
టాలీవుడ్ మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున కుర్రకారు హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. నాగార్జునకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలిసిందే. జనాల్లో క్రేజ్ అయితే ఉంది కానీ నాగ్ సినిమాల కి అంతంత మాత్రమే మార్కెట్ ఉంటుంది. ఈయన సినిమా దాదాపుగా ఓ ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది. తాజాగా ఈయన సోషియో పాంటసీ చిత్రం అయిన ‘ఢమరుకం ’లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆర్. ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. టాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ఈ సినిమాకి దాదాపు నలభై కోట్లు ఖర్చు పెట్టి, ఎక్కడా రాజీ పడకుండా తీసిందని అంటున్నారు. మొదట ఓ ఇరవై కోట్లతో తీద్దామనుకున్నారు కానీ.... ఎక్కడా రాజీ పడకపోయే సరికి తడిసి మోపెడంత ఖర్చు అయిందట. మరి వీరు పెట్టిన ఖర్చు తిరిగి రావాలంటే... బ్లాక్ బస్టర్ అయితే మాత్రమే అన్ని డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ సినిమాని కొనడానికి వచ్చిన వారికి ఆర్.ఆర్ మూవీ మేకర్స్ చాలా రేటు చెప్పేసరికి ఎవరూ కొనడానికి వెనకాడుతున్నారట. అంతే కాకుండా మొదట ప్రకటించిన తేదీ ప్రకారం విడుదల చేస్తే అయినా అంతో ఇంతో మార్కెట్ అవుతుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మళ్ళీ వాయిదా పడేసరికి ఈ సినిమా పై అనవసరంగా ఇంత ఖర్చుపెట్టామని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. మరి నాగ్ ఢమరుకం నిర్మాతల్ని నిండా ముంచుతుందో, తేల్చుతుందో చూడాలి.