
ఎన్నికల ప్రచారాలే కాదు పుట్టినరోజు వేడుకలూ వినూత్నంగా జరుపుకునే రాజకీయ నాయకులు ఉన్నారు. గుజరాత్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నరోత్తమ్‌పటేల్ పుట్టినరోజు వేడుకలే ఇందుకు ఉదాహరణ. కోరిన కోరికలు తీరిస్తే.. తమ బరువుకి సరిపడా బెల్లం.. ఇతరత్రా కానుకలను సమర్పించుకుంటామని భక్తులు దేవుళ్లకు మొక్కుకోవడం పరిపాటి. గుజరాత్ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నరోత్తమ్ పటేల్‌కి కూడా ఇలాంటి ఆలోచనే తట్టింది. అయితే ఆయనకిలాంటి మొక్కులేవీ లేవు. కానీ తన 77వ పుట్టిన రోజును భిన్నంగా జరుపుకోవాలని తలంచారు. తన శరీర బరువు 70కేజీలకు సరిపడా రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఒక్క మంత్రి గారి దేహంలోనే అంత రక్తం ఉండదుగా! తన అనుచరులకు, బీజేపీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చేశారు. వారు సూరత్ పట్టణంలో గత రెండు మూడు రోజులుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మంత్రి గారి బరువుకి సరిపడా 70 లీటర్లకు పైగా రక్తాన్ని ప్రజల నుంచి పిండుకున్నారు. ఇక మంత్రిగారిని కాటాలో కూర్చోబెట్టి మరీ ఆయన బరువుకి సరిపడా రక్తంతో తూకం వేశారు. ఆ తర్వాత ఆ రక్తాన్ని పట్టణంలోని రక్తనిధి కేంద్రాలకు దానం చేశారు. మొత్తానికి ప్రజల రక్తంతో మంత్రిగారికి బాగానే ప్రచారం దక్కింది.