Gurram jashuva or g joshua was a telugu poet special story

gurram jashuva, gurram jashuva 120th birth anniversary, Gurram Jashuva Gabbilam, Gurram Jashuva biography

Gurram Jashuva (or G Joshua) was a Telugu poet. He was recognized with awards by Government of India. His literature's impact on the society was studied by researchers. Literary awards were instituted in his memory.

తెలుగు సాహిత్య ప్రపంచానికి కొత్త అర్ధాన్ని ఇచ్చిన ఆధునిక కవి జాషువా

Posted: 12/16/2014 10:30 AM IST
Gurram jashuva or g joshua was a telugu poet special story

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

జాషువా 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించాడు.యాదవతల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ, ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు..

అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లోమేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసురేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.

చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్దమేఘసందేశం,రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:

గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.

1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.

జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ , ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తుచరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

జాషువా రచనల్లో కొన్ని:
స్వప్న కథ, అనాధ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం. అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, స్మశానవాటిక, ఆంధ్ర భోజుడు, గబ్బిలము, కాందిశీకుడు, తెరచాటు, చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, కొత్తలోకం మొదలగు రచనలను జాషువా గావించాడు.

జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా పరమపదించాడు. కాని ఇప్పటికి తన రచనల ద్వారా సాహిత్య ప్రియుల హృదయాల్లో కొలువు తీరాడు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles