రెండు గంటల పదిహేను నిమిషాల నిడివితో సాగే ఒక సినిమా ఇప్పుడు కేవలం గంటా ముప్పై ఆరు నిమిషాలకి తగ్గిపోయింది. ఈ చోద్యం 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమా విషయంలో చోటు చేసుకుంది. తెలంగాణా ప్రజలను కించపరిచేలా ఇందులో చాలా సన్నివేశాలు వున్నాయంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో, ప్రభుత్వం స్పందించి ఓ కమిటీని వేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ కమిటీ సిఫార్సులను అనుసరించి మొత్తం 15 సన్నివేశాలను ఈ చిత్రం నుంచి తొలగించారు. దాంతో సినిమా నిడివి గంటా ముప్పై ఆరు నిమిషాలకు తగ్గిపోయిందట. నైజాం ప్రాంతంలో ఇదే నిడివితో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. అన్ని సన్నివేశాలు కట్ చేయడం వల్ల అసలు కథేమిటో ప్రేక్షకులకు అర్థం అవుతుందో లేదో...
ఇదిలా ఉండగా, 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమాపై నిన్నటి వరకు ఆందోళన నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ, ఈ రోజు తన పంథా మార్చి పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. తెలంగాణా ఉద్యమాన్ని కించపరిచేలా వున్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకుండానే, తెలంగాణా ప్రాంతంలో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని చిత్ర దర్శక, నిర్మాతలపై టీఆర్ఎస్ హైదరాబాదు, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తామని టీఆర్ఎస్ వారికి హామీ ఇచ్చారు.
కాగా, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించినట్లు నైజం డిస్టిబ్యూటర్ దిల్ రాజు తెలిపారు. ఎవరి మనోభావాలను కించపరచడం తమ ఉద్దేశం కాదని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటి సూచనల మేరకు తొలగించిన సీన్లతో చిత్రాన్ని ప్రదర్శిస్తామని రాజు తెలిపారు. సినిమా ప్రదర్శనకు అందరూ సహకరించాలని కోరారు.
మొత్తానికి ఏడుమంది సభ్యులతో కూడిన ప్రభుత్వ కమిటీ ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాలో పలువురికి అభ్యంతరకరంగా మారిన సీన్లను కట్ చేయించింది. తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమా వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఈ కట్స్ జరిగాయి. ఈ కట్స్ తో పూరీ సినిమా లెంగ్త్ బాగా తగ్గింది.
ఆ కట్స్ ఇవే..
-బీసీ-ఎస్సీ హాస్టల్స్ ఫైట్ సీన్లో కులాల పేర్లు ఉచ్ఛరించడం,
-రిపోర్టర్ గా రాంబాబు గుండక్కతో ఇంటర్వ్యూ చేసే సీన్లో కొన్ని డైలాగ్స్
-ప్రకాశ్ బొల్లి డైలాగ్
-సినిమాకే హైలెట్ అనిపించే…తెలుగుతల్లి సీన్ మొత్తం లేచిపోయింది. తన ఉద్యమం గురించి ప్రకాశ్ రాజ్ ప్రకటించే సీన్, అరెస్టు తర్వాత ప్రకాశ్ రాజ్ ను పవన్ ఇంటర్వ్యూ చేసే సీన్ లేపేశారు!
-ప్రకాశ్ రాజ్ అనుచరులు ఆత్మహత్య చేసుకునే సీన్
-కొన్ని సీన్లలో కోట శ్రీనివాసరావు వెనుక కనిపించే నిజాం ప్రభువుల ను డార్క్ చేశారు.
-బ్రహ్మీతో తెలంగాణ రావడం నీకు ఇష్టం లేదాని పవన్ అనే సీన్
-ఢిల్లీ గెస్ట్ హౌస్ డైలాగ్
-తమ ఆస్తులన్నీ తగలెట్టిస్తున్నారని సెటిలర్లు మొత్తుకునే సీన్..
ఇలా ప్రభుత్వ ఆధ్వర్యలో రాంబాబు సినిమా మరోసారి సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇంతకీ ఈ కట్స్ కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితమని తెలుస్తోంది.
...avnk