ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త సూర్యకాంతం | Actress Suryakantham birthday special

Suryakantham birthday special

Birthday Special Story On Actress Suryakantham, Mahanati Suryakantham, Suryakantham birthday special, Versatile actress suryakantham, Special Story On Actress Suryakantham

Birthday Special Story On Actress Suryakantham.

ఆంధ్రుల అభిమాన అత్త

Posted: 10/28/2016 11:34 AM IST
Suryakantham birthday special

తెలుగు కోడళ్ళు ఆమె పేరు వింటేనే హడలెత్తిపోతారు. ఆ పేరుతో ఎవరిని పిలిచినా గయ్యాళితనం ధ్వనించినట్లుగా చూస్తారు. తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు 'సూర్య కాంతం'. ప్రత్యేకంగా హాస్యాన్ని ఆమె పలికించికపోయినా సంభాషణలు చెప్పే తీరు హాస్యాన్ని కలిగించి ఆ సన్నివేశానికి నిండుదనం తెస్తాయి. హాస్య సన్నివేశాల్లో ఆమె ఎంతగా హాస్యాన్ని పండించేదో, అత్త పాత్రల సమయంలో అంతగా కాఠిన్యాన్ని పాత్రల్లో చూపించేది. సినిమాల్లో ఎంతో గయ్యాళిగా కనిపించే ఆవిడ బయట మృదుస్వభావి, మంచి మనిషిగా పేరుపొందారు. ఎందరికో ఆర్థిక సాయం చేశారు. అలాగని అపాత్రదానం మాత్రం చేసేవారు కాదు. ఆమెను అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు. సినిమాల్లోని ఆవిడ పాత్రను చూసి సినిమా ప్రేక్షకులు ఎంతగా ద్వేషిస్తారో, ఆవిడ మంచితనం చూసి అంతగా అభిమానిస్తారు కూడా. ఈ రోజు ఆమె జయంతి ఈ సందర్భంగా ఆమెను మననం చేసుకుంటూ ఓ ప్రత్యేక కథనం...

1924వ సంవత్సరం అక్టోబరులో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోని వెంకటకృష్ణరాయపురంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో 14వ సంతానంగా జన్మించారు సూర్యకాంతం. సినిమాల్లో నటించాలన్న కోరికతో చెన్నై వచ్చారు. ఆ తర్వాత జెమినీ స్టూడియోవారి చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్‌గా నటించారు. ఆ తర్వాత ధర్మాంగద, నారద నారది, గృహప్రవేశం మరికొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. అయితే ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా అనుకోకుండా జరిగిన ఓ కారు ప్రమాదం వల్ల ఆమెకు ఆ అవకాశం చేజారిపోయింది. కొంతకాలం తర్వాత ఆవిడ 'సంసారం' చిత్రం ద్వారా గయ్యాళిపాత్ర ద్వారా పరిచయం అయ్యారు. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకురావడంతో క్రమంగా గయ్యాళి పాత్రలకు పేరుపడింది.

అదిఎంతగా అంటే బయట ఎవరికైనా అత్తగారు కొంచెం గయ్యాళిగా ఉంటే ఆమెను సూర్యకాంతంతో పోల్చేటంతగా. ఓ సందర్భంలో గుమ్మడిగారు ఆవిడతో 'సినిమాల్లో నీ పాత్రలకు న్యాయం చేసినా, ఆంధ్రదేశానికి నీ వల్ల ఒక అన్యాయం జరిగి పోయింది. సూర్యకాంతం వంటి చక్కని పేరును ఎవరు పెట్టుకోకుండా చేశావు' అని నవ్వుతూ చమత్కరించారట. హస్యనటశిరోమణిగా, రంగస్థల శిరోమణి ఇలా ఎన్నో బిరుదులు, అవార్డులు అందుకున్నారామె. 1950 లో హైకోర్టు జడ్జి అయిన పెద్దిభోట్ల చలపతిరావును ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె తన నటన జీవితాన్ని కొనసాగించారు.

గయ్యాళి అత్త పాత్రలో ప్రారంభమైన ఆవిడ విజయపరంపర మరణించేవరకు సాగిందని చెప్పొచ్చు. ఆవిడ కేవలం గయ్యాళి పాత్రే కాకుండా తల్లిగా ఉదాత్తమైన పాత్రలు, ఆనాటి రేలంగి, రమణారెడ్డి వంటి హాస్యనటుల సరసన, ఎస్‌.వి.రంగారావు, గుమ్మడి వంటి నటుల సరసన కూడా నటించి ఆయా పాత్రలకనుగుణంగా నటనను ప్రదర్శించింది. షూటింగ్ జరిగే సమయంలో ఆవిడ చేతి వంటను రుచిచూడని ఆనాటి నటీనటులు లేరంటే అతిశయోక్తికాదేమో. ఈ సంఘటనను కూడా ఎంతో ఆప్యాయంగా చెప్పుకుంటారు సినీ పెద్దలు. సూర్యకాంతం మనుషులను ఎలా నమ్మేవారో, ఆమె మనసు ఎంత సున్నితమైందో చెప్పే విషయాన్ని రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది. సూర్యకాంతం కు పిల్లలు లేరు. చివరి రోజుల్లో తన ఆస్తి మొత్తం తన సోదరులకు చెందే విధంగా వీలునామా రాయమని ఆమె తరపు న్యాయవాదిని కోరారు. కానీ, ఆ లాయర్ ఆమెను దారుణంగా మోసం చేశాడు. వీలునామా తన పేరు మీదే రాసేసుకున్నాడు. ఈ విషయం చివరి వరకు సూర్యకాంతంకు తెలియదు. ఆమె మరణం తరువాత సూర్యకాంతం సోదరునికి ఈ విషయం తెలిసి ఆయన కూడా గుండెపోటుతో మరణించాడంట.

దొంగరాముడు, లవకుశ, చక్రపాణి, చిరంజీవులు, గుడిగంటలు, కులగోత్రాలు, మూగమనసులు, దాగుడుమూతలు, ఇల్లరికం, భార్యాభర్తలు.కన్యాశుల్కం, భాగ్యరేఖ, చరణదాసి, తోడికోడళ్ళు, మాయాజజార్‌, అప్పుచేసిపప్పుకూడు, మాంగల్యబలం, జయభేరి, శాంతినివాసం, ఇద్దరు మిత్రులు, ఉమ్మడికుటుంబం, వెలుగునీడలు, కలసిఉంటే కలదుసుఖం, మంచిమనసులు, రక్తసంబంధం, సిరిసంపదలు, డాక్టర్‌ చక్రవర్తి, మురళీకృష్ణ, చదువుకున్న అమ్మాయిలు, సంగీతలక్ష్మి, బ్రహ్మచారి, బుద్ధిమంతుడు, ఆత్మీయులు, అందాలరాముడు, ముత్యాల ముగ్గు, రాధాకృష్ణ, సెక్రటరీ, పెళ్ళిచూపులు, వన్‌ బై టు, బుజ్జిబాబు, యమగోల, హై హై నాయకా, గోవిందా గోవిందా వంటి చిత్రాలు ఆమె అద్బుత నటనకు కొన్ని ఆనవాళ్ళు మాత్రమే.

ఇక ఆవిడ నటించిన చివరి చిత్రం ఎస్పీ పరుశరాం. 1994వ సంవత్సరం డిసెంబర్‌ 18న ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కొందరు లేని లోటును ఎవరూ పూడ్చలేరు. అలాంటి వారు అరుదుగా ఉంటారు. అటువంటి కోవలోకి వచ్చి తెలుగు వారి అభిమానాన్ని చురగొన్న వ్యక్తిగా సూర్యకాంతంగారిని చెప్పుకొవచ్చు.  ఓ చెరగని ముద్ర వేసిన ఆమె ఆత్మకు ఎల్లప్పుడూ శాంతి కలగాలని కోరుకుంటూ తెలుగు విశేష్ తరపున ఆమెకు నమ:సుమాంజలులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles