Film director artist bapu dead

bapu, bapu movies, bapu paintings, bapu artist, director bapu, telugu directors, latest news, film news, tollywood news

flim director artist bapu died with heart attack : bapu died with heart attack in chennai

కళా తపస్వి బాపు అస్తమయం

Posted: 08/31/2014 07:03 PM IST
Film director artist bapu dead

తెలుగు జగత్తులో ఒక శకం ముగిసింది.  బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు మనందర్ని వదిలి వెళ్లారు. ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు పయనం అయ్యారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాపు చెన్నైలోని ఓ హాస్పిటల్ లో గుండెపోటుతో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బాపు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు విచారం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తీరనిదిగా అభిప్రాయపడ్డారు.

బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మి నారాయణ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 1933 సం. డిసెంబర్ 15న జన్మించారు. మద్రాస్ యునివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రికలో క్రిటిక్ కార్టూనిస్టుగా కళలతో తన జీవితం ప్రారంభించారు.

కుంచెతో కళకు ప్రాణం పోశాడు

చిత్రకారుడిగా బాపు అందరికి సుపరిచితుడు. అయితే తన వృత్తి అయిన కార్టూన్లకే కళను పరిమితం కానివ్వలేదు. కుంచెను ఆలోచనలకు జోడించి అద్బుతాలు సృష్టించాడు. తన కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ప్రాణమున్న కళాఖండాలు. ఆయన వేసిన ప్రతి చిత్రం ప్రత్యేకమే. జీవిత కాలంలో ఎన్నో చిత్రాలకు ప్రాణం పోశాడు. ఎందరి ప్రశంసలనో పొందాడు. బాపు చేతి బొమ్మ పడని పత్రిక ఉండటం అరుదు.

ఇక బాపు రాసిన ‘బుడుగు’కొన్ని తరాలకు గుర్తుండిపోయే కధనం. సామాజిక, ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలను అచ్చంగా చూపించి అందరి మన్ననలూ పొందారు.

రాతకూడా ప్రత్యేకతే

బాపు చిత్రాలే కాదు ఆయన రాత కూడా ప్రత్యేకమే. తెలుగులో ఇప్పటివరకు ఎవరి రాతకూ రానంత గుర్తింపు బాబు చేతి రాతకుంది. కంప్యూటర్లలో బాపు రాతలా ఉండే తెలుగు ఫాంట్స్ బాబు ఫాంట్ పేరుతో వాడుతున్నారంటేనే ఆయన రాతకున్న గుర్తింపు అర్ధం చేసుకోవచ్చు. చేతితో ఒక్క గీత గీసినా అందులో బాపు కళ కన్పిస్తుంది. ఆయన చిత్రాలు, చేతిరాతలతో ఉన్న గ్రీటింగ్ కార్డులు చాలామంది ఏరికోరి తీసుకుంటారు.

సినిమాలో బాపు కూర్పు

బాపు సినిమాలు కూడా తీశారు. ఇక్కడా ఆయన ప్రత్యేకత, విశిష్టత కన్పిస్తుంది. 1967లో సాక్షి సినిమాతో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. తొలి చిత్రంతోనే ప్రశంసలు పొందాడు. ఇప్పటివరకు మొత్తం 41 సినిమాలకు దర్శకత్వం వహించాడు. కేవలం పాత కాలం కదలే కాకుండా ప్రస్తుత తరం కూడా ఆదరించేలా రాధాగోపాళం, శ్రీరామరాజ్యం వంటి సినిమాలు బాపు తీశారు. తాను తీసే సినిమా సీన్లను స్టోరి బోర్డుగా తయారు చేసుకుని డైరెక్ట్ చేస్తాడు.  అందువల్ల మనసులో ఏముందో అదే కాగితం మీద సాక్షాత్కారం అవుతుంది. బాపు తీశాడు కాబట్టే నాటి సినిమాలైన ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం సినిమాలు వస్తే ఇప్పటికి జనం టీవీ ముందు నుంచి కదలటం లేదు.


సృజనాత్మకతకు ప్రాణం పోసే బాపు ఎన్నో అవార్డులు అందుకున్నారు.

ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం సినిమాలకు బాపు జాతీయ అవార్డులు అందుకున్నారు.
2013లో కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
పలు చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు.
ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు.


ఇలా కళనే నమ్ముకుని కళకోసం బతికిన బాపు మనకు కన్నీళ్ళను మిగులుస్తూ కాలం చేశారు. భౌతికంగా మనకు దూరం కావచ్చు కానీ ఆయన కళలు, కళా ఖండాలు ఎప్పుడూ బాపు మన నుంచి వేరు చేయలేవు.  మహోన్నతుడి మృతికి సంతాపం తెలుపుతూ ఆత్మ శాంతించాలని కోరుకుందాం.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bapu  bapu death  tollywood news  latest news  

Other Articles