
పాకిస్థాన్ స్వాత్ లోయలో తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ (14) శరీరంలోంచి వైద్యులు ఒక తూటాను తొలగించారు. షెషావర్ సైనికాస్పత్రిలో మూడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి , వెన్నుపూస దగ్గర్లో దిగబడిన తూటాను బయటకు తీశారు. మలాలా కోలుకొంటుందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ ముంతాజ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాలా తలలో వాపును తగ్గించేందుకు కూడా వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్త స్రావం అయ్యిందని , ప్రస్తుతానికి బాలిక పరిస్థితి నిలకడగా లేదని అధికారులు పేర్కొన్నారు. కాల్పుల్లో మలాలాకు రెండు తూటాలు బలంగా తాకాయి. వాటీలో ఒకటి తలలోంచి వెన్నుపూస దగ్గరి వరకు వెళ్లిందని డాక్టర్లు చెబుతున్నారు. మలాలా త్వరగా కోలుకోవాలని ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు.

