
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పై ఇప్పుడు మరో అభియోగం…ఇన్ని రోజులూ వ్యక్తిగత జీవితాలను చిన్న భిన్నం చేసిన సంఘటనలే వెలుగులోకి రాగా, ఇప్పుడు చిన్నారుల మనస్తత్వాన్ని ఈ సైట్ తప్పుదోవ పట్టిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఫేస్ బుక్ అందుబాటులో ఉన్న గేమ్స్ ఆడుతూ చిన్నారులు లాస్ వెగాస్ లోని కాసినో గ్యాంబ్లర్స్ లా తయారవుతున్నారని డైటీమెయిల్ అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఫేస్ బుక్ ఒకే రకం గేమ్స్ అందుబాటులో పెట్టింది. దీన్ని బట్టి ఈ యూకే పత్రిక విశ్లేషణను భారత దేశానికి కూడా అన్వయించుకోవచ్చు. మొబైల్ ఫోన్స్ లోనూ, విద్యాసంస్థల, ఇంట్లోని పీసీలతో విద్యార్థులు విరివిగి ఫేస్ బుక్ బ్రౌజ్ చేస్తున్నారని, ఈ సందర్భంలో వారు గేమ్స్ పై ఎక్కువ సమయం గడుపుతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రత్యేకించి థ్రిల్ కోసం ‘విర్ట్చువల్ కాయిన్’ వంటి గేమ్స్ హిట్టింగ్ జాక్ పాట్ పేరుతో విద్యార్థుల మనస్థత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అభిప్రాయపడింది.

ఫేస్ బుక్ లో జాక్ పాట్ జాయ్, స్లోటోమానియా, జింగ్రా వంటి గేమ్ స్లాట్స్ వంద వరకూ ఉన్నాయి. ఈ గేమ్స్ సైట్ లో పెట్టడం ద్వారా ఫేస్ బుక్ భారీగా సొమ్ము సంపాదిస్తోంది. మొత్తం ఫేస్ బుక్ ఆదాయంలో వీటి ద్వారా వచ్చే సొమ్ము దాదాపు 12 శాతంగా ఉంది. ఇలాంటి గేమ్స్ ఆడితే, చిన్నపిల్లల్లోనూ, టీనేజర్ లలోనూ నిరాశ, నిస్ఫృహలు ఆవహిస్తాయని, ఒకవేళ వారు బాగా ఆడినప్పటికీ భవిష్యత్తులో పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయని మనస్తత్వ శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మనమంటే వీటిని తేలిక్కా తీసి పారేస్తాము కానీ, పిల్లల మనస్తత్వంపై ప్రభావితం చూపే అంశాలను పాశ్చాత్య ప్రభుత్వాలు క్షమించవు,మరి దీని వల్ల ఫేస్ బుక్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో!