దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి హుండీలలో ఏటికేడాదికి కానుకలు పెరుగుతూ వస్తున్నాయి. గత ఎనిమిది సంవ త్సరాల గణాంకాలను పరిశీలిస్తే 2005-2006లో 6.11 కోట్లు, 2006-07లో 7.64కోట్లు, 2007-08లో 9.29 కోట్లు, 2008-09లో 10.68 కోట్లు, 2009-10లో 13.27 కోట్లు, 2010-11లో 16.38 కోట్లు, 2011-12లో 18.91 కోట్ల రూపాయల చొప్పున హుండీల ద్వారా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ 7.60 కోట్ల రూపాయలు వచ్చింది. వచ్చే ఆరు నెలలలోగా మరో పన్నెండు కోట్లయినా వస్తుందని భావిస్తున్నారు.కాగా కనకదుర్గమ్మకు వచ్చిన బంగారు కానుకలను కరిగించి ముంబాయి మింట్‌లో డిపాజిట్ చేశారు. అరవై ఏడు కిలోల నగలను కరిగిస్తే 57 కిలోల ముద్ద బంగారం వచ్చింది.ఈ బంగారాన్ని అక్కడే డిపాజిట్ చేసి దేవస్ధానానికి బాండ్లు ఇచ్చారు. వడ్డీ వస్తున్నది. ఎప్పుడైనా అవసరం అనుకుంటే బంగారాన్ని కొన్ని షరతులకు లోబడి వెనుకకు తీసుకోవచ్చు. కాగా మరల ఇప్పుడు దేవస్ధానం వద్ద సుమారు 42 కిలోల బంగారం నగలు ఉన్నాయి.