ఏసీబీ కోర్టు నుంచి సంచలనాత్మక నిర్ణయం వెలువడింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు సమన్లు జారీ చేసింది. అమీర్‌పేట భూ వివాదం కేసులో ఆగస్టు 2న విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు ఇచ్చింది. రాజ్యాంగపరమైన రక్షణలున్న ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడికి ఏసీబీ కోర్టు తాఖీదులు పంపడం సంచలనం సృష్టిస్తోంది. రోశయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో 9.13ఎకరాల భూమిని డీ నోటిఫై చేశారు. ఇందులో గోల్‌మాల్ జరిగిందంటూ ఓ న్యాయవాది ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా న్యాయస్థానం ఏసీబీని ఆదేశించింది. అయితే... రోశయ్యకు అప్పట్లోనే ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. సదరు న్యాయవాది దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టు ఈ కేసును తిరిగి విచారణకు చేపట్టింది. కేసు విచారణలో భాగంగా సోమవారం రోశయ్యకు సమన్లు జారీ చేసింది.
