Funny Stories
పక్కింటివాళ్లకు బట్టలు కడగటం సరిగ్గా రాదు!

కొత్తగా పెళ్లైనా ఒక జంట తమ భవిష్యత్తు జీవితాన్ని గడపడానికి నగరానికి వస్తారు.

చేరుకోగానే వాళ్లు తమకోసం అద్దెకు ఒక ఇంటిని తీసుకున్నారు. వారి ఇంటి పక్కనే వున్న పొరుగువారితో కూడా స్నేహంగా వుండేవారు.

ఒకరోజు కొత్తగా పెళ్లయిన మహిళ ఉదయాన్నే లేచి కిటికీలో నుంచి పొరుగింటివారు ఉతికి, ఆరేయడానికి వేసిన బట్టలను చూస్తుంది.

అది చూసిన ఆమె తన భర్తతో.. ‘‘ఇదిగో చూడండి. మన పొరుగింటివారికి బట్టలు కడగటం సరిగ్గా రాదనుకుంట! అసలు ఆమె ఎటువంటి సబ్బును ఉపయోగిస్తుందో ఏమో! చూడ్డానికి బట్టలు ఎంత మురికిగా వున్నాయో చూడండి!’’

భర్త మాత్రం ఆమె చెప్పిన మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అలాగే వింటుంటాడు.

ఇలాగే ప్రతిరోజు ఆమె తన పొరుగింటివారు ఉతికి, ఆరేసిన బట్టల గురించి తన భర్తతో చెబుతూనే వుంటుంది.

ఒక నెల తరువాత భార్య ఉదయాన్నే లేచి కిటికీలో నుంచి చూడగానే ఒక్కసారి కలవరపడిపోతుంది. షాకింగ్ లో వున్న ఆమె తన భర్తతో.. ‘‘ఏవండి.. ఈసారి మన పొరుగింటివారు ఏదో మంచి సబ్బును ఉపయోగించినట్లున్నారు. అంతేకాదు.. ఆమె బట్టలను ఉతకడం నేర్చుకుంది. ఈరోజు బట్టలు చాలా బాగా వున్నాయి. నాకు అర్థం కానిదేమిటంటే.. ఆమె ఇలా ఎలా చేయగలిగింది?’’ అని అంటుంది.

అప్పుడు ఆమె భర్త.. ‘‘ఈరోజు ఉదయాన్నే నేను చాలా త్వరగా లేచి మన గదిలో వున్న కిటికీలను బాగా శుభ్రం చేశాను. అందుకే అవి అలా కనిపిస్తున్నాయి.’’ అని అంటాడు.