
తెలంగాణ పై మేక సాహసం అంటే రియల్ మేక కాదండి .. జగన్ వనంలో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఈ సారి ఆయన తెలంగాణ కొత్త సాహసం చేశారు. తమ పార్టీ గురించి గొప్పగా చెప్పాడు. మా పార్టీలో ఉన్న రెండు పార్లమెంటు సీట్లతో తమకు తెలంగాణ ఇచ్చే శక్తి గానీ, ఆపే శక్తి గానీ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు. రెండు ఎంపీ సీట్లతో తెలంగాణపై నిర్ణయం తీసుకునే శక్తి తమకు లేదన్నారు. కేంద్రం తేల్చాల్సిన అంశం అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరవయ్యేళ్ల వయస్సులో వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర తలపెట్టి పెద్ద సాహసమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి పదవి కోసమే బాబు అరవయ్యేళ్ల పైబడి వయస్సులో ఈ సాహసం చేస్తున్నారన్నారు. సినిమా వారి దర్శకత్వంలో బాబు యాత్ర చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరి మంచి పనులు చేసి ఉంటే ప్రజలు దేవుడిలా కొలిచే వారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు బాబు అవస్థలు పడుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసం కోల్పోయాక ఎన్ని పాదయాత్రలు చేసినా బస్సు యాత్రలు చేసినా లాభం ఉండదన్నారు. తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొందరు తాము మహాత్మా గాంధీ వారసులమని చెప్పుకుంటూ ఆయన ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి విమర్శించారు. విజయమ్మ నివాళులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పులివెందులలో జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె రెండు రోజులు పులివెందులలో ఉండి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.
