Rajni kanth kaala movie review రజనీకాంత్ పైసా వసూల్ చిత్రం.. కాలా..

Teluguwishesh Telugu Content Telugu Content Kaala is certainly more Ranjith movie, than Rajinikanth, which isn’t a terrible thing given the fact that Rajinikanth isn’t merely a star anymore... he’s also a politician. Product #: 87893 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కాలా

  • బ్యానర్  :

    వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌

  • దర్శకుడు  :

    పా.రంజిత్‌

  • నిర్మాత  :

    ధ‌నుశ్‌

  • సంగీతం  :

    స‌ంతోశ్ నారాయ‌ణ్‌

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    ముర‌ళి.జి

  • ఎడిటర్  :

    శ్రీక‌ర్ ప్ర‌సాద్‌

  • నటినటులు  :

    ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు

Kaala Movie Review

విడుదల తేది :

2018-06-07

Cinema Story

తిరున‌ల్ వేలికి చెందిన యువ‌కుడు క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా ముంబై న‌గ‌రంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల్లో వారికి అండ‌గా నిల‌బ‌డి వారి నాయ‌కుడుగా ఎదుగుతాడు. అక్క‌డే జ‌రీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు.. కానీ ఒక్క‌టి కాలేక‌పోతారు. చివ‌ర‌కు కాలా సెల్వి(ఈశ్వ‌రీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ధారావి ప్రాంతం పేద ప్ర‌జ‌ల‌కు చెందింది. అక్క‌డున్న హిందూ ముస్లింలు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెలిసి ఉంటారు.

అయితే ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాల‌ని హ‌రినాథ్ దేశాయ్‌(నానా ప‌టేక‌ర్‌) వంటి రాజ‌కీయ నాయ‌కుడు ప్ర‌య‌త్నిస్తాడు. అయితే ఉన్న చోటును వ‌ద‌లి పేద ప్ర‌జ‌ల ఎక్క‌డికి పోతారు. అందువ‌ల్ల వారు కాలా నాయ‌క‌త్వంతో ఎదురుతిరుగుతారు. అనుక‌న్న ప‌ని కాక‌పోతే మ‌న రాజ‌కీయ నాయ‌కులు ఊరుకుంటారా? అక్క‌డి మ‌నుషుల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టిస్తారు. అప్పుడు కాలా ఏం చేస్తాడు? త‌న ప్రాంత ప్ర‌జల‌ను ఒక్క‌టి చేసే ఎలా పోరాడుతాడు? అనేదే చిత్ర కథ.

cinima-reviews
Telugu Content

విశ్లేషణ

ముంబైలోని ధారావి మురికివాడలోని ప్రజల కష్టాలు, ఆ మట్టిపై వాళ్లకున్న మమకారం.. దాని కోసం వారు ఎదుర్కోనే సమస్యలు.. వాటికోసం జరిగే పోరాటం.. పెద్దలను ఎదరించి గాల్లో కలసిన అమాయక పేదల ప్రాణాలు.. ఫలితంగా ప్రజల తిరుగుబాటు.. తిరుగుబాటు నాయకుడిగా రజనీకాంత్‌.. తలైవా నుంచి కోరుకునే హీరోయిజం, రొమాంటిక్‌ సన్నివేశాలు, డైలాగ్‌లు దాంతో పాటు ఓ సామాజిక సమస్య.. వీటన్నంటినీ వరుస క్రమంలో పేర్చుకుంటూ సన్నివేశాలను రాసుకుని చక్కగా తెరకెక్కించడంలో సఫలమయ్యాడు దర్శకుడు పా రంజిత్.

కాలా- చిట్టెమ్మ(హుమా ఖురేషి)ల మధ్య నడిచిన లవ్‌ట్రాక్‌ కథకు కాస్త దూరంగా సాగినా, రజనీ అభిమానులకు నచ్చుతుంది. విశ్రాంతి ముందు ఘట్టంలో నానా పాటేకర్‌-రజనీ మధ్య సాగే సన్నివేశం  సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాంటి మరో రెండు మూడు సన్నివేశాలు ఉండుంటే ‘కాలా’ కచ్చితంగా అభిమానులను మురిపించేది. కానీ, రజనీ హీరోయిజానికి, ఆయన నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలకు ఈ కథ-కథనం కాస్త దూరంగా సాగాయి. కథనంలో వేగం లేకపోవడం లోపంగా కనిపిస్తుంది. నానా పాటేకర్ లాంటి నటుడు ఉన్నప్పుడు ఆ పాత్రను దర్శకుడు ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది. రజనీ-నానాపాటేకర్ల మధ్య సాగే సన్నివేశాలు రెండు, మూడు ఉంటాయంతే, కానీ, వాటిని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.

సెకెండ్ హాఫ్ లో కథ మొత్తం ధారావి చుట్టూనే తిరుగుతుంది. ఎమోషన్స్‌ పండించే ఆస్కారం ఉన్నా, అలాంటి సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నా, వాటిని ప్రేక్షకులను ప్రభావితం చేసేంతలా  తెరకెక్కించలేదు. అగ్రహారోల అభిమానులు ముందుగా సంతృప్తి చెందితేనే సినిమా హిట్. అయితే అలా రజనీ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో కూడా దర్శకుడు అనుకున్న స్థాయిలో రూపోందించలేదు. అది అభిమానులను కాస్త నిరాశ పరుస్తుంది. ఏ పాత్రా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండదు.

పోరాట సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానంలో మాత్రం దర్శకుడు, సాంకేతిక నిపుణుల ప్రతిభ కనపడుతుంది. రజనీలాంటి కథానాయకుడు ఉన్నప్పుడు బలమైన కథ, కథనాలు ఉండాలి. అవి ఓ మాదిరిగా ఉన్నా, రజనీ తన హీరోయిజంతో లాక్కొచ్చేయగలడు. కానీ, రజనీని మాత్రమే నమ్ముకొని ‘కబాలి’ని తెరకెక్కించాడు పా.రంజిత్‌. మరోసారి అదే తప్పును చేసినట్లు అనిపిస్తుంది. రజనీకాంత్‌ తప్ప మరో ఆకట్టుకునే అంశం ఏదీ లేకపోవడం కాలాకు శాపంగా మారింది.

 

నటీనటుల విషానికి వస్తే

 

రజనీకాంత్‌ సినిమా అంటే కేవలం ఆయనను చూడటానికి మాత్రమే థియేటర్‌కు వస్తారు అభిమానులు. ఆ విషయం పా.రంజిత్‌కు బాగా తెలుసు. అయితే, రజనీకాంత్‌ను కూడా సరిగా ఉపయోగించుకోలేదేమోన్న భావన కలుగుతుంది. సినిమా ప్రారంభమైన చాలా సేపటివరకూ రజనీకి సరైన డైలాగ్‌లు ఇవ్వలేదు. అయితే, కథ నడుస్తున్న కొద్దీ, రజనీపాత్రను కొంచెం కొంచెం పెంచుకుంటూ పోయాడు. కాలాగా విశ్వరూపం అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది.

ఆ అవకాశం వచ్చినప్పుడల్లా రజనీ తన ఛార్మ్‌ను చూపించాడు. రజనీ తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర నానాపాటేకర్‌ది. ఆ పాత్రకు ఆయనను తీసుకోవడం రంజిత్‌ చేసిన తెలివైన పని. నానా పాటేకర్‌ కనిపించినప్పుడల్లా తెరపై ఓ గాంభీర్యం కనిపిస్తుంది. రజనీ నానా పాటేకర్‌లను ఒకేసారి చూస్తే రెండు సింహాలు వేటకు దిగినట్లు అనిపిస్తాయి. అయితే, అలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈశ్వరీరావు, హుమా ఖురేషి, సముద్రఖని వీరంతా తమ పాత్ర పరిధి మేరకు రాణించారు. మిగతా వాళ్లెవరూ తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టే నటులు కాదు.

 

 

టెక్నికల్ అంశాలకు వస్తే..

 

సంతోష్‌ నారాయణ్‌ సంగీతం మరోసారి ‘కబాలి’ చిత్రాన్ని గుర్తు చేసేలానే వుంది. తన నేపథ్య సంగీతంతో పాటు పాటల్లో ‘కబాలి’ థీమ్ కనిపించింది. ఏడుపు పాటల్లోనూ ర్యాప్ పెట్టిన ఘనత సంతోష్ నారాయణన్, పా రంజిత్‌ల‌కు మాత్రమే దక్కుతుంది. ముఖ్యంగా రజనీ, హ్యూమా ఖురేషి మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాల్లో వచ్చే నేపథ్య సంగీతం, 'చిట్టమ్మా...' పాట ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ధారావి అనే ఒక మురికివాడను సెట్ గా రూపొందించి ఆశ్చర్యపరిచాడు కళా దర్శకుడు.

అది ఒక మురికివాడ కాదు సెట్‌ అన్న విషయాన్ని మనకు తెలియకుండా మాయ చేశాడు. కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటుంది. విశ్రాంతి ముందు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ కూడా అభిమానులకు నచ్చుతుంది. పా.రంజిత్‌ కథకుడిగా మరోసారి తడబటాకు గురయ్యాడు. రజనీకి సరిపోని కథలో రజనీని నిలబెట్టే ప్రయత్నం చేసి, మరోసారి అభిమానులకు కాస్త చేదు గుళికనే ఇచ్చాడని చెప్పాలి.

తీర్పు..

సినిమా స్లో నెరేష‌న్‌లో ఉండ‌టం. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థం. ఇక సినిమాలో కోర్ పాయింట్ బాగానే ఉన్నా.. ర‌జ‌నీకాంత్ వంటి మాస్ హీరోను.. హీరోయిజాన్ని ఇంకా ఎలివేట్ చేయాల‌నిపిస్తుంది. అంద‌రికీ కోర్ థీమ్ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇక తెలుగు పాట‌ల్లోని సాహిత్యం అస‌లు అర్థం కావ‌డం లేదు.

చివరగా.. అభిమానులకు మింగుడుపడని ఫైసా వసూల్ చిత్రం..

 

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh