
రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రల నుండి వచ్చే విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు లగడపాటి కూడా పాదయాత్రలు చేసుకొనే హక్కు ఎవరికైన ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాత్రం ఊరుకోమని లగడపాటి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు వంత వచ్చింది? పాదయాత్రలపై బొత్స బాణం వదిలిసినట్లు తెలుస్తోంది. జగన్ వదిలిన బాణానికి పోటీగా బొత్స బాణం సిద్దమైంది. ‘బాణం దేనికి? ఎవరిపైకి? ఏ అంశంపైకి వదిలారు?’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జగనన్న వదిలిన బాణాన్ని నేను.. అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేసిన వ్యాఖ్యలపై బొత్స మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెస్ లక్ష్యంగా, ధ్యేయంగా ఈ బాణం కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
అయితే జగన్ అరెస్టుకు కాంగ్రెస్‌కు సంబంధం లేదని, కోర్టు ఆదేశం మేరకే సిబిఐ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదివరకే స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటకో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చేనేత రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందుకు నిరసనగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక పూట భోజనం చేయకపోవడం గురించి ప్రశ్నించగా, చంద్రబాబు కాలుకు ఇటీవల నొప్పి రావడంతో భోజనం చేయవద్దని డాక్టర్ సలహా ఇస్తే, మీరే తప్పుగా అర్థం చేసుకుని చేనేత కార్మికుల కోసం భోజనం చేయలేదని వార్త రాశారని బొత్స తెలిపారు. వస్తున్నా...మీ కోసం పేరిట చేపట్టిన పాదయాత్రను వస్తున్నా.. నా కోసం అంటే బాగుండేదని అన్నారు.ఇలాఉండగా అసెంబ్లీలో ప్రభుత్వ విప్ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జగన్ బాణాలతో ఇప్పటికే కొంత మంది ఐఎఎస్‌లు విలవిలలాడుతున్నారని అన్నారు. శ్రీలక్ష్మీ ఆసుపత్రి పాలయ్యారని, ఇప్పుడు షర్మిల అనే బాణాన్ని సామాన్య ప్రజలపైకి వదిలారని ఆయన విమర్శించారు. ప్రజలు ఈ బాణాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జూబ్లీహాలులో చేనేత సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
