మెగాస్టార్ చిరంజీవి... ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. టాలీవుడ్ చరిత్రలో మూసధోరణిలో, ఒకే పంథాలో వెళ్లిపోతున్న ట్రెండ్ కి ఒక్కసారిగా బ్రేకులు వేసేశాడు. తన స్టైలిష్ స్టెప్పులతో, యాక్టింగ్ తో సరికొత్త భాష్యం చెప్పాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న ఒక్క పదం చాలూ చిరు గురించి విపులంగా చెప్పాలంటే. సినీ జీవితానికి 'పునాది రాళ్లు' వేసుకుని అంచెలంచెలుగా అగ్రనటుడు, ఆపై నంబర్ వన్ పొజిషన్ కు చేరి మకుటం లేని మెగాస్టార్ గా చెలామణి అయ్యాడు. ఖైదీతో అభిమానులను తన బంధీలుగా చేసుకుని రెండున్నర దశాబ్దాలుగా సిసలైన కమర్షియల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు చూపించాడు. దశాబ్దం తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని అభిమానుల కోసం రాబోతున్నాడు. మరి ఈ సందర్భంగా బాస్ ఈజ్ బ్యాక్ పై ఓ ప్రత్యేక కథనం...
కమర్షియల్ కింగ్...
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వీళ్లు ఒక తరం. కానీ, తర్వాత వచ్చిన శివశంకర వరప్రసాద్ అకా చిరంజీవి ఇంకో తరం కాదు నాలుగో స్థంభం అని గుర్తించేందుకు తెలుగు కళామ్మ తల్లికి ఎంతో టైం పట్టలేదు. టాలెంట్ తో తొలినాళ్లలోనే పలువురు అగ్రనటులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అలాగని ఈ స్టార్ డమ్ ఒక్కరోజులో వచ్చింది కాదు. దాని వెనక 'స్వయం కృషి' చాలానే ఉంది. కెరీర్ దాన్ని 'ఛాలెంజ్'గా తీసుకుని మరీ ఈ స్థాయికి వచ్చాడు. కమర్షియల్ సినిమాలకు మరింత తన మా(బా)స్ యిజంతో కమర్షియాలిటీ రంగులను అద్దటంలో అందెవేసిన చేయి ఈ ‘చంటబ్బాయి’ది.
రఫ్ఫాడించే క్రేజ్..
చిరంజీవి సినిమాలంటే యాక్షన్‌కు పెట్టింది పేరు. ఆయనకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించినవి కూడా యాక్షన్ సినిమాలే. 90లో చిరు అందించిన సినిమాలకు దెబ్బకి బాక్సాఫీస్ బాక్స్ లు బద్ధలైపోయేవి. ఒక రకంగా టాలీవుడ్ రికార్డులు మొదలైంది చిరుతోనే అంటే అతిశయోక్తి కాదు. కొదమ సింహం, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ బాస్ మాస్ ఇమేజ్ కు మచ్చుతునకలు. ఇక చిరు డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రేక్ గానీ, షేక్ గానీ రఫ్పాడించేవాడు. అత్యధిక పారితోషకం అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు. అంతే ఆ దెబ్బకి ఒక్క తెలుగు గడ్డపైనే కాదు, సౌత్, బాలీవుడ్ లో కూడా ఫ్రెండ్స్ , ఫ్యాన్స్ తయారయ్యారు. స్టార్ వారసత్వంకి మాత్రమే అంతా గుర్తింపు ఉండే ఆ రోజుల్లో ఆయన సత్తా మొత్తం దేశం పాకిపోయింది.
చిరంజీవి సరసన నటించేందుకు కథానాయికలు క్యూ కట్టేవారు. కొందరైతే డబుల్ డిజిట్ సినిమాలను చిరుతో చేశారు. అయినా జనాలకు ఏ మాత్రం బోర్ కొట్టేది కాదు. కథానాయకుడిగా రాణిస్తూనే చిరంజీవి అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేశారు. డబుల్ రోల్ లోనే కాదు, ముగ్గురు మొనగాళ్లులో (ట్రిపుల్ రోల్) త్రిపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. రుద్రవీణ, ఆపద్భాందవుడు కమర్షియల్ సక్సెస్ లు కావు. అయినా అవి జనాల్లో చెరగని ముద్రవేశాయి.
చిరు అన్న పేరు వింటే చాలూ అవార్డులు ఆటోమేటిక్ ఆయన ఇంటికి క్యూ కడతాయ్.. బెస్ట్ యాక్టర్‌గా రికార్డు స్థాయిలో ఏడు ఫిలింఫేర్లు.. మూడు నందులు తన వైవిధ్యమైన నటనతో విమర్శకులను సైతం మెప్పించి అవార్డులు సొంతం చేసుకున్నారు చిరంజీవి. 1987లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'స్వయంకృషి' చిత్రానికి ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆపద్బాంధవుడు, ఇంద్ర చిత్రాలకు అందుకోగా రుద్రవీణకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఇక తొలిసారి శుభలేఖ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకోగా, విజేత, ఆపద్బాంధవుడు, ముఠామేస్త్రీ, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు ఉత్తమ తెలుగు నటుడిగా ఫిలింఫేర్ లభించింది. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ కూడా చిరంజీవి అందుకున్నారు.
మ్యాజిక్ ఫిగర్లు...
చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాదిరాళ్లు' అయినా తొలిసారి వెండితెరపై కన్పించిన చిత్రం 'ప్రాణం ఖరీదు'. చిరంజీవి నటించిన ఐదు సినిమాల తర్వాత పునాదిరాళ్లు విడుదల కావటం విశేషం. ఆడవాళ్లు మీకు జోహార్లు(25వచిత్రం), బంధాలు అనుబంధాలు(50వ చిత్రం), చట్టంతో పోరాటం(75వచిత్రం), త్రినేత్రుడు (100వ చిత్రం), ద జెంటిల్మెన్(125వ చిత్రం:హిందీ). 149 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన చిరు తన సినీ కెరీర్లో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ఇక ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఖైదీ నంబర్ 150తో 150వ చిత్రంతో సందడి చేయనున్నాడు.
150 చాలా హాట్ గురూ...
ముప్పై ఏళ్ల కెరీర్ లో అలుపెరగని నటనతో అలసిపోయిన ఈ చిరంజీవుడు ఒక్కసారిగా రాజకీయాలకు మళ్లాడు. మళ్లీ దాదాపు పదేళ్లకు రీఎంట్రీ ఇస్తున్నాడు. సినీ రంగాన్ని వదిలి ఎనిమిదేళ్లయినా నెంబర్ 1 స్థానం అలానే ఖాళీగా వుంది. ఛాన్స్ దొరికినా చాలా మంది తారలు ఆ స్థానం పై కూర్చోలేదు. ఎవరోచ్చినా అది చిరంజీవిదే ఇది వారి నోటి నుంచి వచ్చిన మాట. ఈ మాట చాలదా చిరు గురించి ఎంత చెప్పుకున్నా ఎంత తక్కవే అని. పొలిటికల్ పాటలు అంతగా వంటపట్టలేదు దీంతో మళ్లీ అభిమానులను రంజింపజేయాలనుకున్నాడు. అన్నయ్య మళ్లీ మేకప్ అనగానే అంతా ఎగిరి గంతేశారు. మరి ఎలాంటి కథను ఎంచుకోవాలి? మైలురాయిగా నిలిచిపోయే సినిమా ఏది కాబోతుంది. అంతే ఒక్కటే డిస్కషన్. పైగా మగధీర, బ్రూస్ లీలో రోల్స్ చేశాడు కదా సో.. ఇది 150 ఎలా అవుతుందని కొందరు అంటే... అవి గెస్ట్ రోల్స్ మాత్రమే కాబట్టి అఫ్లై కావు అంటూ నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక అప్పటి నుంచి చిరు 150వ చిత్రం కోసం అన్వేషణ జరుగుతోంది.
కత్తి రీమేకే ఎందుకు?
ఎలాంటి సినిమా ఎంచుకుంటాడు ఒకటే టెన్షన్. ఇంతలో కొందరి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఎవరైనా సరే స్టార్ దర్శకుడు అయితే చాలూ ఇది అందరి అభిప్రాయం.. అభిమతం కూడా. అంతే ఒక్కసారిగా పూరీ జగన్నాథ్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆటో జానీ అంటూ టైటిల్ కూడా అనౌన్స్ ఓ మంచి మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేశానని చెప్పుకొచ్చాడు. ప్చ్.. కానీ పూరీ బ్యాడ్ లక్. వచ్చినట్లే వచ్చి అవకాశం చేజారి పోయింది. ఇక చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యలవాడ నరసింహరెడ్డి గురించి డిస్కషన్ మొదలైంది. ఆరు నెలల తర్జన భర్జన చివరకి ఓ ప్రాజెక్టును ఓకే చేశారు. అదే తమిళ్ లో విజయ్ రీమేక్ గా వచ్చిన కత్తి.
చిరు మాటల్లో...
నా అభిమానులు నా 150 వ చిత్రంపై ఎంతగా దృష్టి పెట్టారో నాకు తెలుసు. సరిగ్గా అలాంటి సినిమా కోసం అలానే ఎదురు చూశా. మంచికథ ఇప్పుడు కుదిరింది. ఈ సినిమా ప్రత్యేకంగా ఉండాలని తాను భావిస్తున్నాననీ ... అందువల్ల ఆ స్థాయి కథా బలం అవసరమని నిర్ణయించుకున్నా. రైతన్న సమస్యలకు తర్పణం పట్టిన కత్తి రీమేక్ ను నా కరెక్ట్ ఛాయిస్ అనుకుంటున్నా. సినిమా చూశాక ప్రేక్షకులు అంగీకరిస్తారు కూడా.
షూటింగ్ ప్రోగ్రెస్...
తమిళ్ లో అప్పటికే రిలీజ్ వందకోట్లు వసూల్ చేసిన ఆ సినిమాను లైకా వాళ్లు తెలుగులోనూ డబ్ కూడా చేసేశారు. ఇంకా మిగిలింది రిలీజే. కానీ, చరణ్ ఒక్కసారిగా సీన్ లోకి ఎంటర్ అయిపోయాడు. రిలీజ్ ను ఆపేశాడు. పెద్ద మొత్తంలో చెల్లించి రైట్స్ కొనేశాడు. వెంటనే ఠాగూర్ తో చిరుకు బిగ్ హిట్ ఇచ్చిన వినాయక్ ను రంగంలోకి దించేశారు. మెగా వారసుడు, లియో కలిసి సినిమాను తెరకెక్కించబోతున్నారన్న అఫీషియల్ ప్రకటన వెలువడింది. చక చకా స్క్రిప్ట్ పనులు జరిగిపోయాయి. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు జూన్ 23న తొలిరోజు షూటింగ్ జరిగింది. మెగా అభిమానుల కలలు ఫలించాయి. తమ అభిమాన హీరో ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది. మళ్లీ మేకప్ వేసుకుని. మునుపటి రూపు.. అదే తేజస్సు...
అయితే ఆయన నటనలో ఎలాంటి మార్పు లేదని చిత్ర బృందం చెబుతోంది. ఇది చాలదన్నట్లు మెరుపులు మొదలయ్యాయ్. రేసులోకి దూసుకొస్తున్నా.. నా సత్తా చూస్తారా? అంటూ సిగ్నల్స్ ఇచ్చేశారు మెగా బాస్. మా అవార్డు వేడుకల్లో మెగాస్టార్ మెరుపులు మెరిపించారు. డ్యాన్సులతో హోరెత్తించేశారు. ముఠామేస్ర్తిగా, గ్యాంగ్ లీడర్‌గా, ఇంద్రగా చిరు లుక్ ఇప్పుడైతే ఎలా ఉంటుందో డిస్ప్లే చేశారు. ఈ డిస్ప్లే సారంశం ఏమంటే.. మెగాస్టార్లో ఏమాత్రం జోష్ తగ్గలేదు. ఇప్పటికీ అదే జోష్.. అని సంకేతాలు పంపాడు.
టైటిల్.. ఫస్ట్ లుక్ ...
టైటిల్ విషయంలో మొదటి నుంచి అభిమానులు కత్తిలాంటోడు అని డిసైడ్ అయిపోయారు. అయితే అగష్టు 20న చెర్రీ మాత్రం ఖైదీ నంబర్ 150 అని అనౌన్స్ చేశాడు. ఆ విషయంలో అభిమానులే కాదు. దర్శకుడు వినాయక్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడని చెప్పుకున్నప్పటికీ తర్వాత అంతా అలవాటు అయిపోయారు. ఇక చిరు బర్త్ సందర్భంగా ఓ చిన్న టీజర్ తోపాటు ఫస్ట్ లుక్ వచ్చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అన్న ట్యాగ్ లైన్ సరిగ్గా సరిపోయింది. వెనక నుంచి చూపించార్న ఒక్క అసంతృప్తి మాత్రమే. రెండు లుక్స్ తో కూడిన పోస్టర్ లను రిలీజ్ చేసేశాడు. ఒక పోస్టర్ లో చిరును వెనుక నుంచి చూపించగా, మరో దాంట్లో సీరియస్ గా చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని ఉన్న మెగాస్టార్ ను చూడొచ్చు. అలాగే రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్స్ వారి లోగో డిజైన్ కూడా అదిరిపోయింది.
ఇక మోస్టర్ పోస్టర్ లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కత్తిలా ఉందంతే. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సాగే థీమ్ లో ''ఖైదీ నెం వన ఫైవ్ జీరో.. అరె వచ్చేశాడు మనకోసం మన ఎవర్ గ్రీన్ హీరో'' అంటూ అనే బ్యాగ్రౌండ్ సాంగ్ కంపోజ్ చేసిచ్చాడు. మొత్తంగా ఈ లుక్ అదిరిపోయిందంతే. ఖైదీ సిరీస్ తో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వటమే కాదు, హ్యాట్రిక్ కొట్టేందుకు మన మెగాస్టార్ సిద్ధమైపోతున్నాడనే అప్పుడే అభిమానులు డిసైడ్ అయిపోయారు.
ఐటెం సాంగ్...
నిజానికి ఖైదీ హీరోయిన్ ఎంపిక కన్నా ఐటెం సాంగ్ లో యాక్ట్ చేయబోయే హీరోయిన్ గురించే ఎక్కువ వార్తలు వచ్చాయి. ముందుగా కేథరిన్ థ్రెసా ను అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆ అదృష్టం రాయ్ లక్ష్మీని వరించింది. హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్ లో లారెన్స్ ఆ పాటకు స్టెప్పులు సమకూర్చాడు. స్పెషల్ సాంగ్ ‘రతాలు.. రతాలు’ షూటింగ్ ముగిసింది. చాలా హ్యాపీగా వుంది. , ఈ చిత్రం కోసం అందరి అభిమానుల్లాగే తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని ఫోటోలో పోస్ట్ చేశాడు.
హీరోయిన్ గా చందమామ...
ఖైదీ కున్న మరో ప్రత్యేకత ఏంటంటే... అల్రెడీ 50 శాతం షూటింగ్ అయ్యాక హీరోయిన్ ను తీసుకోవటం. నిజానికి కాజల్ హీరోయిన్ అని ముందు నుంచి అనుకున్నప్పటికీ విషయాన్ని గోప్యంగా ఉంచింది చిత్ర యూనిట్. సగం షూటింగ్ అయ్యాక కాజల్ షూటింగ్ లో జాయిన్ కావటం, ఆ లుక్స్ బయటకు రావటంతో ఆమె హీరోయిన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే బాబాయ్, అబ్బాయి లతోపాటు అల్లువారబ్బాయి అల్లు అర్జున్ తోకూడా కాజల్ నటించటం, ఇప్పుడు చిరు తో రొమాన్స్ అనగానే కాస్త ప్రతికూల కామెంట్లు వినిపించాయి. అయినప్పటికీ తర్వాత అవన్నీ ఫటాపంచల్ అయిపోయాయి.
దీపావళి పోస్టర్ల రచ్చ...
మెగాస్టార్ దీపావళి కానుక పేలిపోయింది. అక్టోబర్ 29న రిలీజ్ చేసిన పోస్టర్లు క్షణాల్లో తెగ వైరల్ అయ్యాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మురిసిపోతున్న అభిమానులను వాటిని చూసి పండగ చేసుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లలో చిరును మొత్తం చూపించకుండా, కేవలం షాడోస్ తో సరిపెట్టిన చిత్ర యూనిట్ దీపావళికి మాత్రం మంచి గిప్టే ఇచ్చింది. రఫ్ డ్రెస్సింగ్ తో మాస్ అండ్ క్లాస్ ను ఆకట్టుకునే అవతారంలో ఉన్న ఈ గ్యాంగ్ లీడర్ స్టెప్పుతో కూడిన ఓ పోస్టర్, చేతులు పైకి మలుస్తూ నల్ల కళ్ల జోడుతో ఉన్న మరో పోస్టర్ అదిరిపోయాయంతే...
టీజర్ ప్రభంజనం...
టీజర్ వదిలే సరిగ్గా వారం ముందు రెండు కొత్త పోస్టర్లను వదిలాడు చెర్రీ. ఒకదాంట్లో స్థంభం వెనకాల నుంచి ఓర చూపులు చూస్తున్న చిరు అచ్చం పాత సినిమాలకు గుర్తు చేశాడు. ఇక మరో పోస్టర్ లో దర్శకుడు వినాయక్ చిరు,కాజల్, అలీలకు ఏదో వివరిస్తున్నట్లు అందులో ఉంది. అప్పటి నుంచి టీజర్ కోసం మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూడసాగారు. ఇవి చాలవన్నట్లు ధృవ ప్రీ రిలీజ్ పంక్షన్ లో నిర్మాత చెర్రీకే తెలీకుండా మామయ్య అల్లు అరవింద్ చిరు యాక్షన్ మోడ్ లో ఉన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేసే పెద్ద సర్ ప్రైజే ఇచ్చాడు.
అనుకున్న టైం రానే వచ్చింది. డిసెంబర్ 8 సాయంత్రం ఆరు గంటలకు చెప్పటినట్లుగానే టీజర్ ను వదిలాడు చెర్రీ. తెలుగు సినీ వినాలాకాశంలో మహారాజుగా వెలుగోందుతున్న మెగా స్టార్ చిరంజీవి.. గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన టీజర్ అది. ఓపెనింగ్ షాట్ లోనే తన లోని నూతనోత్తేజాన్ని చూపించే విధంగా ఫైట్ షాట్లతో మొదలైంది. ఇక ఎప్పుడెప్పుడా అంటూ చిరు అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆయన నోటి వెంట వెలువడిన డైలాగుల అంబారన్ని అంటేలా చేశాయి.
ఏదైనా తనకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా అంటూ సాగిన చిరు చిత్రంలోని తొలిపలుకులు అభిమానులను ఫుల్ జోష్ లోకి పంపాయి. ఏ స్వీట్ వార్నింగ్ అంటూ టీజర్ లోని పంచ్ కు విజిల్స్ పడ్డాయి. చిరు డ్రెస్సింగ్ దగ్గరి నుంచి మేకింగ్ దాకా అంత స్టైలిష్ గా ఉంది. దేవీ అందించిన గ్రాండ్ బ్యాగ్రౌండ్ ఆకట్టుకుంది. రిచ్ గా తెరకెక్కిన విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ విషయంలో ఎక్కడా చెర్రీ కాంప్రమైజ్ కాలేదనే అనుకోవచ్చు. ఆరున్నర మిలియన్ వ్యూవ్స్ తో ఇప్పటికీ ట్రెండింగ్ గానే ఉంది ఖైదీ టీజర్.
అమ్మడు తెగ కుమ్ముడు...
విజయవాడ వేదికగా ఆడియో వేడుక నిర్వహించనున్నట్లు అనధికారికంగా ప్రకటించినప్పటికీ, తర్వాత ఎందుకనో దానిని రద్దు చేసేశారు. మెగా సెంటిమెంట్ ను ఫాలో అవుతూ నేరుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయాలని డిసైడ్ కావటంతో పాటలను నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేసేశారు.
డిసెంబర్ 18 సాయంత్రం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేశారు. అంతే దెబ్బకి యూ ట్యూబ్ రికార్డులు గల్లంతయ్యాయి. ఒక పాట యూట్యూబ్ లో కుమ్మేయటం ఇదే ఫస్ట్ టైం అంటూ పాటను రిలీజ్ చేసిన లహరి మ్యూజిక్ సంస్థ చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్షరాల 6.6 మిలియన్ వ్యూవ్స్ తో దూసుకుపోతుంది. క్యాచీ లిరిక్స్, అందుకు తగ్గట్లు డీఎస్పీ ట్యూబ్ అబ్బో.. మొత్తం మీద పాటతో చిరు మాంచి కిక్కు అందించాడు. ఇక విజువల్ గా కూడా మేకింగ్ వీడియోను విడుదల చేయగా, దానికి అదే స్థాయిలో వ్యూవ్స్ వచ్చాయి. శేఖర్ మాస్టర్ స్టైలిష్ స్టెప్పులు, పూల చొక్కాలో చిరు, పక్కన సెక్సీ అవతారంలో కాజల్ స్టేజీ దున్నేసినట్లు అర్థమైపోతుంది.
సుందరి తో రొమాన్స్...
కుమ్ముడు పూర్తిగా కాకముందే మరోపాట. ఈసారి మెగాస్టార్ లోని రొమాంటిక్ యాంగిల్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించే పోస్టర్. అది చూసి చిరుకి 61 అంటే ఎవరైనా భ్రమ పడాల్సిందే. సుందరి అంటూ సాగే పాటను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు అన్నట్లుగానే డిసెంబర్ 24 సాయంత్రం సుందరి సాంగ్ రిలీజ్ అయ్యింది. జస్ ప్రీత్ పాడిన పాట కాజల్ వెంటపడుతూ పాడే సాంగ్. స్లోవేనియాలోని అందమైన లొకేషన్లలో సుందరిని తలుచుకుంటూ పాడే విరహా గీతం. మూడు మిలియన్ల మంది ఇప్పటికే పాటపై ఎగబడిపోగా, మరికొందరు అదే పనిలో ఉన్నారు. ఇక ఈ రోజు మరో పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోతుంది ఖైదీ యూనిట్..
క్రేజ్ ఎందుకంటే... ?
అయితే రీమేక్ ఎంచుకోవటం దగ్గరి నుంచి, టైటిల్, కాస్టింగ్ ఇలా ప్రతీ విషయంలోనూ తొలుత విమర్శలు వినిపించాయి. అభిమానులు వద్దనుకుంటున్న చిరు బలవంతంగా చేస్తున్నాడంటూ కొందరు విమర్శించారు. వర్మ లాంటి వాళ్లైతే చిరు చారిత్రక తప్పు చేస్తున్నారంటూ కామెంట్లు కూడా చేశాడు. బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా లేని పోని వార్తలు వినిపించాయి. చిరుకు అసలు అంత సీన్ ఉందా? అన్న వాదనలు రేకెత్తాయి. సుమారు 100 కోట్ల(అన్ని రైట్స్ కలుపుకుని) దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఆ అనుమానాలను చెరిపేసింది చిరు అనే ట్రేడ్ మార్క్. అందుకే ప్రమోషన్ కూడా అదే స్థాయిలో ఉంది.
అన్నయ్య రీఎంట్రీపై అభిమానులు ఎంత ఆత్రుతతో ఉన్నారో, యావత్ తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. టీజర్లు, లుక్కులతో రికార్డులు షేక్ అవుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు చిరు ఇప్పటికీ మోస్ట్ ఎంటర్ టైనింగ్ స్టార్ అని. మరోవైపు మరుపురాని గుర్తుగా మిగిల్చేందుకు 150 పేరిట ఓ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారంట. యాక్షన్ సీన్లు.. డ్యాన్సులతో కూడిన ఈ పుస్తకంలో టెక్నిషియన్ల అనుభవాలను కూడా చేర్చనున్నారంట. ఇప్పటికే ప్రింటింగ్ దశలో ఉన్న ఈ పుస్తకం ప్రీ రిలీజ్ పంక్షన్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది ఖైదీ టీం. పుస్తకం రిలీజ్ అయితే మాత్రం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించటం మాత్రం ఖాయం.
ఇక జనవరి 4న మెగా ఈవెంట్ జరగబోతుంది. టోటల్ మెగా ఫ్యామిలీ సమక్షంలో ప్రీ రిలీజ్ పంక్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి. యువ హీరోలు రానా, నవదీప్ లు యాంకర్లుగా మారి చిరు పలుకులు పలకబోతున్నారు. పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి హీరోగా వస్తున్నది మాములు వ్యక్తి కాదు కదా! అందుకే చెర్రీ బారీ ఎత్తున్న ఏర్పాట్లు చేయబోతున్నాడు..
ఇప్పటిదాకా బయటకు వచ్చిన అంత పరిణామాలను పరిశీలిస్తే ఓ విషయం అర్థం అవుతుంది. మాస్లో ఎప్పటికీ బాస్ ఆయనే.. అందుకు అవసరమైన స్ర్కిప్టు, సరంజామా సంసిద్ధంగా ఉంది. ఇక కామెడీలో కింగ్ అని ప్రూవ్ చేసేందుకు కామెడీ సీన్స్‌కి కొదవే ఉండదు. ఇక ల్యాండ్‌మార్క్ స్టెప్పుల్లో గ్యాంగ్ లీడర్ని, ముఠామేస్ర్తిని మరపిస్తారు. ఇక మరోవైపు తన స్థాయికి తగ్గట్టు ఓ సందేశం కూడా ఉండి తీరాలి. ఇంద్ర రేంజులో ఉపయుక్తమైన మెసేజ్‌ని డీల్ చేస్తున్నాడు.. ఓవరాల్ గా చిరంజీవి అంటే ఇదిరా అనే స్థాయిలో సినిమా ఉండబోతుందని ఘంటా పథంగా చెప్పేశాడు చిరు. ఇక మిగిలింది సంక్రాంతి మెగా మెరుపులు సిల్వర్ స్క్రీన్ మీదే...
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more