తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను తీవ్ర పదజాలతో దూషించారు. ఒక ప్రజాప్రతి అయి ఉండి మరో పార్టీ నేతలను ఇలా విమర్శించడం చట్టవిరుద్దం. అయినా మన నాయకులకు చట్టానికి ఉన్న విలువ తెలియదని మరో సారి నిరూపితం అయింది.
హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో ఎంపీగా ఉన్న సర్వే సత్యనారాయణ అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైయస్సార్ పార్టీ పేరుతో ఓట్లు అడగటానికి వచ్చే నాయకులను చెప్పులతో కొట్టండి అని పిలుపునిచ్చారు. జగన్మోహన్ వంటి జగత్ కిలాడీ అవినీతిపరులకు ఓట్లు వేస్తే రాష్ట్ర ప్రజలు మరింత ఇబ్బందులకు గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. వేల కోట్ల అవినీతి చేసి జైలులో ఉన్న వైఎస్ జగన్ ఇక జైలు నుంచి బయటపడడం కష్టమేనని ఆయన జోస్యం చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన ఇంటి నుంచి వచ్చినవి కావని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా రూపకల్పన చేసి అమలు చేయాల్సిందిగా సూచించిన పథకాలని సర్వే చెప్పుకొచ్చారు. మరి ఈయన చేసిన వ్యాఖ్యల పై వైయస్సార్సీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
