
యూరోపియన్ యూనియన్ నేతలు బ్రసెల్స్‌లో సమావేశమై యూరపు అంతటా కార్మికవర్గంపై సామాజిక దాడులను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించిన మూడు రోజులకే ఐరోపాలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. 17 దేశాల యూరోజోన్‌లో నిరుద్యోగం గత మే నెలలో 11.1 శాతానికి చేరుకున్నట్లు యూరోస్టాటిస్టిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం యూరపును తాకినప్పటి నుంచి అంటే 2008 ఏప్రిల్ నుంచి యూరోజోన్‌లో నిరుద్యోగం పెరుగుతూ వస్తున్నది. 2008 నాటికి 6.8 శాతంగా ఉన్న నిరుద్యోగం నేడు 11.1 శాతానికి చేరుకోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నిరుద్యోగం మున్ముందు మరింత పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ త్రైమాసికంలో యూరోజోన్ మాంద్యంలోకి జారిందని అధికారికంగా ప్రకటించారు.
యూరపులో బలమైన ఆర్థిక వ్యవస్థగా, ఎగుమతులు ఎక్కువగా చేసే జర్మనీ ఆర్థిక పరిస్థితి కూడా గాడి తప్పడం, ఇతర యూరపు దేశాల్లో నెలకొన్న స్తబ్ధత యూరోజోన్‌ను ఇప్పుడు వణికిస్తున్నది. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం యూరపు పై కూడా పడిందని ది ఇనిస్టిట్యూట్ ఫర్ సప్లయి మేనేజిమెంట్ తెలియజేసింది. అమెరికాలోనూ జూన్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు బాగా పడిపోయాయని ఈ సంస్థ తెలిపింది. యూరోపియన్ యువతలో నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. 2011మేలో 20.5శాతంగా ఉన్న నిరుద్యోగిత గత నెలాఖరునాటికి 22.6 శాతానికి పెరిగిపోయింది. యూరో జోన్‌లో గ్రీస్, స్పెయిన్ దేశాల్లో యువతలో నిరుద్యోగిత రేటు 52.1 శాతంతో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ దేశాల్లో సగం మంది యువత ఉపాధి కరువై దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. వీరి తల్లిదండ్రులు లే ఆఫ్‌లు, వేతన కోత వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. విద్యావ్యవస్థపై కూడా ఒక పథకం ప్రకారం దాడి జరుగుతోంది. 68 శాతం గ్రీక్ యువత దేశం వీడి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు యూరోపియన్ యూనియన్ కమిషన్ నివేదికలే చెబుతున్నాయి. గ్రీస్, స్పెయిన్‌లో స్థూలంగా నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో 21.9శాతం 24.6 శాతంగా నమోదయ్యాయి. ఈ రెండు దేశాల్లో నిరుద్యోగం గడచిన ఏడాది కాలంలో విపరీతంగా పెరిగిపోయింది.
2011 మే నెలలో గ్రీస్‌లో నిరుద్యోగ రేటు15.7 శాతం, స్పెయిన్‌లో 20.9శాతంగా ఉండేది. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు యూరో బూర్జువాలు కార్మికవర్గంపై దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నారు. యూరపు సెంట్రల్ బ్యాంకు ఆదేశాల మేరకు యూరపు దేశాల్లోని ప్రభుత్వాలు అనుసరిస్తున్న పొదుపు చర్యలు, విధానాలు కార్మికులు, పేదల పాలిట శాపంగా మారాయి. ద్రవ్యపరమైన చర్యల్లో భాగంగా ప్రభుత్వ వ్యయం తగ్గించుకోవడంతో సంక్షేమంపై కోతపడుతోంది. ద్రవ్యలోటు తగ్గింపు చర్యల్లో భాగంగా జరమ్నఈ ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో 2,500 కోట్ల యూరోలను కోత పెట్టాల్సిన అవసరమేర్పడినట్లు అధ్యక్ష భవన్ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌లో హోలాండ్ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో వెయ్యికోట్ల యూరోల మేర కోతపెట్టనుంది.ఇటీవల ఏర్పడిన కొత్త గ్రీక్ ప్రభుత్వం పొదుపు చర్యలను అమలు చేయాలని నిశ్చయించుకుంది. యూరోపియన్ కమిషన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల త్రయం నిర్దేశిస్తున్న ఈ పొదుపు చర్యల మూలంగా యూరపులో వచ్చే రెండేళ్లలో లక్షా యాభైవేల ఉద్యోగాలపై కోత పడనుంది.