
ఎంపీలు, మాజీ ఎంపీలు బకాయిపడ్డ ఫోన్ బిల్లులు మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 7.3 కోట్లు. ఇవి సాక్షాత్తూ మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్‌ఎల్) అందించిన వివరాలు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలున్నప్పటికీ ఫోన్లు కట్ చేయడం లేదు. టెలిఫోన్ సర్కిల్ చీఫ్ ఆదేశాలు ఉంటే తప్ప కట్ చేయడానికి వీలులేదని ఎంటిఎన్‌ఎల్ స్పష్టం చేసింది. సబార్డినెట్ అధికారికి ఫోన్ కట్ చేసే అధికారం లేదని ఆర్‌టిఐకి ఇచ్చిన వివరణలో సంస్థ పేర్కొంది. బకాయిల వసూలుకు సంబంధించి సర్కిల్ హెడ్ లేఖ రాయాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా టెలికం మేనేజర్ లేదా సర్కిల్ హెడ్ ఆదేశిస్తే తప్ప ఎంపీల ఫోన్లు తొలగించడానికి వీలులేదన్నారు. సుభాష్ అగర్వాల్ అనే వ్యక్తి ఎంపీల ఫోన్ బకాయిలకు సంబంధించి వివరాలు కావాలని ఆర్‌టిఐను ఆశ్రయించాడు. ప్రస్తుత, మాజీలు కలిపి 405 మంది ఎంపీలు 7.3 కోట్ల మేరకు టెలిఫోన్ బిల్లులు బకాయి పడ్డారని ఎంటిఎన్‌ఎల్ పేర్కొంది. 399 మంది మాజీలు, ఆరుగురు ప్రస్తుత ఎంపీలు కలిపి మొత్తం 7,30,66,746 బకాయి ఉన్నటు వివరించారు. బకాయిల జాబితాలో ఉన్న మాజీల్లో 67 మంది చనిపోయారు కూడా. టెలిఫోన్ బిల్లుల విషయంలో ఎంపీల నుంచి ఎప్పటికప్పుడు సొమ్ములు రాబట్టాలని ఢిల్లీ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. కృషక్ భరత్ అనే ఎన్‌జివో దాఖలు చేసిన పిల్‌పై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
