Bjp in bihar nithesh kumar amith sha manghee

bjp in bihar, bihar politics, amith sha strategy, manghee, nithesh kumar

bjp in bihar nithesh kumar amith sha manghee : in bihar bjp tried to protect manghee govt. bjp mlas may support manghee. in future bjp may loss their cader.

బీహార్ లో బీజేపీ వ్యూహం...పార్టీకి లాభమా? నష్టమా?

Posted: 02/09/2015 06:24 PM IST
Bjp in bihar nithesh kumar amith sha manghee

బీహార్...అభివృద్దికి ఆమడ దూరం అన్న నానుడిని మార్చారు నితీష్ కుమార్. ఆయన సిఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర అభివృద్ది కొత్త పుంతలు తొక్కింది. తరువాత ఎన్నికల్లో పార్టీ పరాభవంతో పదవి నుండి వైదోలిగిన నితీష్ ,తన వారసునిగా రామ్ జితన్ మాంఝిని ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. మాంఝీ పదవి నుండి తప్పుకోవడానికి సిద్దంగా లేకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. పదవి నుండి వైదొలగడానికి ఇష్టపడని మాంఝీ ఏకంగా అసెంబ్లీనే రద్దు చెయ్యడానికి సిద్దపడ్డారు. కానీ జెడియు నాయకులు, నితీష్ వర్గీయులు వెంటనే పార్టీ సమావేశాన్ని నిర్వహించి నితీష్ కుమార్ ను తమ శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

అయితే నితీష్ గత ఎన్నికలకు ముందు ఎన్డీయే తరఫున మోదీ అభ్యర్థిత్వాన్ని ముందు నుండి వ్యతిరేకించారు. బీజెపి తన వైఖరిలో ఎలాంటి మార్పు చేయకుండా, మోదీనే తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో ఎన్డీయేతో ఉన్న అనుబంధాన్ని తెంపుకున్న జెడియు మోదీకి వ్యతిరేకంగా కార్యాచరణ ప్రారంభించింది. యుపిఎ, ఎన్డీయేలకు మద్దతు పలుకుతున్న ప్రాంతీయ పార్టీలను తన వైపుకు తిప్పుకోవాలని చూసినా అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు. తరువాత ఎన్నికల్లో భాజపా ప్రభంజనం కొనసాగింది. ఇక ఇప్పుడు కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు నితీష్ కుమార్ అధికారంలోకి రాకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

బీహార్ ముఖ్యమంత్రి పగ్గాలు జితిన్ రామ్ మాంఝీ నుండి నితీష్ కుమార్ కు మారకుండా బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మాంఝీకి తన మద్దతు పలుకుతోంది. అయితే ఇది బీహార్ లో భాజపా బలపడడానికి లేదా భాజపా గెలవడానికి ఎలా సహాయపడుతుందని రాజకీయ విశ్లేషకుల సందేహం. గతంలో కాంగ్రెస్ వేసిన తప్పటడుగులే ఇప్పుడు భాజపా వేస్తోందా అనే సందేహం కలుగుతోంది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో జేడియుకు 111 మంది సభ్యులు, 87 మంది భాజపాకు చెందిన సభ్యులు, 24 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. అయితే మాంఝీ తన బలనిరూపణకు అవసరమైన సీట్లు ఉన్నాయని గట్టిగా చెబుతున్నారు. ఈ నెల 20 న పట్నాలో పార్టీ శాసనసభ సామావేశాన్ని నిర్వహించనున్నట్లు మాంఝీ ప్రకటించారు. సభలో బలనిరూపనకు అవసరమైతే భాజపా సాయం తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు మాంఝీ అనుచరులు ఒకరు ప్రకటించారు.

మొత్తానికి ప్రస్తుతం మాంఝీ అధికారంలో కొనసాగడానికి కావలసిన మద్దతును భాజపా నుండి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితి నుండి మాంఝీని బయట పడేయడానికి మాత్రమే తమ మద్దతు ఉండబోతోందని భాజపా వర్గాల సమాచారం. కానీ ఇలా భాజపా బీహార్ లో అవలంబిస్తున్న వైఖరి దానికి భవిష్యత్తులో తీరని నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. స్వతహాగా బలాన్ని పెంచుకోవాల్సిన భాజపా ఇలా ఎందుకు చేస్తోందని చాలా మందికి సందేహం కలుగుతోంది. అయితే ఎన్నికల సమయం వరకు ఎలాగైనా మాంఝీ ప్రభుత్వం అధికారంలో ఉంటే తమ పార్టీకి సానుకూలత ఏర్పడి ఓట్ల శాతం పెరుగుతుందని భావించవచ్చు భాజపా. కానీ నితీష్ కుమార్ భాజపాను ఖచ్చితంగా అడ్డుకుంటారు. తను రాష్ట్ర అభివృద్ది కోసం చేసిన కృషి, భాజపా దొంగదెబ్బ తీయాలనుకుంటోందని ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. దీని వల్ల భాజపా ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి.

మాంఝీకి మద్దతు ఇవ్వడం కాకుండా భాజపా మరోలా కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. చివరి క్షణం వరకు మాంఝీకు మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దు చేసేటట్లు గవర్నర్ మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ఇలా చెయ్యడం వల్ల నవంబర్ లో జరగాల్సిన ఎన్నికలు ముందగానే జరిగే అవకాశం ఏర్పడుతుంది. కానీ ఢిల్లీ ఫలితాలు భాజపాకు అనుకూలంగా లేవు అని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన నేపథ్యంలో ఎన్నికలకు ఇప్పుడే వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ ఎన్నికలకు వెళితే ఢిల్లీ ఫలితాల ప్రభావం బీహార్ పై ఖచ్చితంగా ఉంటుంది. దాని వల్ల భాజపాకు విజయావకాశాలు మరింత దూరమవుతాయి. మొత్తానికి భాజపా అవలంబిస్తున్న వైఖరి పార్టీ వర్గాల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోందన్నది మాత్రం స్పష్టం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp in bihar  bihar politics  amith sha strategy  manghee  nithesh kumar  

Other Articles