జీవ వైవిధ్యంపై ఇదో అంతర్జాతీయ వేడుక! మొత్తం 193 దేశాల ప్రతినిధులు... కొందరు దేశాధినేతలు, అన్ని దేశాల పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, రెం డువేల మందికిపైగా పాత్రికేయులు... మొత్తంగా సుమా రు పదివేల మంది విదేశీ ప్రతినిధులు! దీనికి మన హైదరాబాద్ వేదిక! 'ప్రకృతిని రక్షించు. అది నిన్ను రక్షిస్తుంది!' ఇదీ నినాదం! ఇది ప్రభుత్వాల విధానం కావాలి!అందుకు ఇప్పటిదాకా ఏంచేశాం? ఇకపై ఏం చేయాలి? ఇందులో ఎవరి బాధ్యత ఎంత? ఇవీ మనముందున్న ప్రశ్నలు. దీనికి సమాధానం కనుగొనడమే జీవ వైవిధ్య సదస్సు ముఖ్య లక్ష్యం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) పేరిట ఇప్పటిదాకా పది సదస్సులు జరగ్గా.. ఇది కాప్-11. ఐరాస 2011-20ని జీవవైవిధ్య దశాబ్దంగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సదస్సు ఇదే! దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.450 కోట్లదాకా ఖర్చు చేస్తున్నాయి.
ఎవరెవరో వస్తారు! ఏవేవో మాట్లాడుకుంటారు! ఎన్నెన్నో తీర్మానాలు చేస్తారు! ఇందులో ఏ ఒక్కటీ సామాన్యుడికి అర్థం కాదు! అవి అమలయ్యాయో, లేదో కూడా తెలియదు! పది సదస్సుల్లో జరిగింది దాదాపు ఇదే! హైదరాబాద్ సదస్సు మాత్రం ఇందుకు భిన్నంగా నిలవనుంది. శాస్త్రవేత్తల నుంచి సామాన్యులదాకా అందరికీ అర్థమయ్యేలా చర్చలు జరుగుతాయని, తీర్మానాలు చేస్తారని నిర్వాహకు లు చెబుతున్నారు. అయినా... ప్రస్తుతం ఏదీ దాచేస్తే దాగే పరిస్థితి లేదు.1992లో బ్రెజిల్‌లో 'ధరిత్రీ సదస్సు' జరిగింది. అప్పటి తీర్మానాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. పాషాణ పాకాల్లాంటి తీర్మానాల సారాంశం మేధావులకే అంతు చిక్కలేదు. అప్పట్లో మీడియా కూడా విస్తృతంగా లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. కాప్-11కు వివిధ దేశాలనుంచి 2000 మంది జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు హాజరవుతున్నారు. ప్రతి అంశంపైనా మీడియా కన్ను వేస్తుంది. చర్చలు, సమావేశాలు, ఒప్పందాలు ఏమేరకు సామాజిక, పర్యావరణ సంబంధమైనవో... లేక ఆర్థిక పరమైనవో అప్పటికప్పుడే నిగ్గు తేలిపోతుంది.
వైవిధ్యమా... స్వార్థమా?
జీవ వైవిధ్య సదస్సులో అగ్రదేశాల స్వార్థమే లేదా? కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు అస్సలు లేవా? ఇవి కొందరు పర్యావరణవేత్తల సందేహాలు! ఇవి అర్థం లేనివేమీ కావు! ఒకచోట చేరి... ఒక దేశానికి, ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన జీవ, జంతుజాతుల సమాచారాన్ని తెలుసుకుని... వాటిపైనా మేధోపరమైన హక్కులు కల్పించుకోవడమనే రహస్య అజెండా ఈ సదస్సు వెనుక ఉందని పర్యావరణ నిపుణులు వాదిస్తున్నా రు. ఇరవై ఏళ్లలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన అనేక సదస్సుల తీర్మానాలు పెద్దగా అమలైన దాఖలాలు లేవని గుర్తుచేస్తున్నారు.పైగా... వెనుకబడిన, మూడో ప్రపంచ దేశాలకు చెందిన వైవిధ్య సంపదను బడా దేశాలు, బడాబడా కార్పొరేట్ కంపెనీలు సొంతం చేసుకోవడం గమనార్హం. "దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి నిర్వాకమే ఉదాహరణ. ఈ సంస్థ బహుళ జాతి సంస్థల కన్నుసన్నల్లో నడుస్తోంది. 40 వేల రకాల మొక్కలు, వృక్షాలకు చెందిన వివిధ రకాల జన్యు వనరుల జెర్మ్‌ప్లాసమ్‌లను సదరు సంస్థ బహుళ జాతి కంపెనీలకు అప్పగించింది'' అని పర్యావరణ వేత్తలు ఆరోపించారు. నిజానికి... ఇలా వ్యవహరించడం గతంలో జీవ వైవిధ్య సదస్సుల్లో చేసిన తీర్మానాలకు విరుద్ధం. అయినా, ఇది జరుగుతూనే ఉంది. మనకు కావాల్సింది కార్పొరేట్ అనుకూల జీవ వైవిధ్యం కాదని... అందరికీ పనికొచ్చే ప్రజా వైవిధ్యం అని చెబుతూ హైదరాబాద్‌లోనే పోటీ సదస్సు కూడా జరగనుంది.
కాప్-11 ముఖ్య లక్ష్యాలు..
* అందరికీ అందుబాటులో వైవిధ్యం...
* పేదరిక నిర్మూలనకు జీవ వైవిధ్యం
* జీవ వైవిధ్యాన్ని సాధించడం ఎలా?
* నగరాల నుంచి దేశ ప్రభుత్వాల వరకు అనుసరించాల్సిన ప్రణాళికల రూపకల్పన
* జీవ వైవిధ్య అభివృద్ధికి పరస్పర సహకారం
* సంప్రదాయ పరిజ్ఞానాన్ని సంరక్షించుకునేందుకు చట్టబద్ధ వ్యవస్థ
* సాంస్కృతిక, స్వదేశీ, స్థానిక ప్రజల ప్రతిభా వారసత్వాల రక్షణకు నైతిక నియమావళి ఏర్పాటు
* పంటలు, మొక్కల సంరక్షణపై అంతర్జాతీయ స్థాయి ప్రణాళిక.
