
నిర్దోషిగా బైటపడతానన్న అమెరికా ‘సైక్లింగ్ లెజెండ్’ లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆశలు ఆవిరయ్యాయి. రికార్డు స్థాయిలో అతను సాధించిన ఏడు టూర్ డి ఫ్రాన్స్ టైటిళ్లతోపాటు, ఇతర మేజర్ టైటిళ్లను కూడా వెనక్కి తీసుకోవాలని అంతర్జాతీయ సైక్లింగ్ మండలి (యుసిఐ) తీర్మానించింది. అంతేగాక, అమెరికా డోపింగ్ నిరోధక విభాగం (యుఎస్‌ఎడిఎ) విధించిన జీవితకాల సస్పెన్షన్‌ను ఖరారు చేసింది. పాలక మండలి మొత్తం ఈ నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించిందని యుసిఐ అధ్యక్షుడు పాట్ మెక్‌క్వాయిద్ ప్రకటించాడు. సమావేశం ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ ఏడు టూర్ డి ఫ్రాన్స్ టైటిళ్లను సమాఖ్య రద్దు చేసిందని స్పష్టం చేశాడు.
అంతేగాక, అతనిపై జీవితకాల సస్పెన్షన్‌ను విధిస్తూ యుఎస్‌ఎడిఎ తీసుకున్న నిర్ణయాన్ని ఖరారు చేసినట్టు తెలిపాడు. కేన్సర్ వ్యాధిని జయించి, అంతర్జాతీయ సైక్లింగ్‌లో రారాజుగా వెలిగిన ఆర్మ్‌స్ట్రాంగ్‌పై నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అమెరికా పోస్టర్ సర్వీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అతను స్వయంగా ఉత్ప్రేరకాలను వాడడంతోపాటు, జట్టులోని మిగతా సభ్యులనూ అవి వాడాలని బలవంతం చేశాడు. ఈ విషయాలను యుఎస్‌ఎడిఎ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ఒకప్పటి అతని సహచరులే స్పష్టం చేశారు. తాము కూడా డోపింగ్‌కు పాల్పడ్డామని, అయితే, ఆర్మ్‌స్ట్రాంగ్ ఒత్తిడి తేవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక్కోసారి డ్రగ్స్‌ను వాడాల్సి వచ్చిందని వివరించారు. తాను నిర్దోషినంటూ ఆర్మ్ స్ట్రాంగ్ చేసిన వాదన అతనికి వ్యతిరేకంగా వచ్చిన వందలాది సాక్ష్యాల ముందు వెలవెలపోయింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన యుఎస్‌ఎడిఎ అతనిపై నిషేధం వేటు వేసింది. ఈ నిషేధాన్ని ఖరారు చేయాలని, అంతేగాక, అతని పతకాలను కూడా వెనక్కి తీసుకోవాలని యుసిఐని కోరింది. ఈ ప్రతిపాదనలకు యుసిఐ సానుకూలంగా స్పందించింది. ఆర్మ్ స్ట్రాంగ్‌పై జీవితకాల నిషేధాన్ని ఖరారు చేసింది.
ఫలితంగా, అతని టూర్ డి ఫ్రాన్స్ టైటిళ్లను కూడా వెనక్కి తీసుకుంది. ఒకప్పుడు కెనడా అథ్లెట్ బెన్ జాన్సన్ మాదిరిగానే ఇప్పుడు ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా డోపింగ్ దోషిగానూ, క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన మోసకారిగానూ మిగిలిపోయాడు. ఇలావుంటే సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ యుసిఐ ఆమోదించిన తీర్మానాలపై ఆర్మ్‌స్ట్రాంగ్ స్పందించలేదు. అయ తే కేన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను ఏర్పాటు చేసిన ‘లివ్‌స్ట్రాంగ్’ ఫౌండేషన్ తరఫున కా ర్యకలాపాలను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. కాగా, ఆర్మ్ స్ట్రాంగ్ పతకాలను వెనక్కి తీసుకోవడంతో అతను టూర్ డి ఫ్రాన్స్ టైటిళ్లను సంపాదించినప్పుడు ద్వితీయ స్థానంలో నిలిచిన డ్రైవర్లను ఇప్పుడు విజేతలుగా యుసిఐ ప్రకటిస్తుందా లేదా అన్నది తేలాల్సిఉంది.
...avnk