
ప్రముఖ దర్శకుడిగా, నటుడుగా వెలుగొందుతోన్న రాఘవ లారెన్స్ కథానాయకుడిగా, దర్శకుడిగా వ్యవహరించనున్న 'ముని 3 ' చిత్రం ఈ నెల 24 న అంటే విజయ దశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్మాత బెల్లంకొండ సురేష్ చేస్తున్నారు. గతంలో లారెన్స్ తమిళంలో తెరకెక్కించిన 'ముని' చిత్రం తెలుగులోకి అదే పేరుతో అనువాదమైంది. అయితే ఈ సినిమా ఓ మాదిరిగా ఆడినా లారెన్స్ నటనా ప్రతిభకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా ఆయన తీసిన 'ముని 2 ' చిత్రం తెలుగులో 'కాంచన' పేరుతో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడా సినిమాను త్రీడీ ఫార్మెట్టులో ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తూనే, 'ముని 3 ' నిర్మాణానికి బెల్లంకొండ సురేష్ శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 24 న హైదరాబాదులో గ్రాండ్ గా జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడిస్తామని నిర్మాత చెబుతున్నారు.
..avnk