శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ శాస్త్రజ్ఞుల విగ్రహాలను ప్రతిష్టించాలంటూ విద్యార్ధి నాయకులు డిమాండు చేశారు.శ్రీనివాసం ఆడిటోరియం ముందు భారతీయ శాస్త్రజ్ఞుల,రచయితల,కళాకారుల,కవుల కాంస్య విగ్రహాలను ప్రతిష్టించాలని కోరారు.గెలీలియో,న్యూటన్,ఐన్‌స్టీన్ తదితర శాస్త్రజ్ఞుల విగ్రహాలను ఆవిష్కరించిన పాలకవర్గాలకు భారతీయ శాస్త్రవేత్తలు గుర్తుకురాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు రవి నాయుడు మాట్లాడుతూ ఎస్వీయూలో పనిచేసిన మారేమండ రామారావు,చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ,నీలకంఠ శాస్త్రి తదితర చరిత్రకారులు తెలుగు జాతి సాంస్కృతిక,సాహిత్య,ప్రాచీన కావ్య,విద్య,వైజ్ఞానిక శాస్త్రవేత్తల జీవితాలను, నూతన ఆవిష్కరణలను తాళపత్రగ్రంధాలను పరిశోధించి మనకందించారని గుర్తు చేశారు.ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ఆర్య భట్టారకుడు, వరాహ మిహిరుడు,లీలావతి,వైద్య రంగంలో సుశ్రూతుడు, చరకుల కు విశ్వవిద్యాలయాలలో స్ధానం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చరిత్ర పరిశోధక విద్యార్ధి డాక్టర్ హరికృష్ణ యాదవ్ మాట్లాడుతూ తక్షణమే ఆర్యభట్టారకుని కాంస్య విగ్రహాన్ని ఎస్వీయూలో ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు.