
బ్రాహ్మణులను కించపరిచే విధంగా రూపొందించిన ‘దేనికైనా రెడీ’ సినిమాను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి డిమాండ్ చేసింది. మోహన్‌బాబు కుమారుడు విష్ణు హీరోగా నటించిన ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి అధ్యక్షుడు సుధాకర శర్మ, యూత్ విభాగం అధ్యక్షుడు రవికుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు సుమలత శర్మ, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ఫిలింనగర్‌లోని మోహన్‌బాబు ఇంటిని ముట్టడించారు. మోహన్‌బాబు వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే తాము కూడా దేనికైనా రెఢీ అని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. సుధాకర శర్మ మాట్లాడుతూ.. బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమాలో పవిత్ర చండీయాగం నిర్వహించే సన్నివేశంలో పాటలు రూపొందించి యాగాన్ని అపహాస్యం చేశారన్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
