
ప్రత్యేక రాయలసీమ అంటూ నాలుగు రోజుల క్రితం గొంతు విప్పిన సీమ టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాజాగామరో మెలిక ముందుకు తెచ్చారు. చంద్రబాబు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రానికి లేఖ రాసే వారు ప్రత్యేక రాయలసీమ కోసం కూడా లేఖ రాయాలని తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి హైదరాబాదులో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం తాను ఈ నెల 4వ తేది నుండి కర్నూలులో దీక్ష చేస్తానని ప్రకటించారు.రాయలసీమ మీద అన్ని పార్టీలు తమ వైఖరి చెప్పాలని, ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, లేకపోతే మూడు రాష్ట్రాలుగా విడిపోవాలని అన్నారు. ఇదే విషయం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలన్నారు.
తెలంగాణ గురించి మాట్లాడేవారు రాయలసీమ మీద తమ అభిప్రాయాన్ని బయటపెట్టాలని అన్నారు. తాను ప్రత్యేక రాయలసీమ నినాదం ఎత్తుకున్నది తెలంగాణను అడ్డుకోవడానికి కాదని, తెలంగాణ కోసం డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ రాయలసీమ మీద అభిప్రాయం చెప్పాలని అన్నారు. రాయలసీమ ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయి దారిధ్ర్యం, కరువు కాటకాలతో అల్లాడుతోందని, ఇప్పుడు సీమ ఉనికికే భంగకలిగే విధంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. తెలంగాణ కోసం మరోసారి చంద్రబాబు లేఖ రాయాలని తెలంగాణ నేతల నుండి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో బైరెడ్డి సీమ గురించి కూడా లేఖ రాయాలని డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.