Supreme Court Former Judges ’Broken and Disappointed' ప్రమాదకరం ఈ పరిణామం.. న్యాయవ్యవస్థపై ప్రభావం..

Supreme court judges press meet

Supreme Court, Chief Justice of India, Deepak Misra, Senior Judges, Chelameswar, Press Meet, Congress Party

Four sitting judges of the Supreme Court held an unprecedented press conference over allocation of cases in the top judiciary.

ప్రమాదకరం ఈ పరిణామం.. న్యాయవ్యవస్థపై ప్రభావం

Posted: 01/12/2018 05:09 PM IST
Supreme court judges press meet

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పరిస్థితి సజావుగా లేదంటూ, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వ‌హించి మ‌రీ చెప్ప‌డం అల‌జ‌డి రేపుతోంది. ఢిల్లీలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో నలుగురు సీనియర్ జడ్జిలు సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉన్నారు. మీడియా సమావేశంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడారు.

గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు వ్యవస్థ సరిగా నడవడం లేదన్నారు. సుప్రీంకోర్టును సరిగా నడిపించే విషయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను ఒప్పించడంలో విఫలమయ్యామని, గత్యంతరం లేకే మీడియా ముందుకు వచ్చామని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సరిగా నడిపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరమన్నారు. జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలా? లేదా? అన్నది దేశ ప్రజలే నిర్ణయించాలని అన్నారు.

ఈ విష‌యంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ... దేశ ప్ర‌జాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పును ఈ ప‌రిణామాలు ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని తెలిపింది. సుప్రీంకోర్టు ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో ప‌రిస్థితుల‌ను త‌క్ష‌ణం స‌రిదిద్దాల‌ని, లేక‌పోతే దేశ ప్ర‌జ‌ల‌కు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం స‌న్న‌గిల్లే ప్ర‌మాదం ఉంద‌ని త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంది. ఇక మరోవైపు న్యాయమూర్తుల మీడియా సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, చిదంబరం, మనీష్ తివారీ, కపిల్ సిబల్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ అధినేత రాహుల్ తో సమావేశమం కానున్నారు.

అదే క్రమంలో సిపీఐ నేత, రాజ్యసభ సభ్యుడు డి రాజా ఏకంగా సిజేఐ తరువాతి స్థానంలో కొనసాగుతున్న జస్టిస్ చలమేశ్వర్ తో సమావేశం అయ్యారు. అయితే ఈ సమస్యకు తాను రాజకీయ రంగు పులిమేందుకు రాలేదని, అయితే దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇలా న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చేంత సమస్యను కూలంకుశంగా తెలుసుకునేందుకు మాత్రమే తాను చలమేశ్వర్ తో భేటీ అయ్యానని చెప్పారు. రాజకీయ నేతగా తాను ఈ సమస్యను ఎలా పరిష్కరించగలనో కూడా అధ్యయనం చేయడానికి ఈ బేటీ దోహదపడుతుందని అన్నారు.

ఇక న్యాయమూర్తులు మీడియా సమావేశంలోని ముఖ్యాంశాలు

* చీఫ్ జస్టిస్ తో తాము భేటీ అయ్యామని, కొన్ని వ్యవహారాలు సజావుగా నడవడం లేదని, దిద్దుబాటు చర్యలు అవసరమని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, దురదృష్టవశాత్తూ తమ ప్రయత్నాలు విఫలమైనట్టు చెప్పారు.
* చీఫ్ జస్టిస్ కు తాము కొన్ని నెలల క్రితమే లేఖ ఇచ్చినట్టు చెప్పారు.
* న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా లేకపోతే ప్రజాస్వామ్యం మనలేదన్నారు.
* న్యాయమూర్తుల మీడియా సమావేశానికి ముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి  బీహెచ్ లోయా హత్య కేసుకు సంబంధించి అన్ని పత్రాలను తమ ముందుంచాలని మహారాష్ట్ర సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. లోయా హత్య చాలా తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు జడ్జి లోయా ముందు విచారణలో ఉండడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh