
జీవన చక్రంలో వేటికి దూరమయ్యాం? ఫలితంగా ఎలాంటి కష్టనష్టాలను ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తులో జరిగే అనర్థాలేంటి?... ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ‘సైన్స్ ఎక్స్ ప్రెస్ రైలు’ సమాధానం చెబుతోంది. పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య ఆవశ్యకత, ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు వంటి ఎన్నో పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు జీవ వైవిధ్య ప్రత్యేక రైలు మంగళవారం నగరానికి రానుంది. రైలు ప్రత్యేకతలివే... మొత్తం బోగీలు 16. ఈ రైలును 2007 అక్టోబర్‌లో భారత ప్రభుత్వ సాంకేతిక విజ్ఞాన విభాగం, పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి. 2012 జూన్ 5న ఢిల్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, కేంద్రమంత్రి జయంతి నటరాజన్‌లు రైలును లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 16 బోగీల్లో ఎనిమిదింటిని పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ రూపొందించింది. మిగిలిన వాటిని ప్రభుత్వ సాంకేతిక విభాగం తయారు చేసింది. ఈ రైలులో జీవ, భౌగోళిక క్షేత్రాలైన హిమాలయ, గంగా మైదానం, ఉత్తర, తూర్పు, పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, సముద్రతీర, ఎడారి ప్రాంతాలు వంటి ఎన్నో రకాల ఎగ్జిబిషన్లు ఉంటాయి. వాతావరణ మార్పు, జీవ వైవిధ్యం, శక్తి సంరక్షణకు సం బంధించిన అంశాలు, సైన్స్ ప్రయోగశాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిం చేందుకు ప్రత్యేక బోగీలుంటాయి. జీవ వైవిధ్య అంశాలపై పూర్తి పట్టున్న 54 మంది వలంటీర్లు రైలులో అవగాహన కల్పిస్తారు.ఈ నెల 19 వరకు నగరంలో జీవవైవిధ్య సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 19 వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్ ఫాంపై జీవ వైవిధ్య ప్రత్యేక రైలు(సైన్స్ ఎక్స్ ప్రెస్) అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రైలును సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం.’ అని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, ఎలక్ట్రానిక్స్,గణితం వంటి 50కి పైగా అంశాలకు సంబంధించిన ప్రయోగాల గురించి వివరించేందుకు 13వ బోగీని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ బోగీలోకి ప్రవేశించాలంటే మాత్రం తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. వివరాలకు 09428405408 నెంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కు మెయిల్‌లో సంప్రదించవచ్చు. ఇంకెందుకాలస్యం దూకండిమరి ధూమశకటంలోకి..