
తనకు ప్రాణహాని ఉందని కర్ణాటక సినీ నటి హేమాశ్రీ ముందే ఊహించినట్లు ఆమె 2012 జూలై 19న పోలీసులకు అందజేసిన ఫిర్యాదును బట్టి తెలుస్తోంది. హేమాశ్రీ పోలీసులకు తన భర్తపై చేసిన 10పేజీల ఫిర్యాదుపత్రంలోని వివరాలు బయటపడ్డాయి. అందులో పేర్కొన్న ప్రకారం...‘హేమాశ్రీ అనే నేను చాలా సమస్యలలో ఉన్నాను. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఎనిమిది సంబంధాల్లో ఏదీ నిశ్చయం కాకపోవడంతో మధ్యవర్తి ద్వారా సురేంద్ర బాబు నన్ను చూడడానికి వచ్చాడు. అతని అర్హత, ఆస్తిపాస్తుల విషయంలో అబద్ధాలు చెప్పాడు. సంబంధం వద్దనుకున్నాను. నేను లేని సమయంలో నా తల్లిదండ్రులను ప్రలోభపెట్టాడు. 2011 జూన్ 22న బలవంతంగా తిరుమలలో వివాహం చేశారు. అతనితో కాపురం చేయకపోవడంతో నాపై దుష్ర్పచారం మొదలెట్టాడు’ అని వివరించింది. దీనిని ఖండిస్తూ సురేంద్రబాబు పోలీసులకు వివరణ పత్రాన్ని కూడా అందించాడు. తన వద్ద ఆమె భారీ మొత్తంలో డబ్బు తీసుకుందని, దానికి హేమాశ్రీ తల్లిదండ్రులు, అక్క,బావ సాక్ష్యమని వివరించాడు. పెళ్లి అయిన తర్వాత తమ ఇంటి నుంచి పారిపోయిన హేమాశ్రీ ఇప్పటిదాకా మళ్లీ ఇంటికి రాలేదని పేర్కొన్నాడు.