Ramayanam-Forty-Four | రామాయణం - 44వ భాగం

Ramayanam forty four story

Ramayana, Ramayana Forty-Four, Ramayana Story, Ramayana Epic Story, Ramayana Parts, Ramayanam 44th Part

The Ramayana is an ancient Sanskrit epic about Rama. It is one of the two most important ancient epics of India, the first one being the ancient Ramayana. The epic was originally written by sage (rishi) Valmiki of Ancient India. The book has about 96,000 verses and is divided into seven parts.

రామాయణం-44వ-భాగం

Posted: 09/03/2018 02:33 PM IST
Ramayanam forty four story

రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్లకలువ రంగులో, సగం ఎర్రకలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్ళతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకూ ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది, గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ, అటూ ఇటూ పరుగులు తీస్తూ, అక్కడున్న మృగాల దెగ్గరికి వెళుతూ, మళ్ళి తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.

కాని మారీచుడు మిగతా మృగాల దెగ్గరికి వెళ్లేసరికి, అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పూవులు కోస్తుంటే, ఆవిడకి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి " రామా! లక్ష్మణా! మీరు మీ ఆయుధములను ధరించి గబగబా రండి " అనింది. రామలక్ష్మణులు వచ్చాక, సీతమ్మ వాళ్ళతో " ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశార, ఎంత అందంగా ఉందో. సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు.............." అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా, వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు.....

శంకమానః తు తం దృష్ట్వా లక్ష్మణో రామం అబ్రవీత్ |

తం ఏవ ఏనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం ||

" అన్నయ్యా, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది, వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి, భుజించాడు. నామాట నమ్ము, ఇది కచ్ఛితంగా మారీచుడి మాయ " అన్నాడు.

అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో " ఆర్యపుత్రా! నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది, నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింపచేసినట్టు, ఒంటి మీద రాత్నాలలాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి, వాటితో పాటు ఈ జింక కూడా ఉంటె నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం, మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంక కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళి పోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకొనివెళదాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపచేస్తుంది. మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి ' అబ్బ, ఏమి మృగం వదిన ' అంటాడు, అత్తగార్లు అందరూ చూసి ' అబ్బ, ఏమి మృగం ' అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే, దాని చర్మాన్ని ఒలుచుకొని, లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే, ఎంతబాగుంటుందో. రామ! నేను స్త్రీని కావడం చేత, ఏదన్నా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ' ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే ' అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడాన. అలా మాట్లాడితే ఏమి అనుకోకండె " అనింది.

అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి " లక్ష్మణా! మీ వదిన ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో ఏమి అడగలేదు. మొట్టమొదటి సారి ఈ జింకని అడుగుతుంది. ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందొ మీ వదిన మాటలలో స్పష్టంగా అర్ధమవుతోంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే, తీసుకురాను అని నేను ఎలా అనగలను. అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకొని తీసుకువస్తాను. ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే, దాని శరీరాన్ని అయినా తీసుకువస్తాను. మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి రెండే ఉన్నాయి, ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది ( దీని అర్ధం ఏంటంటే, చంద్రుడిలో ఎటువంటి మృగం ఉండదు, అలాగే భూమి మీద ఇది ఉందంటే, ఈ రెండూ మాయె అని అర్ధం). ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడె అయితే నేను వాడిని సంహరిస్తాను. లక్ష్మణా! చాలా జాగ్రత్త సుమా. ప్రతి క్షణమూ నువ్వు శంకిస్తూనె ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి " అని చెప్పి, రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్ళాడు.

జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ, మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు, కాని రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్ధానమయిపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా, మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్ళి కనపడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని, ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కొదండానికి సంధించి, బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడా మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా " హా! సీత, హా! లక్ష్మణా " అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులోనుంచి నీరు బయటకి వస్తే ఎలా ఉంటుందో, అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు.

ఆ దృశ్యాన్ని చూశిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకువచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకువచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కాదా అని బెంగపెట్టుకొని, అక్కడున్నటువంటి రెండు మృగాలని సంహరించి, వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి ' హా! సీత, హా! లక్ష్మణా ' అనే కేక సీతమ్మ చెవినపడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి " చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. ' హా! సీత, హా! లక్ష్మణా' అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో, ఇవ్వాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు " అని అనింది.

అప్పుడు లక్ష్మణుడు " వదినా! నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు " అని అన్నాడు.

తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అన్న బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి " నాకు ఇప్పుడు అర్ధమయ్యింది నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటె నువ్వు ఇంత సంతోషంగా కుర్చోగలుగుతున్నావు. నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండడమే. అందుకే, రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే వచ్చావు. నీ ముఖంలో ఒక గొప్ప నమ్మకం, హాయి కనపడుతున్నాయి. శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతువిని ఇంత హాయిగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు 13 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావు. మహాపాపి! ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా. నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక, రాముడికి సేవ చెయ్యడానికే వచ్చినవాడివి అయితే, రాముడు అరణ్యంలో ' హా! సీత, హా! లక్ష్మణా ' అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కుర్చోగాలవా, నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడడం కోసం పరుగెత్తేవాడివి. బహుశా భరతుడే నిన్ను పంపాడేమో, మీ ఇద్దరు కలిసి కుట్ర చేశారు " అనింది.

తన రెండుచేతులతో సీతమ్మకి అంజలిఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు " దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులంతా ఒకపక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా ఆయనని ఎవరూ నిగ్రహించలేరు. అన్నయ్య పరాక్రమమేమిటో నాకు తెలుసు. వదినా! ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకొని మాట్లాడుతున్నావు, అరిచినది మయా మారీచుడు, అన్నయ్య అరవలేదు. నామాట నమ్ము.

న సస్ తస్య స్వరో వ్యక్తం న కశ్చిత్ అపి దైవతః |

గంధర్వ నగర ప్రఖ్యా మాయా తస్య చ రక్షసః ||

నేను యదార్ధం చెబుతున్నాను, అది అసలు మా అన్నయ్య అరుపే కాదు. మాయావి అయినవాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో, అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయేముందు ఒక మాయావి అరిచాడు. మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెళతావు. అందుకని నువ్వు బెంగపెట్టుకోకు. నువ్వు అలా చూస్తూ ఉండు, అన్నయ్య కోదండం పట్టుకొని వచ్చేస్తాడు. ఆ మాయ మృగం చర్మంతో వస్తాడు. అన్నయ్య వెళ్ళేముందు, వదినని నీకు అప్పజెప్పి వెళుతున్నాను ప్రతి క్షణాన్ని సంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు. నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళితే, అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నిలుచున్నాను తప్ప నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు వదినా. నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు. నిన్నగాక మొన్న ఖర దూషణులతో కలిపి 14,000 మంది రాక్షసులని అన్నయ్య చంపాడు. అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయా స్వరూపంతో ఇవ్వాళ ప్రవర్తించారు. నా మాట నమ్ము, ఆ అరుపులని నమ్మకు " అన్నాడు.

అప్పుడు సీతమ్మ " నాకు అర్ధమయ్యిందిరా మహా పాపి! కృరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ద్రువపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు, నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కాని నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇందీవరశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటె నువ్వు నా దెగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను " అనింది.

అప్పుడు లక్ష్మణుడు " ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాళ. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది " అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని " వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, కాని నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమి చెప్పుకొని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు, భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది. కాని నన్ను ఇన్నిమాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు.

వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక, ఓ వనదేవతలార! మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినా! నేను రాముడి దెగ్గరికి వెళుతున్నాను, నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను " అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ " అమ్మా! నేను మళ్ళి తిరిగొచ్చి, మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే, మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా...." అన్నాడు.

అప్పుడు సీతమ్మ " పాపిష్ఠివాడ, నువ్వు ఇంకా వెళ్ళకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను. కదులుతావ కదలవా " అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది.
అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు.

Source: fb.com/LordSriRamaOfficalPage

 
 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramayana  Parts  రామాయణం  భాగాలు  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more

  • Ramayanam forty two story

    రామాయణం-42వ-భాగం

    Aug 23 | రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు "... Read more