అక్రమాస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప జిల్లా పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు పై సీబీఐ విచారణ జరిపింది. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అనుమతి కోరుతూ జూన్ 15న నాంపల్లి కోర్టులో పిటీషన్ వేసింది.
దీని పై విచారణ జరిపిన కోర్టు ఈడీ విచారణకు అనుమతి ఇచ్చింది.
ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు విచారించనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో జగన్‌ను ఈడీ ప్రశ్నించనుంది. జగతి పబ్లికేషన్‌లో పెట్టిన పెట్టుబడులు, మనీ లాండరింగ్‌కు సంబంధించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కాగా జగతి పబ్లికేషన్స్‌కు ఇప్పుడు తాను ఛైర్మన్‌ను కాదని, అంచేత ఈడీ విచారణకు అనుమతించవద్దని జగన్ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
