సబ్సిడీ గ్యాస్ సిలెండర్ల సరఫరాపై కొంత కాలంగా నెల\కొన్న గందరగోళానికి చమురు సంస్థలు తెరదించాయి. సెప్టెంబర్ 14 నుంచి మార్చి 31 వరకు కేవలం మూడు సబ్సిడీ సిలెండర్లను మాత్రమే సరఫరా చేస్తామని చమురు సంస్థల సమన్వయ సంఘం స్పష్టం చేసింది. మార్చి నుంచి ఆర్థిక సంవత్సరాంతం వరకు ప్రతి గ్యాస్ వినియోగదారుడికి ఆరు సబ్సిడీ సిలెండర్లను సరఫరా చేస్తామని, ఆ తర్వాత అవసరమైన సిలెండర్లను మార్కెట్ ధరకు అంటే రూ. 979. 50 పైసలకు కొనుగోలు చేసుకోవాలని పేర్కొన్నాయి.
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సిలెండర్ల సరఫరాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో వినియోగదారులలో కొంతకాలంగా, తీవ్ర గందరగోళం ఏర్పడింది. సబ్సిడీ సిలెండర్ల సరఫరాపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చమురు కంపెనీల సమన్వయ కమిటీ వినియోగదారులకు తలెత్తిన పలు అనుమానాలను నివృత్తి చేసింది. ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా డొమెస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డు (డిజిసిసి)ని తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. డిజిసిసి కార్డుపై గ్యాస్ సరఫరా చేసిన ప్రతిసారి పంపిణీదారు సిలెండర్ సీరియల్ నంబర్, సరఫరా తేదీ, ఎన్నవ గ్యాస్ సిలెండర్ అన్న విషయాలను నమోదు చేస్తారని, నమోదు చేసిన వివరాలు సరిచూసుకున్న తర్వాత వినియోగదారుడు పంపిణీదారుడు ఇచ్చే క్యాష్ మెమోపై సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా వినియోగదారుడు డిజిసిసి కార్డును పోగొట్టుకున్నప్పుడు సంబంధిత డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించి మరో కార్డును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డిజిసిసి బుక్‌కు నిర్ణీత రుసుమును వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుందన్నారు. పైపుల ద్వారా గ్యాస్‌ను వినియోగిస్తున్న అపార్ట్‌మెంట్ వాసులు, ఇతరులకు కూడా నిబంధనలను విధించారు. ఆయా అపార్ట్‌మెంట్‌ల సామర్థ్యాన్ని బట్టి సిలెండర్లను సరఫరా చేస్తామని, ప్రతి ఫ్లాట్‌ను ఒక యూనిట్‌గా పరిగణిస్తామన్నారు. ప్రతి ఫ్లాట్ యజమాని 14.2 కిలోగ్రాముల సిలెండర్‌ను ఒక యూనిట్‌గా పరిగణించాల్సి ఉంటుందన్నారు. పరిమిత సిలెండర్ల సరఫరా పూర్తయితే హౌసింగ్ సొసైటీ తమకు కావాల్సిన సిలెండర్లను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలన్నారు. ఆయా అపార్ట్‌మెంట్‌లలో ఉన్న వారి సమగ్ర వివరాలను హౌసింగ్ సొసైటీ నిర్వాహకులు సంబంధిత పంపిణీదారులకు అందించాల్సి ఉంటుందన్నారు. ఫ్లాట్‌లలో నివసిస్తున్న వారికి సంబంధించిన గుర్తింపు కార్డు (పిఒఐ), చిరునామా దృవీకరణ పత్రం (పిఒఎ), వినియోగదారుడి గుర్తింపు కార్డు (కెవైసి) లను పంపిణీదారులకు అందించాన్నారు. ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్‌లున్న వారి వివరాలను పంపిణీదారులు సేకరిస్తున్నారని, వారికి వినియోగదారులు పూర్తిగా సహకరించాలని కోరారు. వీలైనంత తొందరగా రెండేసి కనెక్షన్‌లున్న వారి ఏరివేత కార్యక్రమం పూర్తయితే వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలందించేందు కు వీలవుతుందన్నారు.
మరోవైపు కమిషన్ పెంచాలన్న పెట్రో డీలర్ల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. పక్షం రోజుల్లో కమిషన్ పెంపుపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేయనున్నట్లు కేంద్రం అంగీకరించింది. దీంతో నిర్ణీత వేళల్లోనే పెట్రోల్ బంక్‌లను తెరచి ఉంచాలన్న డీలర్లు తమ డిమాండ్‌ను ఉపసంహించుకున్నారు. ఇక నుంచి రాత్రి పొద్దుపోయేవరకూ బంక్‌లను తెరచి ఉంచనున్నట్లు పెట్రో డీలర్ల సంఘాలు ప్రకటించాయి. అయిదేళ్ళుగా పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన విక్రయాలపై ఆయా కంపెనీలు కమిషన్‌ను పెంచక పోవడంతో డీలర్లు సమ్మెలోకి వెళ్ళాల్సి వచ్చింది. సమ్మె వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురవడంతో దిగి వచ్చిన కేంద్రం డీలర్ల డిమాండ్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. అయితే డీలర్లకు పెంచనున్న కమిషన్‌ను వినియోగదారుల నుంచే వసూలు చేసేందుకు అయిల్ కంపనీలు నిర్ణయించాయి. దీంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. కొన్నాళ్ళుగా డీలర్లు తమకు కమిషన్ పెంచాలంటూ కేంద్రంపై వత్తిడి తీసుకు వస్తున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో డీలర్ల డిమాండ్‌ను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పక్కకు పెడుతూ వచ్చింది.
డీలర్ల కమిషన్ పెంపు వల్ల తమపై భారం పడకుండా ఉంటేనే అంగీకరిస్తామని ఆయిల్ కంపెనీలు పేర్కొనడం కూడా ఇందుకు కారణం. చివరకు డీలర్లకు ఏ మేర కమిషన్ పెంచితే ఆ భారం మొత్తాన్ని వినియోగదరాలుపైనే వేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో ఆయిల్ కంపనీలు కమిషన్ పెంపునకు అంగీకరించాయి. డీలర్లకు ఎప్పటి నుంచి కమిషన్ పెంపు అమలులోకి వస్తే ఆ క్షణం నుంచే వినియోగదారులపై ధరల భారం పడనుంది.
...avnk