ఎట్టకేలకు కేంద్ర మంత్రి వర్గంలో పెను మార్పులు చోటు చేసుకునేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఎన్నో రోజుల నుండి ఊరిస్తున్న ఈ విస్తరణకు ఈ ఆదివారం ఉదయం ఏడున్నరకు రంగం సిద్ధం చేశారు. ఈ విస్తరింపులో మన రాష్ట్రం నుండి ముగ్గురికి పదవులు దక్కనున్నాయి. చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, సర్వే సత్యనారాయణ కేంద్రమంత్రి వర్గంలో చేరను న్నారు. ఈ మేరకు వారికి సంకేతాలు అందాయి. గతంలో సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే ఆయనకు కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవికి కేంద్రమంత్రి వర్గంలో స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రంలో కాపులకు మరింత చేరువకావచ్చని నాయకత్వం భావిస్తోంది. ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి, రాష్ట్రంపెైనే ఎక్కువ దృష్టి సారించేలా చూడటమే నాయకత్వం అసలు లక్ష్యమంటున్నారు. ఇక చాలాకాలం నుంచి అన్యాయానికి గురవుతోన్న కర్నూలు ఎంపీ కోట్ల సూర్య ప్రకాశరెడ్డికి ఈసారి న్యాయం చేయాలని నాయకత్వం నిర్ణయించింది. కోట్లకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా రాయలసీమలో జగన్ పార్టీ వైపు ఆకర్షితులవుతోన్న రెడ్డి సామాజికవర్గాన్ని నియంత్రించడంతో పాటు, జగన్‌ను ఎదుర్కొనే శక్తిగా ఆయనను వినియోగించుకోవాలని భావిస్తోంది. . పార్టీకి విధేయుడయిన మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ కి మాదిగల కోటాలో పదవి కట్టబెట్టాలని భావిస్తుంది. దీని ద్వారా తెలుగు దేశం పార్టీలో చేరుతున్న మాదిగలను తమవైపు తిప్పుకోవచ్చని భావిస్తుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుగా వీరు ముగ్గురు ఎంత వరకు లాభం చేకూర్చుతారో చూడాలి.
