, మీ కుటుంబాలకు తీరని శోకం మిగలక తప్పదు. అదే సమయంలో మీరు అమితంగా ఆదరించే హీరోలు కూడా తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే వైషమ్యాలు వీడండి. సినిమాను ఓ వినోదాత్మక పరికరంగానే చూడండి. మీ లైఫ్ గురించి కూడా ఆలోచించి ఆదర్శవంతమైన జీవితం గడపండి. అలా కాదు హీరోలే జీవితం అనుకుంటే మాత్రం చేజారేది మీ జీవితాలే... బీకేర్ ఫుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Tollywood  Fans  War  Culture  

Other Articles