డేరా బాబా.. రేప్ కేసులో దోషి.. టూ స్టేట్స్ లో విధ్వంసకాండ | Rape Guru Conviction Leads To Massive Clashes in Haryana

Indian guru convicted of rape revered by millions

Gurmeet Ram Rahim Singh, Dera Clashes, Ram Rahim Guilty Of Rape, Gurmeet Ram Rahim Singh's conviction, Punjab Haryana Violence, Spiritual Guru Rape Case, Dera Baba Life, Dera Sacha Sauda History, Gurmeet Ram Rahim Singh Unknown Facts

The violence in Haryana and Punjab over Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh's conviction in a rape case also spilled over to parts of Delhi and Rajasthan. 30 Died and Hundreds injured.

డేరా దారుణ విధ్వంసం.. 30 మంది మృతి

Posted: 08/26/2017 08:32 AM IST
Indian guru convicted of rape revered by millions

డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్ ను జంట రేప్ కేసులో దోషి అని సీబీఐ కోర్టు ప్ర‌క‌టించిన వెంటనే హ‌ర్యానాలో హింస చెల‌రేగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న దోషి అని హ‌ర్యానాలోని పంచ‌కుల సీబీఐ కోర్టు ప్ర‌క‌టించిన వెంట‌నే పోలీసులు ఆయ‌న‌ను సెంట్ర‌ల్ జైలుకి త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో హ‌ర్యానాలోని పంచ‌కుల‌లో చెల‌రేగుతున్న హింస‌లో మృతుల సంఖ్య 30కి చేరింది. మ‌రో 250 మందికి గాయాల‌య్యాయి. ఈ ఆందోళ‌న రాజస్థాన్‌కి కూడా పాకింది.

ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌ల‌లో ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడి అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకున్నారు. ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌ల‌లో వాహ‌నాలకు, రైల్వే స్టేష‌న్ల‌కు నిప్పు పెడుతూ గుర్మీత్ బాబా అనుచ‌రులు రెచ్చిపోతున్నారు. ప‌లు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో పోలీసులు క‌ర్ఫ్యూ విధించారు.

సీఎంపై సీరియస్...

ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ని ఊహించిన‌ప్ప‌టికీ అల్ల‌ర్ల‌ను అదుపు చేయ‌లేక‌పోవ‌డంతో హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మనోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌పై కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.

కాగా, సీఎం ఖ‌ట్ట‌ర్ పంచ‌కుల‌కు చేరుకున్నారు. ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆ రాష్ట్ర డీజీపీ ఇప్ప‌టివ‌ర‌కు తాము 1000 మంది ఆందోళ‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. ఈ ఘటనలపై కేంద్ర హోం శాఖమంత్రి నివాసంలో రేపు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొంటారు.


ఎవరీ గుర్మీత్.. కేసు ఏంటి?

ఆగస్టు 15 - 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో ఓ భూస్వామి ఇంట గుర్మీత్ సింగ్ జన్మించారు. చిన్నతనం నుంచే గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. పంజాబ్లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమం ఉంది. డేరా స్వచ్చ సౌదాను బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన మస్తానా బలూచిస్తానీ స్థాపించాడు. ఆయన అనుచరులు మస్తానాను పునీత బెపరవాహ్ మస్తానా జీ మహరాజ్ అని పిలుస్తారు. 1960 ఏప్రిల్ 18న ఆ‍యన చనిపోయాక షా సత్నాం స్వచ్చ సౌదా బాధ్యతలు స్వీకరించారు. గురువు షా సత్నాం సింగ్ గుర్మీత్ ను 7 సంవతర్సాల వయసులోనే చేరదీశాడు. ఆ సమయంలో గుర్మీత్ పేరును రామ్ రహీమ్ గా మార్చి మరింత ఆధ్యాత్మికతను నింపాడు. పదహారు సంవత్సరాల తర్వాత 1990లో షా సత్నాం సింగ్ తన శిష్యులను అందరినీ పిలిచి తన వారసుడిగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను ప్రకటించాడు. అప్పుడు రామ్ రహీమ్ వయసు 23 ఏళ్లు.

అంటే గుర్మీత్ రామ్ రహీమ్ స్వచ్చ సౌదాలో మూడో తరం వ్యక్తి….. మస్తానా నుంచి 41 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించిన షా సత్నాం 1990 వరకు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించారు. 1991 డిసెంబర్ 13న ఆయన చనిపోయారు. అప్పటికే అంటే 1990 సెప్టెంబర్ 23న గుర్మీత్ రాం రహీమ్ సింగ్ డేరా చీఫ్ అయ్యారు. ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న రహీమ్.. హర్జీత్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు - ఒక మగ పిల్లాడు.

ఎందుకంత క్రేజ్...

గుర్మీత్ డేరా సచ్చా సౌధ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. పేద పిల్లలకు విద్యను అందించడం - రక్త దానం - అవయవ దానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేవాడు. ఇతని ఉపన్యాసాలతో పలువురిని సేవా కార్యక్రమాలకు ప్రేరేపించేవాడు. గుర్మీత్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. అవి.. ఎంఎస్ జీ(మెసెంజర్ ఆఫ్ గాడ్) - ఎంఎస్ జీ 2. ఇక సిర్సాలోని గుర్మీత్ కు ఒక పెద్ద టౌన్ షిప్ ఉంది. 1000 ఎకరాల స్థలంలో నిర్మించిన టౌన్ షిప్ లో పాఠశాలలు - స్పోర్ట్స్ విలేజ్ - ఆస్పత్రి - సినిమా హాలుతో పాటు ఇతర భవనాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం కూడా చేశాడు. పలువురు పొలిటికల్ నేతలు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తో సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఆయన వీరభక్తులుగా ఉన్నారు.

అత్యాచార ఆరోపణలు...

2002లో ఓ లేఖ ద్వారా గుర్మీత్ పై అత్యాచారం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి ప్రధాని వాజ్ పేయి, హైకోర్టు, ఇతర అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ ఓ సాధ్వీ తనపై గుర్మీత్ అత్యాచారం చేశాడని, తన డెన్(ఆశ్రమం) లో గన్ తో బెదిరించి మరీ పలుమార్లు రేప్ చేశాడని తెలిపింది. దీనిపై ఛండీగఢ్ హైకోర్టు రంగంలోకి దిగి సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆపై సీబీఐ దర్యాప్తులో మరో మహిళపై కూడా అత్యాచారం జరిగిందని రుజువైంది.

ఇక లేఖ బయటకి రావటానికి కారణమైన వ్యక్తి హత్యకు గురికావటంతో గుర్మీత్ పై రేప్ మరియు హత్య కేసు అభియోగాలు సీబీఐ కోర్టు నమోదు చేసింది. చివరకు 15 ఏళ్ల వాదనల తర్వాత అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ ను దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25 - 2017న తీర్పునిచ్చింది. ఆగస్టు 28న ఆయనకు శిక్షను ఖరారు కానున్నాయి.

విధ్వంసం.. ఆస్తుల జప్తునకు ఆదేశం...

గుర్మీత్ రాంరహీం సింగ్ బాబా అరెస్ట్ అనంతరం చెలరేగిన హింసపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోపాటు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది. ఆ వెంటనే కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. రైలు, బస్సుతోసహా గుర్మీత్ అనుచరులు నిప్పంటించి ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడడంతో. గుర్మీత్ అనుచరుల దాడిలో కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఆయన ఆస్తులను అటాచ్ చేయాలని ఆదేశించింది. కాగా, అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌ను పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు గరిష్టంగా ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

భయంలో బాధిత మహిళలు...

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై కోర్టు సంచలన తీర్పు తర్వాత ఆయనపై ఫిర్యాదు చేసిన సాధ్వీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చడంతో ఆయన అనుచరులు పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో హింసాత్మక చర్యలకు దిగారు. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 32 మంది మరణించగా వందలాదిమంది గాయపడ్డారు. దీంతో అత్యాచార బాధితురాళ్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం వారెక్కడున్నారన్న విషయాన్ని వారి న్యాయవాదులు చెప్పేందుకు ఇష్టపడడం లేదు. వారి ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారికి సంబంధించిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ ఈ కేసు నుంచి గుర్మీత్ నిర్దోషిగా బయటపడితే తాము వేరే ప్రాంతానికి వెళ్లిపోతామని బాధితులు తమతో మొరపెట్టుకున్నట్టు న్యాయవాది తెలిపారు. తీర్పు వెలువడడానికి ముందు బాధితురాలిలో ఒకరు మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తాను పెద్ద ప్రమాదంలో ఉన్నానని, స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని వ్యాఖ్యానించినట్టు సమాచారం. గుర్మీత్ అనుచరుల వల్ల తన ప్రాణానికి హాని ఉన్నట్టు ఆమె భయపడినట్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారి భవిష్యత్తు ఏంటన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dera Sacha Sauda  Gurmeet Ram Rahim Singh  Rape Convict  Haryana Clashes  

Other Articles