అర్జున్ రెడ్డి రివ్యూ .. మోడ్రన్ అండ్ బోల్డ్ దేవదాస్ | Arjun Reddy Telugu Movie Review and Rating

Teluguwishesh అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి Vijay Devarakonda's Arjun Reddy Telugu Movie Review. Story, Highlights and Cast Performances. Product #: 84359 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అర్జున్ రెడ్డి

  • బ్యానర్  :

    భద్రకాళి పిక్చర్స్

  • దర్శకుడు  :

    అర్జున్ రెడ్డి

  • నిర్మాత  :

    ప్రణయ్ రెడ్డి వంగ

  • సంగీతం  :

    రధాన్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    రాజు తోట

  • నటినటులు  :

    విజయ్ దేవరకొండ, షాలిని, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, కాంచన, ప్రియదర్శి తదితరులు

Arjun Reddy Movie Review

విడుదల తేది :

2017-08-25

Cinema Story

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) ఓ మెడికో. బహు కోపిష్టి కావటంతో తరచూ గొడవలు పడుతూ ఉంటాడు.  అలాంటి స్థితిలో జూనియర్ అయిన ప్రీతి (షాలిని)ని చూసి ప్రేమలో పడిపోతాడు. తన కోసమే కాలేజీలో కొనసాగడానికి కూడా నిర్ణయించుకుంటాడు కూడా. కొన్నాళ్ల తర్వాత ప్రీతి కూడా అతణ్ని ఇష్టపడుతుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ ఆమె తండ్రి ఒప్పుకోకపోవటంతో  ప్రీతి వేరే వాడిని పెళ్లి చేసుకుని దూరమవుతుంది. ఆ స్థితిలో డ్రగ్స్ కు బానిసైన అర్జున్ రెడ్డి జీవితం నాశనం చేసుకుంటుంటాడు. అయితే కొన్ని ఘటనలు అతడి జీవితాన్ని పెను మలుపు తిప్పుతాయి. చివరకు అతని లైఫ్ ఏమౌతుంది అన్నదే స్టోరీ.

cinima-reviews
అర్జున్ రెడ్డి

పెళ్లిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందించిన ఈ చిత్రం అర్జున్ రెడ్డి. ఈ యేడాది మొదట్లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తోది. ఎట్టకేలకు ఈ మధ్యే రిలీజ్ డేట్ ఖాయం చేసుకుంది. అయితే పోస్టర్లు, బోల్డ్ కంటెంట్ తో గత కొంత కాలంగా వార్తల్లో చర్చనీయాంశం అవుతోందీ సినిమా. హీరో డైరక్ట్ విమర్శలకు కౌంటర్ ఇవ్వటంతో జనాల్లో క్యూరియాసిటీ మరింత పెంచేసింది. మరీ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

 

విశ్లేషణ:

రియలిస్టిక్ లైఫ్ ను ప్రతిబింబించే సినిమాలు కొన్నే వస్తుంటాయి. అదే టైంలో ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేస్తాయి కూడా. అర్జున్ రెడ్డి అలాంటి సినిమానే. ప్రేమలో విఫలమై వ్యసనాలకు బానిసయ్యే అంశం దేవదాస్ నుంచి చూస్తూ వస్తున్నదే. కానీ, ఇప్పుడు ఈ చిత్రం మోడ్రన్ యువతకు దగ్గరయ్యే దేవదాస్. ప్రతి మాట కొత్తగా అనిపిస్తుంది. కొత్తదనానికి ఫిదా అయిపోతారు కూడా. అలాగని సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు అస్సలు ఎక్కదనేది ఒప్పుకోవాల్సిన నిజం.

లిప్ లాక్ అంటేనే ఒక రకంగా భావించే మన ప్రేక్షకులు ఈ సినిమాలో ఆ అంశం చాలా కామన్ గా అనిపించటం, పైగా బోల్డ్ కంటెంట్ తో డైలాగులు అంతగా ఎక్కకపోవచ్చు. కానీ, కనెక్ట్ అయితే మాత్రం ఆ మాయలోకి తీసుకెళ్తుందీ చిత్రం. అయితే కథలో ప్రేమ అన్న ఎలిమెంట్ కన్నా కామ అన్న పదమే ఎక్కువగా కనిపిస్తుంది. కనిపించిన ప్రతీసారీ ముద్దు పెట్టుకోవటం, హీరోయిన్ తో లవ్ కన్నా ఫిజికల్ రిలేషన్ మెయిన్ అన్నట్లుగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సెకండాఫ్ లో కూడా కనిపించిన ప్రతీ అమ్మాయితోనూ ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవటం. అయితే ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే యూత్ మాత్రం చిత్రానికి పిచ్చ పిచ్చగా కనెక్ట్ అవుతారు. కానీ, కంటెంట్ మాత్రం చాలా ఫ్రెష్ దే. అయితే అప్పటిదాకా వాస్తవికతకు పెద్దపీట వేసిన దర్శకుడు చివర్లో మాత్రం రెగ్యులర్ సినిమాటిక్ ముగింపునే ఇవ్వటం కాస్త నిరాశపరుస్తుంది.

 


నటీనటుల విషయానికొస్తే... విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలో ఒదిగిపోయాడు. సినిమా అంతటా కూడా అతను అర్జున్ రెడ్డిలా జీవించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కోర్టు సీన్ లో సీన్ ఒక్కటి చాలూ విజయ్ ఆ క్యారెక్టర్ లో ఎంత లీనం అయిపోయాడో చెప్పటానికి. ఇక హీరోయిన్ షాలినిది మాటలు చాలా తక్కువ. అయినా ఎమోషనల్ గా బాగానే చేసింది. వీరి తర్వాత చెప్పుకోవాల్సింది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రామకృష్ణ గురించి.. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెబుతూ.. చాలా సహజంగా నటిస్తూ అదరగొట్టేశాడు రాహుల్. హీరో అన్నయ్య పాత్రలో కమల్ కామరాజు.. తండ్రి పాత్రల్లో సంజయ్ స్వరూప్ కూడా బాగా చేశారు. అలనాటి నటి కాంచన కూడా మంచి రోల్ చేశారు. చిన్న పాత్రలో ప్రియదర్శి కూడా మెప్పించాడు.

సాంకేతిక నిపుణులు విషయానికొస్తే.. రధాన్ మ్యూజిక్.. రాజు తోట ఛాయాగ్రహణం సినిమాలో ఫీల్ ను మరింత పెంచడానికి పనికొచ్చాయి. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రధాన్ తనలోని కొత్త కోణాల్ని ఈ సినిమాతో చూపించాడు. సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో హీరో రోజు రోజుకూ పతనమైపోతున్నపుడు వచ్చే నేపథ్య సంగీతం ప్రత్యేకంగా అనిపిస్తుంది. రాజు ఛాయాగ్రహణం కూడా ఆరంభం నుంచి ఒక ప్రత్యేకమైన మూడ్ క్రియేట్ చేస్తూ సాగింది. డైలాగులు నేచురల్ గా ఉంటాయి. అయితే ఎటొచ్చి సినిమా నిడివి విషయమే అతిపెద్ద కంప్లైంట్. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ చాలా చాలా లెంగ్తీగా ఉండటం మైనస్ అయ్యింది. కానీ, స్టోరీ పరంగా ఇంతకన్నా కాంప్రమైజ్ కాలేనని దర్శకుడు ఓపెన్ గా చెప్పటం చూశాం కూడా. తక్కువ బడ్జెట్లో సినిమాను రిచ్ గా తెరకెక్కించారు నిర్మాతలు.

 

తీర్పు:

ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అర్జున్ రెడ్డి ఎక్కుతుందా? లేదా? అన్నది తేలిపోతుంది. విజయ్ క్యారెక్టర్ కు కనెన్ట్ అయ్యామంటే ఓకే, లేదంటే తేడా కొట్టేస్తుంది. ప్రతి సన్నివేశాన్నీ ఓ ఇంటెన్సిటీతో తీసే ప్రయత్నం చేసిన దర్శకుడు.. ఈ కథకు అత్యంత కీలకమైన ప్రేమకథను సరిగా తీర్చిదిద్దలేకపోయాడు. ప్రేమకు ముఖ్యం శృంగారం అన్న చందాన సినిమా సాగుతుంది. ద్వితీయార్ధమంతా హీరో వ్యసనాల మీదే ఎక్కవగా దృష్టిసారించడంతో బోరింగ్ అనిపిస్తుంది. స్లో నారేషన్, అడల్ట్ కంటెంట్ దృష్ట్యా అర్జున్ రెడ్డి ఎంతమందికి ఎక్కుతుందన్నది అనుమానమే.


చివరగా.. అర్జున్ రెడ్డి... మోడ్రన్ దేవదాసు అందరికీ నచ్చకపోవచ్చు.