ఆస్ట్రియాకు చెందిన ఫెలిక్స్ బామ్‌గార్టనర్ శబ్దవేగాన్ని మించి ప్రయాణించాడు. ఇందుకు ఆయన ఏ వాహనాన్ని ఉపయోగించలేదు. ఆకాశంలో ఇంతవరకు ఎవరూ చేయని ఈ సాహసకార్యాన్ని ఫెలిక్స్ చేశారు. భూమికి 24 మైళ్ళు లేదా 38.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్ పొరకు క్యాప్సూల్ గుండా చేరుకున్న ఫెలిక్స్ అక్కడినుంచి దూకి భూమికి చేరుకున్నాడు. హైటెక్ సూట్ ధరించిన ఫెలిక్స్ కిందికి వస్తున్న సమయంలో శబ్ద వేగాన్ని దాటి, గంటకు 1,342 కిలోమీటర్ల వేగంతో కిందికి దూసుకు వచ్చాడు. ఇది 1.24 మాక్‌తో సమానం. కాప్సూల్ నుంచి దూకిన 9 నిమిషాలకు, తూర్పు న్యూ మెక్సికో ఎడారిలో భూమికి చేరుకున్నాడు. భూమికి చేరిన తర్వాత ఫెలిక్స్ మాట్లాడుతూ... ‘రికార్డులు బ్రేక్ చేయటం కాదు, ప్రాణాలతో క్షేమంగా దిగటమే గొప్ప’ అని వ్యాఖ్యానించారు.
