
కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు ఖాకీలు మహాత్మా గాంధీ జయంతి నాడే ఓ వివాహితపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీకి చెందిన వివాహిత(28) ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున 3గంటల ప్రాం తంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంట్లోకి చొరబడి ఆత్యాచారయత్నానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ వివాహిత గొంతు పట్టుకోగా మరో కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే తేరుకున్న బాధితురాలు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు వచ్చేలోపునే ఇద్దరు కానిస్టేబుళ్లు పరారయ్యారు. ఈ మేరకు సదరు బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ జి.మహేష్‌బాబు ఎదుట విలేకరులకు మొరపెట్టుకుంది. తాము ఏఆర్ పోలీసులమని చెప్పి ఈ అఘాయిత్నానికి ప్రయత్నించారని, తాను ఇప్పటివరకు వారిని ఎక్కడా చూడలేదని బాధితురాలు పేర్కొంది. తన మెడలో ఉన్న తులం బంగారు చెయిన్‌ను లాక్కొని గోడదూకి వారు పారిపోయారని బాధితురాలు తెలిపింది. సదరు కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్న వ్యక్తులు ఉపయోగించిన నెంబర్‌లేని ద్విచక్రవాహనంతో పాటు లాఠీని వదిలి పారిపోయారని, తన సోదరుడు రాంభజన్ సహాయంతో తెల్లవారుజామున 3:30గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు బాధితురాలు తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై బెల్లంపల్లి టూ టౌన్ పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
