
ఎవర్ గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి తమిళ హీరో అజిత్ పట్ల తన కృతజ్ఞత ఎలా చూపించాలా? అని ఆరాటపడుతోంది. అందులో భాగంగా అతని సినిమాలో ఓ గెస్ట్ పాత్ర పోషించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తోందట. అజిత్ తనను పర్శనల్ గా అడగకపోయినా సరే, అతని సినిమాలో నటిస్తానని అంటోంది. దీనికి కారణం... అతను ఆమె పట్ల చూపిన అభిమానమే! చిన్నప్పటి నుంచీ శ్రీదేవికి అభిమాని అయిన అజిత్, ఇటీవల శ్రీదేవి నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా తమిళ వెర్షన్లో గెస్ట్ పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. ఆమె అడిగిన వెంటనే మరోమాట చెప్పకుండా... ఒక్క పైసా కూడా తీసుకోకుండా... తన సొంత ఖర్చులతో ముంబయ్ వెళ్లి... హోటల్ ఖర్చులు కూడా తానే భరించి, అజిత్ ఆ సినిమా షూటింగులో పాల్గొన్నాడు. అతని అభిమానానికి ఎంతో చలించిన శ్రీదేవి, అతని అభిమానాన్ని, ఔదార్యాన్ని, నిరాడంబరతను తెగ పొగిడేస్తూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇప్పుడు అతని సినిమాలో తాను కూడా నటించి, అతని ఋణం తీర్చుకుంటానని అంటోంది. ఇదే విషయం అజిత్ వద్ద ప్రస్తావిస్తే, శ్రీదేవి ఆశీస్సులు తమ కుటుంబానికి వుంటే చాలని నవ్వేశాడు.
...avnk