Water logging in hyderabad disrupts traffic

water logging in Hyderabad disrupts traffic, Traffic jams in Hyderabad due to rain, Rain water blocks traffic in Hyderabad

water logging in Hyderabad disrupts traffic

హైద్రాబాద్ కి దీన్నుంచి విముక్తి ఎప్పుడు?

Posted: 06/03/2014 12:33 PM IST
Water logging in hyderabad disrupts traffic

వర్షం ఎప్పుడైనా పడొచ్చని అందరికీ తెలుసు.  అందుకే 'ఫర్ ఏ రైనీ డే' అంటూ ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు.  కానీ హైద్రాబాద్ నగర పాలికా విభాగం వర్షం పడగానే ఉలిక్కి పడుతుంది.  కాకపోతే వెంటనేమర్చిపోతుంది.  ఆరోజు పోలీసు సిబ్బందితో కలిసి వర్షపు నీరు నిలిచిపోవటం వలన నిలిచిపోయిన ట్రాఫిక్ ని క్లియర్ చేసి హమ్మయ్య అని చేతులు దులుపుకుంటుంది.  ఒక్క రాత్రి వర్షానికే హైద్రాబాద్ లో మలక్ పేట నుంచి ఎల్ బి నగర్ వరకు భారీగా వాహనాలు రోడ్ల మీద నిలిచిపోయి ఉన్నాయి.  

ఈ సమస్య ఒక్క రోజుది కాదు, ఒక సంవత్సరంలో మాత్రమే వచ్చేది కాదు.  నిత్యమూ ఉండేదే కానీ పరిష్కార మార్గాలను మాత్రం అధికారులు అన్వేషించలేకపోతున్నారు.  విజ్ఞాన శాస్త్రంలో ఇంత ప్రగతిని సాధించిన ఈ రోజుల్లో వర్షపు నీరు ఆగిపోయే సమస్య పరిష్కరించలేనంత పెద్దదేమీ కాదు.  

hyderabad-in-rain

మురికివాడలు లేని విశ్వనగరంగా హైద్రాబాద్ ని తీర్చిదిద్దుతామని సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన కె చంద్రశేఖరరావు మాటిచ్చారు.  చూద్దాం, కనీసం చిన్న వర్షానికే రోడ్ల మీద నీరు ఆగిపోయి ట్రాఫిక్ గంటల సేపు ఆగిపోవలసిన పరిస్థితి నుంచి ఎప్పుడు హైద్రాబాద్ కి ఎప్పుడు విముక్తి కలుగుతుందో.  

రాత్రి వర్షంతో పాటు, నగరంలో జరుగుతున్న మెట్రో పనులు, మలక్ పేట యశోదా హాస్పిటల్ దగ్గర పాడైపోయిన రోడ్డు వెరసి వాహనాలను దిగ్బంధం చేసాయి.  ఎల్ బి నగర్ నుంచి వస్తున్న వాహనాలను అధికారులు మహబూబ్ గంజ్, సైదాబాద్ మీదుగా దారి మళ్ళిస్తున్నారు.  

ఈరోజుతో గండం గడిచిందని నగరవాసులు, అధికారులు కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి రేపటి నుంచి మామూలూగా తమ తమ జీవనశైలిలో ముందుకెళ్తారో లేదా ఇప్పటికైనా రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే మరమ్మతులు చేపడతారో చూడాలి!

వర్షపు నీటితో నగరం మునిగిపోయినప్పుడు అధికారులు ఎప్పుడూ చెప్పే విషయం ప్లాస్టిక్ బ్యాగ్ ల వినియోగం వలన పైపులకు అడ్డుపడి నీటిని పోనివ్వటం లేదని.  అదే కారణమని తెలిసినప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని ఎందుకు నిలిపివేయరు.  ప్లాస్టిక్ బ్యాగ్ లను నిషేధించారు.  కానీ వాటికి డబ్బు చెల్లిస్తే చాలని కూడా చెప్పారు.  దీని వలన అంతకు ముందు క్యారీ బాగ్ లకు డబ్బు తీసుకోని దుకాణదారులు అదనంగా ఒక రూపాయి నుంచి 3 రూపాయల వరకు తీసుకోవటానికి ఉపయోగపడింది కానీ నిలువ నీటి సమస్య అలాగే ఉండిపోయింది.  ఒకవేళ ప్లాస్టిక్ సంచులను ఎవరూ వాడకపోయినా నీరు నిలిచిపోతేనూ అన్నది అధికారులను వేధిస్తోందేమో అంటున్నారు నగరవాసులు. 

ఈ మధ్యలో ఏ వాహనమైనా చెడిపోయినా, లేక నీటి వలన కనిపించని గోతిలో పడిపోయినా ఇక వాళ్ళ అవస్థలను ఊహించుకోవటానికి పెద్దగా రచనా చాతుర్యం అవసరం లేదు. 

ఈ సమస్య నుంచి విముక్తి ఎప్పుడా అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.  సోమవారం ముఖ్యమంత్రిగా ప్రధమ ప్రసంగం చేసిన కెసిఆర్ మాటలతో నగరవాసులకు ఆశ చిగురించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles