
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా మీ కోసం ’ యాత్రకు పోటీగా మరో పాదయాత్ర చేయబోతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హడావుడి రాష్ట్రంలో పూర్తిగా తగ్గిపోయింది. ఇలాగైతే ప్రజల్లో ఉనికిని కోల్పోతామని భావించిన ఆ పార్టీ వారు తాము కూడా పాదయాత్ర చేయాలని భావించినట్లు సమాచారం. ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆ పార్టీ విప్ బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు వైయస్ జగన్ ని జైలులో కలిసి ఈ విషయం పై చర్చించినట్లు వార్తలు. జగన్ సోదరి అయిన షర్మిలతో సుదీర్ఘ పాదయాత్ర చేయించడం మినహా మరో మార్గం లేదని వారు జగన్ తో అన్నట్లు సమాచారం. దీనికి జగన్ కూడా ఆమోదం తెలిపారని, ఇక అధికారిక ప్రకటనే తరువాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 2,500 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగబోతోంది.
అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్ పార్టీని ప్రజలు ఎక్కడ మరచి పోతారేమోనని భయంతో, చంద్రబాబు పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేని ఆ పార్టీ నేతలు షర్మిలతో పాదయాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. మరి మొన్నటి వరకు జగన్ ఓదార్పు యాత్ర, తరువాత షర్మిల ఎన్నికల ప్రచారంతో విసుగెత్తి పోయిన జనాలు షర్మిల పాదయాత్ర చేస్తే ఆదరిస్తారో లేదో చూడాలి. ఏది ఏమైనా తెదేపా, వైయస్సార్ పార్టీలు చేస్తున్న పాదయాత్రలు మాత్రం 2014 ఎన్నికల కోసమేనని జనం అనుకుంటున్నారు.
