
హీరోగా రూపాంతరం చెందిన కెమెడీ నటుడు సునీల్ ఇవాళ పోలీసులకు పట్టుబడ్డాడు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సుప్రీం కోర్టు సూచన మేరకు జంట నగరాల్లో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు కార్లను ఆపి వాటికున్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు. ఇదే క్రమంలో సునీల్ కారును కూడా పోలీసులు పట్టుకున్నారు. అమీర్‌పేట మైత్రీవనం వద్ద సంజీవరెడ్డినగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కార్లకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను నిలిపి వాటిని తొలగించాలని, లేకుంటే జరిమానా వేస్తామంటూ వాహనాల యజమానులకు సూచించారు. ఈ సందర్బంగా కొంత మంది కార్లకు బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించడంతో పాటు జరిమానా సైతం వసూలు చేశారు. ఇప్పటికే ఇదే విషయమై కార్ల యజమానులకు ప్రభుత్వం తగిన సూచనలు చేసిందని, అయినా ఇంకా కార్ల యజమానులు బ్లాక్ ఫిల్మ్ లను తొలగించకుండా నడపడం చట్టరీత్యా చెల్లదని అందుకే ప్రత్యేకంగా డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు తెలిపారు. ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, దీన్ని గుర్తించి కార్ల యజమానులు వెంటనే బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించుకోవాలని సూచించారు.
...avnk