శతమానం భవతి మూవీ రివ్యూ | Shatamanam Bhavati movie review

Teluguwishesh శతమానం భవతి శతమానం భవతి Sharwanand's Shatamanam Bhavati movie review. Product #: 80258 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    శతమానం భవతి

  • బ్యానర్  :

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  • దర్శకుడు  :

    సతీష్ విఘ్నేశ్

  • నిర్మాత  :

    దిల్ రాజు

  • సంగీతం  :

    మిక్కీ జే మేయర్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    సమీర్ రెడ్డి

  • నటినటులు  :

    శర్వానంద్, ప్రకాష్ రాజ్; జయసుధ, అనుపమ పరమేశ్వరన్, ఇంద్రజ తదితరులు

Shatamanam Bhavati Movie Review

విడుదల తేది :

2017-01-14

Cinema Story

కథ: 

 

ఆత్రేయపురం అనే ఓ పల్లెటూరిలో రాఘవరాజు (ప్రకాష్ రాజ్) అనే పెద్ద మనిషి తన భార్య జానకి (జయసుధ)తో కలిసి హుందాగా బతుకుతుంటాడు. రాఘవరాజు కుటుంబానికి అన్నీ తానై వ్యవహరిస్తుంటాడు రాజు (శర్వానంద్) అనే యువకుడు. ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్న రాఘవరాజు కుటుంబం.. ఆయన పిల్లలు పెద్దవాళ్లయ్యాక వేర్వేరు కుటుంబాలవుతుంది. విదేశాల్లో స్థిరపడ్డ పిల్లల్ని చూడాలని తన భార్య తపిస్తుండటంతో వాళ్లను రప్పించడానికి ఓ పథకం వేస్తాడు రాఘవరాజు. అది ఫలించి ఆయన పిల్లలు తమ కుటుంబాలతో కలిసి ఇక్కడికి వస్తారు. ఈ క్రమంలో రాజు రాఘవరాజు మనవరాలు అయిన నిత్య (అనుపమ పరమేశ్వరన్)కు దగ్గరవుతాడు. మరి పిల్లల్ని రప్పించడానికి రాఘవరాజు వేసిన పథకమేంటి.. అది తెలిశాక ఆయన భార్య ఎలా స్పందించింది.. మరోవైపు రాజు-నిత్యల ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది అన్నదే కథ. 

cinima-reviews
శతమానం భవతి

సంక్రాంతి పండగకు టాలీవుడ్ లో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు, పైగా ల్యాండ్ మార్క్ వి, రిలీజ్ అయ్యి రెండు బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాయి. అయితే శర్వానంద్ లాంటి హీరోతో ఓ ఫ్యామిలీ డ్రామా, పైగా ఈ పోటీలోనే రిలీజ్ చేయటం, పైగా సంక్రాంతి పండగ వాతావరణం ని గుర్తు చేసేలా తెలుగు కుటుంబాలు, మన ఇప్పటి జీవితాల్లో సమస్యలు అంటూ శతమానం భవతిని థియేటర్లలోకి తెచ్చేశాడు నిర్మాత దిల్ రాజు. మరి ఆ సినిమా నిజంగానే పండగ శోభను తీసుకు వచ్చిందా? రెండేళ్ల దర్శకుడు సతీశ్ నిరీక్షణ ఫలించిందా? చూద్దాం. 

విశ్లేషణ:

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాట సినిమాల విషయానికొచ్చే సరికి ఒక్కోసారి ఫలించోచ్చు. ఒక్కోసారి వికటించొచ్చు. అయితే రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న కి మొదటి దాన్నే అన్వయించొచ్చు. ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన కథనే కొంచెం రీసైకిల్ చేసి ‘శతమానం భవతి’ని తెరకెక్కించాడు. ఇలాంటి కథతో గత కొన్నేళ్లలో చాలా సినిమాలు వచ్చాయి. మురారి, కలిసుందాం రా.., గోవిందుడు అందరివాడేలా.. ఇలా శతమానం అదే కోవలోకి వస్తుంది. ఐతే తెలిసిన కథనే కన్విన్సింగ్ గా.. బోర్ కొట్టించకుండా చెప్పడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ప్రతి ప్రేక్షకుడూ సులభంగా కనెక్టయ్యే నేపథ్యం.. పాత్రలు.. సన్నివేశాలు.. ‘శతమానం భవతి’కి బలంగా నిలిచాయి. పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకోవడం.. ఆద్యంతం తెరను ఆహ్లాదంగా చూపించడంతో ఆరంభం నుంచే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. 

నటీనటుల విషయానికొస్తే... పాత్రలు కూడా సహజంగా ఈజీగా కనెక్టయ్యేలా ఉంటాయి. వాటితో పాటు ప్రేక్షకుల్ని ప్రయాణించేలా చేస్తాయి. ఆయా పాత్రలకు ఎంచుకున్న నటీనటులూ చక్కగా కుదిరారు. హీరోగా శర్వానంద్ ఏ హడావుడి లేకుండా సింపుల్ గా రాజు పాత్రను పండించాడు. అతడి సహజ నటన వల్ల రాజు పాత్రతో చాలా ఈజీగా కనెక్టయిపోతాం. తన తొలి రెండు సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన అనుపమ.. ఈసారి మోడర్న్ అమ్మాయిగానూ ఆకట్టుకుంది. ఆమె డబ్బింగ్ ఎన్నారై అమ్మాయి పాత్రకు సరిపోయింది. గ్లామర్ పరంగా ఆమెకు ఓ మోస్తరు మార్కులే పడతాయి. ప్రకాష్ రాజ్ తక్కువ సన్నివేశాలతోనే మెప్పించాడు. రాఘవరాజు పాత్రలో హుందాగా నటించాడు. క్లైమాక్సులో నటుడిగా తన స్థాయి ఏంటో చూపించాడు. ఇంతకుముందు ఆయన ఇలాంటి పాత్రలు చేసినపుడు కొంచెం అతిగా నటించిన భావన కలిగి ఉండొచ్చేమో కానీ.. రాఘవరాజు పాత్రలో మాత్రం అలాంటిదేమీ కనిపించదు. జయసుధ కూడా పాత్రకు తగ్గట్లుగా నటించింది. బంగర్రాజు పాత్రలో నరేష్ అదరగొట్టాడు. సినిమాలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించేది ఆయన పాత్ర.. మిగతా పాత్రలు తగ్గట్లుగా నటించి మెప్పించారు.

సంగీతం.. ఛాయాగ్రహణం సినిమాకు బలంగా నిలిచాయి. మిక్కీ జే మేయర్ సంగీతం ‘సీతమ్మ వాకిట్లో..’ లాంటి సినిమాల్ని గుర్తుకు తెచ్చినప్పటికీ సినిమాకు సరిపోయింది. మమతలు పంచే ఊరు.. పాట వెంటాడుతుంది. బాలు పాడిన ‘నిలవదే..’ పాట.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే. సమీర్ రెడ్డి కెమెరా పనితనం సినిమాకు కలర్ ఫుల్ లుక్ తీసుకొచ్చింది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా అందంగా చూపించాడు సమీర్. పాటల చిత్రీకరణ చాలా బాగుంది. నిర్మాణ విలువలు దిల్ రాజు బేనర్ స్థాయికి తగ్గట్లే ఉన్నాయి.

 

ఫ్లస్ పాయింట్లు:

– కనెక్ట్ అయ్యే క‌థ‌
- లీడ్ రోల్స్ నటన
– సినిమాటోగ్ర‌ఫీ
– మ్యూజిక్‌
– ఫ‌స్టాఫ్‌

 

మైన‌స్ పాయింట్స్:
– ట్విస్టులు లేని స్క్రీన్ ప్లే
– స్లో సెకండాఫ్‌
– పేల‌ని కామెడీ

 

తీర్పు:

పాత కథనే ఎంచుకున్నప్పటికీ మంచి సన్నివేశాలు రాసుకోవడం.. స్క్రిప్టులో ఉన్నదాన్ని తడబాటు లేకుండా.. ప్రభావవంతంగా తెరకెక్కించడం ద్వారా సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దాడు. ద్వితీయార్ధంలో అతను కొంచెం రిలాక్స్ అయ్యాడు. రాజీ పడ్డాడు. ఓవరాల్ గా సతీష్ దర్శకుడిగా విజయవంతమయ్యాడు. నిజ జీవితంలో కనుమరుగైపోతున్న అనుబంధాలను, ఆత్మీయతలను తెరపై చూసి ఆనందించాలనే ఆంకాంక్షకు ఇవి ప్రాణం పోస్తాయి.  యువత కి ఏ స్దాయిలో నచ్చుతుంది అనే విషయమై విజయం స్దాయి ఆధారపడి ఉంటుంది.

 

చివరగా... పాతదే కానీ సకుటుంబ సమేతంగా చూడదగిన సినిమా. 

 

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.