
నాగార్జున హీరోగా వీరభద్రం చౌదరి రూపొందించే 'భాయ్' చిత్రానికి కథానాయికగా రిచా గంగోపాద్యాయ పేరు ఖరారైందనుకుంటున్న తరుణంలో మరో పేరు తెరమీదకు వచ్చింది. బాలీవుడ్ భామ ఆదా శర్మ పేరును కూడా ప్రస్తుతం చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నారు. విక్రమ్ భట్ రూపొందించిన '1920' చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన ఆదా శర్మకు ఆ చిత్రం మంచి పేరు తెచ్చింది. ఆమె అభినయానికి సంబంధించి మంచి సమీక్షలు కూడా వచ్చాయి. దాంతో ఆమెకు చాలా కమర్షియల్స్ లో నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడీ అమ్మాయితో ఒక ట్రైల్ షూట్ చేస్తున్నట్టూ, అది చూసిన తర్వాత ఫైనలైజ్ చేయడం జరుగుతుందనీ అంటున్నారు. ఈ 'భాయ్' చిత్రాన్ని నాగార్జున తమ అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తారు.
