Telangana martyrs figures are disputed

trs party news, kcr news, cm kcr news, cm kcr funds, telangana funds, telangana news, martys figures, telangana martyrs figures, telangana government, kcr news

telangana martyrs figures are disputed : telangana trs government has released martyrs figures which are goes controversial

వివాదాస్పదం అవుతున్న అమరుల లెక్కలు..

Posted: 10/03/2014 10:48 AM IST
Telangana martyrs figures are disputed

అహింసాయుతంగా, మహోద్వేగంగా సాగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. రాష్ట్ర సాధనతో ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన మలి ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీఆర్ఎస్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసుకున్న అమరవీరుల కుటుంబాలు.. తమ జీవితాలలో వెలుగులు నిండుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు నిలబెట్టుకుంటుందని వారు ఎదరుచూస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008-09 వరకు అమరుల సంఖ్య అంతంత మాత్రంగానే వుంది. 2009 నవంబర్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షబూనిన తరువాత ఒక్కసారిగా తెలంగాణ ప్రజల్లోకి ఉద్యమం చోచ్చుకువెళ్లింది. కేసీఆర్ దీక్ష నేపథ్యంలో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా ప్రకటన చేసింది. ఆ తరువాత సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన అల్లర్లకు తలవంచిన కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను ఉపసంహరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు శ్రీకృష్ణ కమిటీని వేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది.

అదే సమయం.. అక్కడి నుంచి మొదలైన తెలంగాణ అమరవీరుల అత్మార్పణలకు అడ్డుకట్ట వేయడం కష్టమైంది. తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షుడి హోదాలో ఫ్రొఫెసర్ కోదండరామ్, వివిధ రాజకీయ పార్టీల నేతలు తెలంగాణ ప్రజానికాని ధైర్యంగా వుండాలని పిలుపునిచ్చారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం స్వప్నం కాదు.. సాకారమయ్యే కలగా అభివర్ణించి.. తెలంగాణ కోసం బతకాలని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విన్నవించారు. అయినా.. తెలంగాణలో అత్మహత్యలు కొనసాగాయి. పార్లమెంటు భవనం సాక్షిగా.. ఉరి వేసుకుని అప్పటి యూపిఏ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసి మరీ ప్రాణార్పణ చేసుకున్నాడు ఓ అమరవీరుడు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా మూడు వేల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు.

అమరవీరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్టామని చెప్పిన నేతలు.. ఇప్పడు అమరుల లెక్కలు తేల్చే పనిలో వున్నారు. అప్పటి ఉద్యమకారులు.. అధికారంలోకి రాగానే.. పాలకులుగా మారారు. ప్రభువులం అనుకుంటున్నారు. అందుకే అమరుల త్యాగాలను లెక్కిస్తున్నారు. నాడు వారే చెప్పిన లెక్కలు.. నేడు తప్పులేలా అవుతాయనేది శేష ప్రశ్నగా మిగులుతోంది. 2009 నుంచి అమరులైన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం వివాదాస్పదం అవుతోంది.

తెలంగాణ తొలి దశ ఉద్యమం.. ఆ తరువాత అక్కడి ప్రజలలో అది సజీవంగా వుండడం మలిదశ ఉద్యమానికి తక్కువ సమయంలోనే ఊపిరి పోసిందనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని పక్కన బెట్టి.. కేవలం కేసీఆర్ నిరాహార దీక్ష కాలం నుంచే అమరులను గణించడం.. ఎంతవరకు సమంజసమని విమర్శలు వినబడుతున్నాయి. అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో.. అమరులనే అవహేళన చేస్తారా..? అంటూ అమరవీరుల కుటంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఉద్యమ చేసిన పార్టీ అధికారంలోకి వస్తే తమకే ముందుగా మేలు జరుగుతుందనుకున్న అమరుల కుటుంబాలు.. ఆందోళన చెందుతున్నాయి. చేతికందిన బిడ్డలను పోగొట్టుకుని, మనోవేధనతో దిగులు చెందుతున్న కుటుంబాలకు మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే.. వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని బాధితులు వాపోతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అమర వీరుల సంఖ్యపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అమరులుగా 462 మందిని మాత్రమే ప్రకటించడం, మిగితావారిని అవహేళనకు గురిచేయడమేనని అన్నారు. 1969  ఉద్యమం నుంచి అమరుల కుటుంబాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి పొన్నాల సూచించారు. అమర వీరులు సంఖ్యను 2009 నుంచి మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం తప్పని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం అవమానిస్తోందని.. 1969 నుంచి ఉద్యమంలో అసువులుబాసిన వారికి సాయం చేస్తామని చెప్పి కేవలం 462 మందికే సాయం చేయడం నిర్లక్ష్య ధోరణిని వెల్లడిస్తోందని విమర్శించారు. అమరవీరుల గుర్తింపులో ప్రభుత్వం గందరగోళాన్ని సృష్టించిందని.. 462 మందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసిందో తెలియడం లేదన్నారు. వివరాలు లేకపోతే తాము అందిస్తామని తెలిపారు. పోన్నాలతో పాటు భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు ఇదే అంశంపై అమరులతో పాటు ప్రజలను కూడా కూడగట్టుకుని ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు.

తొలిధశలో మాత్రమే 462 మందిన గుర్తించామని, ఆ తరువాత మిగిలిన వారిని గుర్తించి అమరులందరికీ 10 లక్షల రూపాయల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వ వర్గాలు చెడుతున్నాయి. కానీ తొలిదశ ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకుని అప్పటి అమరవీరుల కుటుంబాలకు ఇప్పడు పరిహారం ఇస్తే.. కాంగ్రెస్ బలపడుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక మలిదశ ఉద్యమంలో 2009 నుంచి అమరులైన వారి సంఖ్య 462 మాత్రమేనని ప్రభుత్వం లెక్కగట్టిందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వ స్పష్టతనిచ్చి.. అమరుల కుటాంబాలకు అన్యాయం చేయమని భరోసాను కల్పించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana martyrs figures  telangana news  telangana funds  

Other Articles