రాజీవ్ యువ కిరణాలు పథకంలో భాగంగా జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 6న జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి(టెక్నికల్) సి.హెచ్.సుబ్బిరెడ్డి తెలిపారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ దరి విష్ణు క్యారియర్స్ ప్రైవేట్ లిమిడెట్‌లో ఆయా ఉద్యోగాలకు ఎంపిక జరుపుతామన్నారు. 40 ఖాళీలున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు పదవ తరగతి, ఆపై విద్యార్హత, 20 ఏళ్ల వయసు కలిగి ఉండాలన్నారు. నెలకు రూ.5 వేల జీతం, ఇన్సెంటివ్ ఇస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, గాజువాక, నర్సీపట్నం, అనకాపల్లి, తగరపువలస, పాయకరావుపేటల్లో పని చేయాలని, స్థానికులకు ప్రాధాన్యం ఉంటుందని తెలియజేశారు. ట్రెయినీ మెకానిక్స్, మెకానిక్స్ ఉద్యోగానికి ఐటీఐలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, డ్రాఫ్ట్‌మెన్ మెకానిక్ ట్రేడ్ ఉత్తీర్ణత ఉండి 18 ఏళ్ల వయసు గల వారు అర్హులని తెలిపారు. ట్రెయినీ మెకానిక్‌కు శిక్షణ కాలంలో నెలకు రూ.3,500తో పాటు ఇన్సెంటివ్ చెల్లిస్తారన్నారు. శిక్షణ అనంతరం పనితీరును బట్టి శాశ్వత ఉపాధి, జీతం చెల్లిస్తారని తెలిపారు.
మెకానిక్‌కు నెలకు రూ.6 వేల జీతంతో పాటు ఇన్సెంటివ్‌లు ఇస్తారన్నారు. మొత్తం ఖాళీలు 20 ఉన్నాయన్నారు. 3 ఖాళీల టింకర్ ఉద్యోగానికి ఐటీఐలో షీట్ మెటల్, వెల్డింగ్ ట్రేడ్‌లో అర్హత ఉండాలన్నారు. అర్హత, అనుభవాన్ని బట్టి జీతం ఉంటుందన్నారు. 5 ఖాళీల ట్రెయినీ సూపర్‌వైజర్ ఉద్యోగానికి డిప్లొమోలో మెకానికల్, ఆటోమోబైల్ కోర్సు పూర్తి చేసి తగిన అనుభవం ఉండాలని తెలిపారు. నెలకు రూ.7 వేల జీతం, ఇన్సెంటివ్‌లు ఉంటాయన్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు తప్ప మిగతా వారు విశాఖలో పని చేయాలని తెలియజేశారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పూర్తి బయోడేటా, ధ్రువపత్రాలు, ఎంప్లాయిమెంట్ కార్డు, రేషన్ కార్డులతో కంచరపాలెం దరి జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.