రోడ్డు కోసం నీటిపారుదల శాఖ కాలువనే పూడ్చేసిందో సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం. దీంతో ఎనిమిది గ్రామాల్లోకి 300 ఎకరాలకు నీరు అందలేదు. మరికొన్ని పొలాలు నీటిముంపునకు గురయ్యాయి. దీనిపై స్పందించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆయకట్టురైతులు ఆందోళనకు సిద్ధపడుతున్నారు.మండలంలోని అమీన్‌సాహెబ్‌పేట రోడ్డును ఆనుకొని ఒక బడా సిమెంటు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ కంపెనీ వారు గొబ్బూరు ఛానల్ ప్రధాన కాలువను మూసివేశారు. దీంతో మండలంలోని అమీన్‌సాహెబ్‌పేట, నర్సాపురం, గొబ్బూరు, గొబ్బూరుపాలెం, ఏనుగుతుని, నూతనగుంటపాలెం, గైతులపాలెం, అచ్యుతాపురం గ్రామాలకు చెందిన 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ కంపెనీ చేసిన నిర్వాకాన్ని స్థానిక రైతులు, గొబ్బూరు ఛానల్ నీటిసంఘం డైరెక్టర్లు ఎలమంచిలి డివిజన్ ఇరిగేషన్ అధికారులకు తెలియజేశారు.