ఢిల్లీ పెద్దలకు తెలంగాణ పై స్టేట్ మెంట్ ఇవ్వడం చాలా చులకన అయిపోయింది. ఢిల్లీ నుండి ఎవరు ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ప్రతిసారీ తెలంగాణ పై ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉంటారు. దానికి చేతకాని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారికి వత్తాసు పలుకుతారు. తాజాగా హైదరాబాద్ కి వచ్చిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్... మళ్ళీ జాదు మాటలే మాట్లాడాడు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని, నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని అన్నారు. ఈ అంశం చాలా సున్నితం అయిందని గతంలో చాలా సార్లు చెప్పానని, దీని పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణ ప్రాంతానికి చెందిన అందరి నాయకులతో చర్చలు ఇప్పటికీ జరుపుతున్నామని, ఇప్పటి వరకు అయితే... తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మరి మొన్నటి వరకు తెలంగాణ ఢిల్లీలో ఉండి ఏదో సాధించానని చెప్పుకుంటున్న కేసీఆర్ కి ఆజాద్ స్టేట్ మెంటు చెంపపెట్టులాంటి అనుకోవచ్చు. దీని పై ఫాం హౌజ్ లో ప్రశాంతంగా గడుపుతున్న కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
