
ఇప్పుడు అరకులోయ కొత్త శోభ సంతరించుకుంది. వలిసె పూల సోయగాలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి. పసుపు పచ్చని తివాచీ పరచినట్టు ఉన్న ఈ తోటల్లో పర్యాటకులు విహరిస్తూ మైమరచి పోతున్నారు. ఈ తోటల మధ్య ఫొటోలు తీసుకుంటూ వలిసె పూల అందాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. అరకులోయ మండలంలోని 14 పంచాయతీల గిరిజనులు 735 హెక్టార్లు, అనంతగిరి మండలంతో 450 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు ఈ పంటకు బాగా అనుకూలించాయి. వాస్తవానికి నవంబర్ నెల నుంచి వలిసె పూలు విరబూసి పర్యాటకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. ఈ ఏడాది ముందుగానే సాగు చేయడంతో అక్టోబర్ నెలలోనే వలిసె పూలు అందాలు విరజిమ్ముతున్నాయి. అరకు వస్తున్న సందర్శకులకు దారి పొడవున తమ వాహనాలను నిలిపి ఈ తోటల్లో కొద్ది సేపు గడిపి వెళ్తున్నారు. అరకులోయకు పర్యాటకుల తాకిడి
అరకులోయలో పర్యాటకుల సందడి నెలకొంది. అక్టోబర్ మొదటి వారం నుంచే పర్యాటక సీజన్ ప్రారంభమైనప్పటికీ టూరిజం, ఐటీడీఏ కార్మికుల సమ్మెతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గి అరకులోయ బోసిపోయింది. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. కార్మికులు సమ్మె విరమించడంతో పాటు, దసరా సెలవులు ఇవ్వడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు కుటుంబాలతో సహా సోమవారం ఇక్కడికి వచ్చారు. గిరిజన మ్యూజి యం, పద్మాపురం ఉద్యానవన కేంద్రాలు పర్యటకులతో కళకళలాడాయి. వివిధ ప్రాంతా ల పర్యాటకులు తరలి వస్తుండడంతో స్థానిక హోటళ్లు, ఇతర దుకాణాల్లో జోరుగా వ్యాపారం సాగుతోంది.
...avnk